నిబంధనలు బేఖాతరు
ABN , Publish Date - May 23 , 2025 | 01:08 AM
జిల్లాలోని పలు ప్రైవేటు పాఠశాలలు నిబంధనలను గాలికి వదిలేస్తున్నాయి.
జగిత్యాల, మే 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు ప్రైవేటు పాఠశాలలు నిబంధనలను గాలికి వదిలేస్తున్నాయి. ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ లేకుండా పోయింది. పాఠశాలల్లో యూనిఫాంలు, పుస్తకాల అమ్మకాల నిషేధంపై ప్రభుత్వ ఆదేశాలు అమలు కావడం లేదు. పలు పాఠశాలల్లో ప్రతి సంవత్సరం యూనిఫాంలు, టై, బెల్టులు, పుస్తకాలను సైతం అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇవి విద్యార్థుల తల్లిదండ్రులకు ఽభారంగా మారుతున్నాయి. కేవలం ఇరవై శాతం లోపు పాఠశాలలు మాత్రమే రూల్స్ పాటిస్తున్నాయి. ప్రధాన రహదారుల పక్కనే కొనసాగుతున్న స్కూళ్లకు ప్రహారి లేకున్నా ట్రాఫిక్ నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్లు ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి. జిల్లాలో చాలా పాఠశాలల్లో ఆట స్థలం లేదు. కొన్ని పాఠశాలల్లో ఆట స్థలం ఉన్నా పీఈటీలు లేరు. పలు పాఠశాలలు అనుమతుల సమయంలో బీఈడీ, పీజీ సర్టిఫికెట్లు ఉన్న వారిని చూపించి అర్హత లేని వారితో పాఠాలు చెప్పిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చాలా పాఠశాలలు నిబంధనలు పాటించనప్పటికీ విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.
ఫజిల్లాలో ప్రైవేటు పాఠశాలల పరిస్థితి ఇలా..
జిల్లా వ్యాప్తంగా 293 వివిధ ప్రైవేటు పాఠశాలలున్నాయి. ఇందులో 15 ప్రాథమిక పాఠశాలలు, 149 ప్రాథమికోన్నత పాఠశాలలు, 129 ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిల్లో సుమారు 68,019 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. ఇందులో ప్రాథమిక పాఠశాలల్లో 3,072 మంది, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 16,996 మంది, ఉన్నత పాఠశాలల్లో 47,951 మంది విద్యను అభ్యసిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలల్లో 3,257 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా ఇందులో ప్రాథమిక పాఠశాలల్లో 146 మంది, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1,036 మంది, ఉన్నత పాఠశాలల్లో 2,075 మంది ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నట్లు విద్యాశాఖ రికార్డులు తెలుపుతున్నాయి.
ఫ హాస్టల్స్ నిర్వహణలో నిబంధనలు తూచ్
జిల్లాలో ప్రతీయేటా పలు ప్రైవేటు పాఠశాలలు ఎటువంటి అనుమతి లేకుండా హాస్టల్స్‌ను నిర్వహిస్తున్నారు. హాస్టల్ పేరుతో అదనపు ఫీజులను గుంజుతున్నాయి. ఎటువంటి సౌకర్యాలు లేని భవనాల్లో హాస్టల్స్ నిర్వహిస్తుండడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లాలో చాలా పాఠశాలలకు రెసిడెన్షియల్ అనుమతి లేనట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 80 వరకు రెసిడెన్షియల్ పాఠశాలలున్నట్లు అంచనా. నాణ్యమైన భోజనం, వైద్యం, రక్షణ తదితర వసతులను కల్పించాల్సి ఉన్నప్పటికీ యాజమాన్యాలు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో వసతిగృహం నిర్వహణకు అనుమతి లేకపోయినప్పటికీ సదరు నిర్వాహకులు ముందస్తు ప్రవేశాలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. వచ్చే విద్యా సంవత్సరానికి జిల్లాలోని ఓ ప్రధాన పట్టణంలో ఓ ప్రైవేటు పాఠశాలను ఏర్పాటు చేయడానికి నిర్వాహకులు కసరత్తులు చేస్తున్నారు. అనుమతి పొందడానికి సమర్పించిన స్థలంలో కాకుండా ఇతర స్థలంలో ఏర్పాటు చేస్తున్నారని, ఆట స్థలం లేకపోవడం, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదన్న విమర్శలున్నాయి.
ఫ ఫీజుల నియంత్రణ కరువు
కార్పొరేటు, ప్రైవేటు విద్యాసంస్థలో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థ అంటూ ఏమీ లేదు. దీంతో ఆయా విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా ఫీజులను వసూలు చేస్తున్నాయి. భారీగా పెరిగిన ఫీజులతో సామాన్య ప్రజలకు విద్య అందని ద్రాక్షగా మారుతోంది. ఫీజుల నియంత్రణకు తమిళనాడు, కర్ణాటక, మహరాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, పంజాబ్ సహా 15 రాష్ట్రలలో అక్కడి ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తెచ్చాయి. తెలంగాణ కూడా ఇదే తరహా చట్టాలను తెస్తే తప్ప ఫీజుల నియంత్రణకు చెక్ పడే అవకాశం కనిపించడం లేదని విద్యార్థి సంఘాలు అంటున్నాయి. విద్యాహక్కు చట్టం సెక్షన్-6 ప్రకారం ప్రభుత్వ నిబంధనల ప్రకారం అడ్మిషన్లు జరగాలి. సెక్షన్-11లో సూచించిన విధంగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు గవర్నింగ్ బాడీ నిర్ణయించిన ఫీజులను మాత్రమే వసూలు చేయాలి. వసూలు చేసే ఫీజుల వివరాలను నోటీసు బోర్డులో పెట్టాలి. సెక్షన్-12 ప్రకారం విద్యార్థుల, ఉపాధ్యాయుల నిష్పత్తి 1:20కి మించరాదు. ప్రతి పాఠశాలలో 25 శాతం సీట్లను ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మైనార్టీలకు కేటాయించాలి. పాఠశాల యాజమాన్యాలు నోట్ బుక్స్, యూనిఫాం, బ్యాగులు, ఇతర స్టేషనరీ అమ్మరాదు. జిల్లాలో ఇవేవీ సక్రమంగా అమలు కావడం లేదన్న ఆరోపణలున్నాయి.
అక్రమాలను అరికట్టాలి
-దొనికెల నవీన్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
ప్రైవేటు పాఠశాలల అక్రమాలను ప్రభుత్వం అరికట్టాలి. గతంలో పలు కమిటీలు వేసినప్పటికీ అవి నిబంధనల అమలును పట్టించుకోవడం లేదు. పాఠశాలల్లో మౌలిక వసతులు, అర్హులైన ఉపాధ్యాయులు, గ్రంథాలయం, ఆట స్థలం నిబంధనల ప్రకారం ఉండేలా చర్యలు తీసుకోవాలి.
నిబంధనలు పాటించాలి
-రాము, జిల్లా విద్యాశాఖ అధికారి
జిల్లాలో ప్రైవేటు బాలురు, బాలికల వసతి గృహాల నిర్వహణకు అనుమతులు ఇప్పటి వరకు ఏమీ ఇవ్వలేదు. ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. బేఖాతరు చేస్తే ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటాం.