లెక్క తప్పితే వేటే...!
ABN , Publish Date - Oct 08 , 2025 | 01:13 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నికల సంఘం విధించిన నిబంధనలను అనుసరించే అభ్యర్థులు ఖర్చు చేయా లని, పరిమితికి మించి ఖర్చు పెడితే వేటు వేయాల్సి వస్తుందని ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నికల సంఘం విధించిన నిబంధనలను అనుసరించే అభ్యర్థులు ఖర్చు చేయా లని, పరిమితికి మించి ఖర్చు పెడితే వేటు వేయాల్సి వస్తుందని ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి మండల, జిల్లా పరిషత్ ఎన్ని కలను రెండు విడతల్లో, ఈ నెల 17 నుంచి గ్రామ పం చాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహిం చేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 9 విడుదల చేసింది. జీవోను సవాల్ చేస్తూ రెడ్డి జాగృతి సంఘం నాయకుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా బుధవారం కోర్టు తీర్పును వెలువరించనున్నది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా తీర్పు వస్తే మరుసటి రోజు నుంచే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నది. లేదంటే మళ్లీ రిజర్వేషన్ల ప్రక్రి యను చేపట్టాల్సి ఉంటుంది. ఈ అంశంపై కోర్టు తీర్పు ఎలా ఉన్నా జిల్లా అధికార యంత్రాంగం ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలో 13 జడ్పీటీసీ స్థానా లు, 137 ఎంపీటీసీ స్థానాలు, 263 సర్పంచ్ స్థానాలు, 2,432 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆయా పదవులకు పోటీ చేసేందుకు అభ్యర్థుల అర్హ తలు, ఎన్నికల సందర్భంగా విధించిన కోడ్ ఉల్లంఘించ రాదని, అభ్యర్థులు ఎంత వరకు ఖర్చు చేయాలి, ఎప్ప టికప్పుడు ఖర్చు వివరాలను సమర్పించాలని, తదితర అంశాలపై ఎన్నికల అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాలు నిర్వహించి ఎన్నికల నియమావళి, ఎన్నికల ఖర్చు, తదితర అంశాల గురించి అధికారులు వివరించారు.
ఫ జడ్పీటీసీ అభ్యర్థికి రూ.4 లక్షలు
ఎన్నికల సంఘం విధించిన నిబంధనల ప్రకారం జడ్పీటీసీ అభ్యర్థి 4 లక్షల రూపాయలు మించి ఖర్చు చేయరాదు. ఎంపీటీసీ అభ్యర్థి లక్షా 30 వేల రూపా యలు ఖర్చు చేయరాదని పేర్కొన్నారు. అలాగే గ్రామ సర్పంచ్ స్థానానికి పోటీ చేసే అభ్యర్థి గ్రామ జనాభా 5 వేల లోపు జనాభా ఉంటే లక్షా 50 వేలు, వార్డు సభ్యు డికి పోటీ చేసే అభ్యర్థి రూ.30 వేలు, 5 వేల జనాభా దాటితే 2 లక్షల 50 వేలు, వార్డు సభ్యుడు అభ్యర్థి 50 వేల రూపాయలకు మించకుండా ఖర్చు చేయాల్సి ఉం టుంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపునకు రాజకీయ పార్టీలు పెట్టే ఖర్చును కూడా అభ్యర్థుల ఖాతాల్లోనే జమ చేస్తారు. అభ్యర్థుల ఖర్చుపై ఎప్ప టికప్పుడు సర్వైవల్ టీమ్స్, ఎన్నికల వ్యయ పరిశీల కులు, వీడియోలు, ఫొటోల చిత్రీకరణ చేసి ఖర్చును లెక్కిస్తారు. అభ్యర్థులు చేసిన ఖర్చుకు సంబంధించి తక్కువ చేసి లెక్కలు సమర్పించినప్పుడు వీడియోలు, ఫొటోలను పరిశీలించి సరి చేస్తారు. ఎన్నికల కోసం వాడే ప్రచార సామగ్రి, తదితర వాటికి ఎన్నికల సం ఘం ధరలు నిర్ణయించింది. ఆ ధరల ప్రకారమే అభ్యర్థులు ఎన్నికల ఖర్చు చూపాల్సి ఉంటుంది.
ఫ ప్రచార సామగ్రికి ఎన్నికల సంఘం నిర్ణయించిన ధరలు
ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు బ్యానర్లు, పోస్టర్లు, కరపత్రాలు, బ్యాడ్జీలు, వాల్‌రైటింగ్స్, నమూనా బ్యాలె ట్లు, తదితర వాటిని ముద్రించి ఓటర్లకు పంపిణీ చేస్తారు. అలాగే ప్రచారానికి మైకులు, లౌడ్ స్పీకర్లు వినియోగిస్తుంటారు. వీటన్నింటికీ ఎన్నికల సంఘం ధరలు నిర్ణయించింది. లౌడ్ స్పీకర్‌కు రోజుకు అద్దె 900, జనరేటర్‌తో కూడిన డీజే సిస్టమ్‌కు 10 వేలు, ఎల్‌ఈడీ స్ర్కీన్ 8/6కు అద్దె 9 వేల రూపాయలు, వాహనంపై ఎల్‌ఈడీ అమర్చితే 20 వేలు, వీడియోగ్రాఫర్ కెమెరాతో కలిపి 1800, డ్రోన్ కెమెరా 5 వేలు నిర్ణయించారు. మీడియం సైజ్ హైడ్రోజన్ బెలూన్‌కు 4 వేలు, నలుగు రైదుగురు కూర్చునే వేదిక ఏర్పాటుకు 3 వేలు, ఫ్లెక్సీ బ్యానర్లు 4/6 సైజు 450 రూపాయలు, 6/6 బ్యానర్‌కు 700 రూపాయలు, 6/12కు 1200 రూపాయలు, 8/4 సైజు బ్యానర్‌కు 850 రూపాయలు, 8/6 సైజ్ బ్యానర్ కు 900 రూపాయలు, 8/12 సైజు బ్యానర్‌కు 1500 రూపాయలు, 10/12 సైజు బ్యానర్‌కు 2 వేలు, ఒక్కో బ్యాడ్జీకి 10, పోస్టర్లు 18/23 ఇంచులు సింగిల్ కలర్ 6, మల్టీ కలర్ 8 రూపాయల ధర నిర్ణయించారు. 8/12 అడుగుల హోర్డింగ్ ఏర్పాటుకు లేబర్‌తో కలిపి 8,500 రూపాయలు, కారు, జీపు వాహనాలకు డ్రైవర్‌తో కలిపి అద్దె 2 వేలు, ఇన్నోవా కారు 4 వేలు, టెంపో, ట్రక్, డీసీఎం వ్యాన్‌కు అద్దె 3,500, ట్రాక్టర్‌కు వెయ్యి, ఆడియో ద్వారా పబ్లిసిటీ కోసం 3వేలు, మూడు చక్రాల వాహ నంకు 1200 రూపాయలు, ద్విచక్ర వాహనానికి 300, మినీ బస్సు (12 సీట్ల కెపాసిటీ)కి 3,500, ఏసీ ఫంక్షన్ హాల్‌కు కుర్చీలతో 12 వేలు, నాన్‌ఏసీ ఫంక్షన్ హాల్‌కు 8 వేలు, టెంట్ సైజ్‌ను బట్టి 600 నుంచి 1500 వరకు, పెద్ద సైజ్ కార్పెట్‌కు 150, చిన్న సైజు కార్పెట్‌కు 100, వాటర్ ప్యాకెట్ ఒక రూపాయి, వాటర్ బాటిల్‌కు 20, టీకి 8, కాఫీ 10, బ్రేక్‌ఫాస్ట్‌కు 35 రూపాయలుగా నిర్ణయించారు. భోజనం 80, కూరగాయల బిర్యానీ 100, చికెన్ బిర్యానీకి 140, మటర్ బిర్యానీకి 160 ధర నిర్ణయించారు. ఇలా 133 రకాల ప్రచార సామగ్రి, ఆహా ర పదార్థాలు, శీతల పానీయాలకు ధరలు నిర్ణయిం చారు. ఈ ధరల ప్రకారమే ఎన్నికల అధికారికి బిల్లులు సమర్పించాలి. ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా గెలిచిన అభ్యర్థులతోపాటు ఓటమి చెందిన అభ్యర్థులు కూడా లెక్కలు సమర్పించాల్సి ఉంటుంది. పరిమితికి మించి ఖర్చు పెట్టిన అభ్యర్థులు, మొత్తానికే ఖర్చు చూపని వారిపై నిబంధనల ప్రకారం వేటు వేయ నున్నారు. ఆ మేరకు జిల్లాలో 2019లో జరిగిన ఎన్ని కల్లో చాలా మంది ఓటమి చెందిన అభ్యర్థులతో పాటు, గెలిచిన వాళ్లు సైతం లెక్కలు సమర్పించ లేదు. వారం దరికీ నోటీసులు జారీ చేసి ఐదేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేశారు.