Share News

నిబంధనలు బేఖాతరు

ABN , Publish Date - Jun 22 , 2025 | 01:14 AM

జిల్లా విద్యా శాఖలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్న అధికారికి జిల్లా విద్యా శాఖాధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించకుండా కరీంనగర్‌ జిల్లా విద్యాశాఖలో పని చేసే అసిస్టెంట్‌ డైరెక్టర్‌ను సుదీర్ఘ కాలంగా ఇక్కడ డీఈవోగా కొనసాగించడంలో ఆంతర్యమేమిటని విద్యార్థి సంఘాల నాయకులు అంటున్నారు.

నిబంధనలు బేఖాతరు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లా విద్యా శాఖలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్న అధికారికి జిల్లా విద్యా శాఖాధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించకుండా కరీంనగర్‌ జిల్లా విద్యాశాఖలో పని చేసే అసిస్టెంట్‌ డైరెక్టర్‌ను సుదీర్ఘ కాలంగా ఇక్కడ డీఈవోగా కొనసాగించడంలో ఆంతర్యమేమిటని విద్యార్థి సంఘాల నాయకులు అంటున్నారు. సదరు అధికారిని డీఈవో బాధ్యతల నుంచి తప్పించాలని విద్యార్థి, యువజన సంఘాల నాయకులు ఈ నెల 3న కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అలాగే సమగ్ర శిక్షలో అకౌంట్స్‌ ఆఫీసర్‌గా పని చేసిన పవన్‌కుమార్‌ అనే అధికారి నిబంధనలకు విరుద్ధంగా కలెక్టర్‌ను తప్పుదోవ పట్టించి కంప్యూటర్లు, ఫర్నీచర్‌ కొనుగోలు చేయడంతోపాటు కొన్ని సివిల్‌ పనులు చేశారని సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారికి 2023 డిసెంబర్‌ 29వ తేదీన లేఖ రాశారు. 2016లో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో 10 జిల్లాలను 33 జిల్లాలుగా విభజించారు. వివిధ శాఖలకు జిల్లా అధికారులను నియమించేందుకు రెగ్యులర్‌ అధికారులు లేకపోవడంతో కింది స్థాయి అధికారులకే అదనపు బాధ్యతలను అప్పగించారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పెద్దపల్లి జిల్లాకు కూడా అదే ప్రాతిపదికన అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికీ రెగ్యులర్‌ పోస్టులు భర్తీ కాకపోవడంతో పలువురు అధికారులు అదనపు బాధ్యతల్లోనే కొనసాగుతున్నారు. విద్యా శాఖలో రెగ్యులర్‌ డీఈవో స్థాయి అధికారులు లేకపోవడంతో అసిస్టెంట్‌ డైరెక్టర్లను ఆ బాధ్యతల్లో కొనసాగిస్తూ వస్తున్నారు.

కరీంనగర్‌ జిల్లా విద్యా శాఖలో పని చేసే అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డి మాధవి పెద్దపల్లి జిల్లా విద్యాశాఖాధికారిగా కొనసాగుతున్నారు. సదరు అధికారి 2021 సెప్టెంబర్‌ 16 నుంచి పెద్దపల్లి డీఈవోగా 45 నెలలుగా పని చేస్తున్నారు. నాలుగు మాసాల క్రితం ప్రభుత్వం శారద అనే అధికారికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పదోన్నతి కల్పించి పెద్దపల్లికి బదిలీ చేశారు. అయితే ఆమెకు డీఈవోగా అదనపు బాధ్యతలు ఇవ్వకుండా కరీంనగర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ను కొనసాగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెగ్యులర్‌ డీఈవోలు లేని చోట అక్కడే అసిస్టెంట్‌ డైరెక్టర్లుగా పని చేస్తున్న వారికి డీఈవోగా అదనపు బాధ్యతలను అప్పగిస్తున్నారు. గతంలో పెద్దపల్లిలో ఏడీగా విధులు నిర్వహించిన కె రాముకు జనగాం డీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆరు మాసాల క్రితం ఏడీ రామును జగిత్యాల జిల్లాకు బదిలీ చేయగా, ఆయనకు అక్కడే డీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏడీగా పని చేసిన రమేష్‌ను నాగర్‌ కర్నూల్‌ జిల్లాకు బదిలీ చేసి అక్కడే డీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. జిల్లా స్థాయి అధికారులుగా ఒకే చోట మూడేళ్లకు మించి పని చేయించరాదనే నిబంఽధనలు ఉన్నప్పటికీ, అదనపు బాధ్యతల్లో ఒక అధికారిని ఒకే చోట సుదీర్ఘంగా కొనసాగించడంపై విమర్శలు వస్తున్నాయి. విద్యార్థి, యువజన సంఘాలకు చెందిన నాయకులు పలు ఆరోపణలు చేస్తూ డీఈవో బాధ్యతల నుంచి తప్పించాలని కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. ఉపాధ్యాయుల శిక్షణ కోసం ప్రభుత్వం ఇచ్చే నిధుల వ్యయంలో అవకతవకలు జరిగాయని, కంప్యూటర్లు, ఫర్నీచర్‌ కొనుగోళ్లలో నిబంధనలు పాటించలేదని, ప్రైవేట్‌ పాఠశాలలకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పర్యవేక్షణ కరువైందని, ఏడాది క్రితం ఇక్కడికి కలెక్టర్‌గా వచ్చిన కోయ శ్రీహర్ష ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించి పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పన, నాణ్యమైన విద్యను అందించే విషయమై దృష్టి సారిస్తుండగా డీఈవో పాఠశాలలను అంతంత మాత్రంగానే సందర్శించారని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఆమెను డీఈవో బాధ్యతల నుంచి తప్పించి ఇక్కడే పని చేస్తున్న మరొక అధికారికి బాధ్యతలు అప్పగించాలని విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Updated Date - Jun 22 , 2025 | 01:14 AM