Share News

మహిళలను వేధిస్తే కటకటాలే...

ABN , Publish Date - Sep 04 , 2025 | 01:43 AM

కరీంనగర్‌ క్రైం, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): మహిళలు, యువతులు, బాలికల భద్రతకు పోలీస్‌ శాఖ అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. మహిళలపై జరిగే నేరాలకు జీరో టాలరెన్స్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. షీటీం బృందాలు విద్యాసంస్థలు, కాలనీలు, ఇతర ప్రాంతాల్లో పోకిరీల వేధింపులపై ఏ విధంగా ఫిర్యాదు చేయాలి? పోకిరీల వేధింపుల నుంచి తప్పించుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేదానిపై మహిళలు, యవతులు, విద్యార్థినిలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాయి.

మహిళలను వేధిస్తే కటకటాలే...

- కమిషనరేట్‌లోని 70 హాట్‌స్పాట్‌లలో ‘షీటీం’ నిఘా

- నెల రోజుల్లో నాలుగు క్రిమినల్‌ కేసులు నమోదు, 24 అవగాహన సదస్సులు

- 30 మంది పోకిరీల పట్టివేత, కౌన్సెలింగ్‌

కరీంనగర్‌ క్రైం, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): మహిళలు, యువతులు, బాలికల భద్రతకు పోలీస్‌ శాఖ అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. మహిళలపై జరిగే నేరాలకు జీరో టాలరెన్స్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. షీటీం బృందాలు విద్యాసంస్థలు, కాలనీలు, ఇతర ప్రాంతాల్లో పోకిరీల వేధింపులపై ఏ విధంగా ఫిర్యాదు చేయాలి? పోకిరీల వేధింపుల నుంచి తప్పించుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేదానిపై మహిళలు, యవతులు, విద్యార్థినిలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాయి. విద్యాసంస్థలు, బస్టాండ్‌, వాణిజ్య సముదాయాలు, పార్క్‌ల వంటి ప్రదేశాల్లో షీటీం సభ్యులను మఫ్టీలో నిఘాపెట్టి పోకిరీలను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు. ఇటువంటి సందర్భాల్లో వేధింపుల తీవ్రత, బాధితుల ఫిర్యాదులతో క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తున్నారు. కొందరికి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్‌ ఇస్తూ హెచ్చరించి వదిలిపెడుతున్నారు. ముఖ్యంగా వినాయక ఉత్సవాల సందర్భంగా కోలాటం, ఊరేగింపుల వద్ద షీటీంల ప్రత్యేక నిఘా పెట్టారు. యువతులు, మహిళలతో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, అభ్యంతరకర ఫోటోలు లేదా వీడియోలు తీసినా వెంటనే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. జిల్లాలో మహిళల రక్షణ కోసం షీ టీంలు, యాంటీ ఉమెన్‌ ట్రాఫికింగ్‌ టీంలు నిరంతరం పనిచేస్తున్నాయి. విద్యార్థినులు, మహిళలు వేధింపులకు గురైనప్పుడు భయపడకుండా ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీస్‌కమిషనర్‌ గౌస్‌ ఆలం సూచిస్తున్నారు. కళాశాలలు, పాఠశాలల్లో ర్యాగింగ్‌, ఈవ్‌ టీజింగ్‌, పని ప్రదేశాల్లో వేధింపులు లేదా బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. షీటీంల ద్వారా జిల్లా వ్యాప్తంగా 24 గంటల పహారా కొనసాగిస్తున్నారు. ఆగస్టు నెలలో 24 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

ఫ జాగ్రత్తగా ఉండాలి

సోషల్‌ మీడియాలో (ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌) ఫోటోలు, వీడియోలు పోస్ట్‌ చేసేటప్పుడు మహిళలు తమ వ్యక్తిగత భద్రతకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా వేధింపులకు గురైనప్పుడు నేరుగా సంప్రదించలేని వారు షీటీం వాట్సప్‌ నంబర్‌ 8712670759కు లేదా డయల్‌ 100కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వవచ్చని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలుపుతున్నారు. కమిషనరేట్‌ వ్యాప్తంగా ఆగస్టు నెలలో అందిన ఫిర్యాదుల ఆధారంగా నాలుగు క్రిమినల్‌ కేసులు నమోదు చేసిన పోలీసులు, నిందితులు 10 మందికి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్‌ ఇచ్చారు. 70 హాట్‌స్పాట్‌లలో నిఘా పెట్టి 30 మంది పోకిరీలను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకొని కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

ఫ మహిళలను వేధిస్తే క్రిమినల్‌ కేసులు

- గౌస్‌ ఆలం, పోలీస్‌కమిషనర్‌

మహిళలు, యువతులు, విద్యార్థినులను వేధింపులకు గురిచేసే పోకిరీలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం. వేధింపులకు గురయ్యే మహిళలు షీటీం, డయల్‌ 100కు నిర్భయంగా ఫిర్యాదు చేయాలి. మహిళలను ఇబ్బందులకు గురి చేసిన వారికి కఠిన శిక్ష తప్పదు. ఒంటరిగా ప్రయాణించే మహిళలు టీ సేఫ్‌ యాప్‌ను ఉపయోగించుకోవాలి.

Updated Date - Sep 04 , 2025 | 01:43 AM