Share News

అక్రమ హోర్డింగ్‌లు.. యథేచ్ఛగా ఫ్లెక్సీలు

ABN , Publish Date - Dec 07 , 2025 | 11:51 PM

కొన్ని నెలలుగా నగరంలో ఎక్కడ చూసినా హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. రాజకీయ, వ్యాపార, ఇతర కార్యక్రమాల ప్రచారాలకు సంబంధించిన హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు నగరపాలక సంస్థ నుంచి అనుమతి తీసుకోవలసి ఉంటుంది.

అక్రమ హోర్డింగ్‌లు.. యథేచ్ఛగా ఫ్లెక్సీలు
జంక్షన్‌లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ, తోరణాలు

కరీంనగర్‌ టౌన్‌, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): కొన్ని నెలలుగా నగరంలో ఎక్కడ చూసినా హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. రాజకీయ, వ్యాపార, ఇతర కార్యక్రమాల ప్రచారాలకు సంబంధించిన హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు నగరపాలక సంస్థ నుంచి అనుమతి తీసుకోవలసి ఉంటుంది. ప్రజలకు వాటితో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. హోర్డింగ్‌లు, కటౌట్లను ఏర్పాటు చేసే యాడ్‌ ఏజెన్సీలు, కాంట్రాక్టు సంస్థలు, వ్యక్తులు ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేస్తే సంబంధిత అధికారుల నుంచి, ప్రైవేట్‌ స్థలాలు, ఇళ్లపై ఏర్పాటు చేస్తే ఆయా ఇంటి యజమానుల అనుమతి తీసుకోవాలి. నగరపాలక సంస్థకు ఆ బోర్డుల సైజు, ఏరియాను బట్టి నిర్దేశించిన ఫీజు చెల్లించాలి. హోర్డింగ్‌లు, కటౌట్లు ఏ ఎజెన్సీ ఏర్పాటు చేసిందనే సమాచారాన్ని పొందుపరిచి నిర్ణీత సమయం ముగియగానే తొలగించాలి. అయితే గతంలో వాతావరణ ఫ్లెక్సీలను బ్యాన్‌ చేయాలని, వాటి స్థానంలో బట్ట బ్యానర్లను ఏర్పాటు చేసుకోవాలని, వాటికి కూడా ముందస్తు అనుమతి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అనుమతి పొందిన హోర్డింగ్‌లకు మున్సిపాలిటీలు నంబరింగ్‌ చేయాలని, అక్రమ హోర్డింగ్‌లను తొలగించాలని, హోర్డింగ్‌లకు సంబంధించిన కాంట్రాక్టు ఏజెన్సీల నుంచి రావలసిన బకాయిలను వసూలు చేయాలని ఆదేశించింది. ఫ్లెక్సీలను బ్యాన్‌ చేస్తామని, ప్రత్యామ్నాయ వ్యాపారాలు ఎంచుకోవాలంటూ అధికారులు ప్రింటింగ్‌ ప్రెస్‌ యజమానులకు అవగాహన కల్పించారు. దీంతో కొంతమేర ఫ్లెక్సీలు తగ్గాయి.

ఫ నిబంధనలకు విరుద్ధంగా..

కొన్ని నెలలుగా నగరంలో ఎక్కడ చూసినా హోర్డింగ్‌లు, కటౌట్లు, యఽథేచ్చగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లు, డివైడర్ల వద్ద భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్నింటికి అనుమతి తీసుకుని అనుమతికి మించి ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేయడమే కాకుండా రోజుల తరబడి ఉంటున్నా వాటిని తొలగించే వారే లేకుండా పోయారు. ప్రధాన రహదారులతోపాటు నగరంలోని వీధులన్నింటిలో వ్యక్తిగత, ప్రచార ఫ్లెక్సీలకు అనుమతి తీసుకోవడం లేదు. దీంతో నగరపాలక సంస్థ ఆదాయానికి గండిపడుతోంది. హోర్డింగ్‌లు కూడా అనుమతికి మించి ఏర్పాటు చేస్తున్నారని, సైజుల్లో కూడా తక్కువ చార్జీలు చెల్లించి పెద్దవి ఏర్పాటు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలను పాటించని యాడ్‌ ఏజెన్సీల బోర్డులను, ఫ్లెక్సీలను తొలగించాలని నగరవాసులు కోరుతున్నారు.

Updated Date - Dec 07 , 2025 | 11:51 PM