Share News

మొదలైన అభ్యర్థుల వేట..

ABN , Publish Date - Oct 04 , 2025 | 12:31 AM

స్థానిక సంస్థల ఎన్నికలు షెడ్యూల్‌ విడుదల కావ డంతో జడ్పీ చైర్మన్‌ పీఠాన్ని దక్కించుకునేందుకు ఆయా రాజకీయ పార్టీలు అభ్యర్థుల వేట మొదలు పెట్టాయి. పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పీఠం జనరల్‌ మహిళకు కేటాయించడంతో పోటీ తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎస్సీ, బీసీ, జనరల్‌ స్థానాల్లో పోటీ చేసే మహిళలకు చైర్మన్‌ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో 14 మండలాలు ఉండగా, గ్రామీణ ప్రాంత మండలాలు 13 ఉన్నాయి.

మొదలైన అభ్యర్థుల వేట..

- జడ్పీ చైర్మన్‌ పీఠం దక్కించుకోవడమే లక్ష్యం

- అధికార పార్టీ సహా బీజేపీ, బీఆర్‌ఎస్‌ వ్యూహాలు

- ఏ పార్టీలో చేరాలోనని ఆలోచన చేస్తున్న జంప్‌ జిలానీలు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

స్థానిక సంస్థల ఎన్నికలు షెడ్యూల్‌ విడుదల కావ డంతో జడ్పీ చైర్మన్‌ పీఠాన్ని దక్కించుకునేందుకు ఆయా రాజకీయ పార్టీలు అభ్యర్థుల వేట మొదలు పెట్టాయి. పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పీఠం జనరల్‌ మహిళకు కేటాయించడంతో పోటీ తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎస్సీ, బీసీ, జనరల్‌ స్థానాల్లో పోటీ చేసే మహిళలకు చైర్మన్‌ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో 14 మండలాలు ఉండగా, గ్రామీణ ప్రాంత మండలాలు 13 ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పించే ఉద్ధేశ్యంతో జీవో 9 జారీ చేసింది. ఈ జీవోను సవాలు చేస్తూ రెడ్డి జాగృతి సంఘం ప్రతినిధి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ పై ఈనెల 8న హైకోర్టు విచారణ జరపనున్నది. ఇది ఇలా ఉండగా, ప్రభుత్వం అదే జీవో ప్రకారం ఎన్నికలకు వెళ్ళేందుకు సన్నద్ధం అయ్యింది. ఆ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం మండల జిల్లా పరిషత్‌ ఎన్నికలతోపాటు గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూలు కూడా విడుదల చేసింది. షెడ్యూల్‌ విడుదలకు ముందే జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్‌, వార్డు సభ్యు లకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఎస్సీ ఎస్టీలకు 2011జనాభా ప్రాతిపదికన, బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది జరిపిన కుల గణన లెక్కల ప్రకారం, సవరణ చేసిన రొటేషన్‌ ప్రకారం రిజర్వేషన్లను ఖరారు చేశారు. అందులో భాగంగా రాష్ట్ర స్థాయిలో జిల్లా పరిషత్‌ పీఠం జనరల్‌ మహిళకు కేటాయించారు.

ఫ ఎస్సీ, ఎస్టీ, బీసీ స్థానాల్లో మహిళలు పోటీ చేసేందుకు అవకాశం..

జిల్లాలో గల 13 గ్రామీణ ప్రాంతాలకు ఖరారు చేసిన రిజర్వేషన్ల ప్రకారం ధర్మారం ఎస్సీ జనరల్‌, జూలపల్లి మహిళ, పాలకుర్తి ఎస్సీ జనరల్‌, ఎలిగేడు జనరల్‌, కమాన్‌పూర్‌ జనరల్‌ మహిళ, ముత్తారం జనరల్‌, ఓదెల జనరల్‌ మహిళ, అంతర్గాం బీసీ మహిళ, మంథని బీసీ జనరల్‌, పెద్దపల్లి బీసీ మహిళ, రామగిరి బీసీ, రామగిరి బీసీ జనరల్‌, కాల్వ శ్రీరాంపూర్‌ బీసీ మహిళ, సుల్తానాబాద్‌ బీసీ జనరల్‌ కు కేటాయించారు. ఈ స్థానాల్లో మహిళలు ఎవరు గెలిచినా కూడా వారికి జిల్లా పరిషత్తు చైర్మన్‌ అయ్యే అవకాశం ఉంటుంది. ఏ పార్టీ మెజార్టీ స్థానాలు సాధిస్తుందో ఆ పార్టీకి చెందిన మహిళ జడ్పీ చైర్మన్‌ కానున్నది. జిల్లా పరిషత్తు చైర్మన్‌ పదవిని దృష్టిలో పెట్టుకొని అధికార కాంగ్రెస్‌ పార్టీ సహా భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి నాయకులు అభ్యర్థుల వేటలో పడ్డారు. అధికార కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చే విధంగా బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు ఎవరిని నిలబెడితే బాగుంటుందనే విషయమై అభ్యర్థుల వేటలో పడ్డారు. ఆయా పార్టీలు గెలుపు గుర్రాల కోసమే వేట ఆరంభించగా, అధికార కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆపరేషన్‌ ఆకర్ట్‌కు తెర తీస్తున్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీలకు చెందిన నాయకులు అధికార కాంగ్రెస్‌ పార్టీ నుంచి టికెట్లు ఇస్తే ఆ పార్టీలో చేరేందుకు పలువురు నాయకులు సిద్ధం అవుతున్నారు. ఎన్నికల్లో ఇప్పటి వరకు తెర మీద లేనటువంటి నాయకులు ఆకస్మికంగా పుట్టుకు వస్తున్నారు. పార్టీ కోసం విరుద్ధంగా పని చేసిన నాయకులు తమకే టికెట్‌ వస్తాయని ఆశిస్తుం డగా, ఆకస్మికంగా తెరమీదకి వచ్చిన నాయకులు అడ్డుపడుతుండడంతో వారు కంగారు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలు ఎవరిని అభ్యర్థిగా నిలబెడతారో తెలియని పరిస్థితి నెలకొన్నది. ప్రధానంగా ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీతో పాటు బీఆర్‌ఎస్‌, బీజేపీకి చెందిన నాయకులు అప్పుడే వ్యూహాలకు పదును పెడుతున్నారు. అయితే ఈనెల 8వ తేదీన హైకోర్టు తుది విచారణలో ఏమి తెలుస్తుందో అనే విషయమై కూడా కొందరు నాయకులు వేచి చూస్తామనే ధోరణితో ఉన్నారు. హైకోర్టు తీర్పు బీసీ రిజర్వేషన్లకు అనుకూ లంగా వస్తే ఆ మరుసటి రోజు నుంచే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. దీంతో ఆయా రాజకీయ పార్టీలు ముందు జాగ్రత్తతో ఇప్పటి వరకు ప్రకటించిన రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేసే విషయంలో ఆచితూచి అడుగు వేస్తున్నారు. మొత్తం మీద జడ్పీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ఆయా పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి.

Updated Date - Oct 04 , 2025 | 12:31 AM