Share News

జమ్మికుంటలో భారీగా మక్కల నిల్వలు

ABN , Publish Date - May 19 , 2025 | 12:31 AM

జమ్మికుంట పట్టణంలో కొంత మంది దళారులు భారీ స్థాయిలో మక్కలను అక్రమంగా నిల్వలు చేసినట్లు తెలిసింది. గత ఏడాది క్వింటాల్‌ మూడు వేల ధర పలికింది. ఈ ఏడాది అదే స్థాయిలో ధరలు పెరుగుతాయని ఆశించిన దళారులు రైతుల నుంచి తక్కువ ధరకు కొని పెద్ద ఎత్తున నిల్వలు చేసుకున్నారు.

జమ్మికుంటలో భారీగా మక్కల నిల్వలు

జమ్మికుంట, మే 18 (ఆంధ్రజ్యోతి): జమ్మికుంట పట్టణంలో కొంత మంది దళారులు భారీ స్థాయిలో మక్కలను అక్రమంగా నిల్వలు చేసినట్లు తెలిసింది. గత ఏడాది క్వింటాల్‌ మూడు వేల ధర పలికింది. ఈ ఏడాది అదే స్థాయిలో ధరలు పెరుగుతాయని ఆశించిన దళారులు రైతుల నుంచి తక్కువ ధరకు కొని పెద్ద ఎత్తున నిల్వలు చేసుకున్నారు. ప్రభుత్వ మద్ధతు ధర 2,225 రూపాయలు కాగా, వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్‌ మక్కలకు 2,050 నుంచి 2,100 చెల్లించి ఖరీదుదారులు కొన్నారు. ఇప్పటి వరకు యార్డు పరిధిలో 1.5 లక్షల క్వింటాళ్లను ఖరీదుదారులు కొనుగోలు చేసినట్లు మార్కెట్‌ లెక్కలు చెబుతున్నాయి. దళారులు 50 వేల క్వింటాళ్ల పైచిలుకు మక్కలు కొన్నారు. జీరో టాక్స్‌ కావడంతో ప్రైవేట్‌ వ్యక్తులు ఎలాంటి లైసెన్స్‌ లేకుండానే మక్కలను పోటీపడి రైతుల నుంచి కొనుగోలు చేశారు. మక్కలకు మార్కెట్‌ ఫీజు ఒక శాతం చెల్లించాల్సి ఉంటుంది. దళారులు మాత్రం అవన్నీ మాకు తెలియదు, మా రూటే సపరేటు అన్న మాదిరిగా ఫీజుకు ఎగవేస్తూ మార్కెట్‌ ఆదాయానికి గండి కొడుతున్నారు.

ఫ 50 వేల క్వింటాళ్ల అక్రమ నిల్వలు

జమ్మికుంట పరిధిలో 50 వేల క్వింటాళ్ల పైచిలుకు మక్కల అక్రమ నిల్వలు ఉన్నట్లు తెలిసింది. సగటు ధర క్వింటాల్‌కు 2,100 రూపాయల ప్రకారం 50 వేల క్వింటాళ్లకు 10.5 కోట్లు విలువ చేస్తుంది. ఈ యేడు ప్రభుత్వ రంగ సంస్థ మార్క్‌ఫెడ్‌ కొనుగోళ్లకు దూరంగా ఉండడంతో దళారులు చెలరేగి పోయారు. ప్రభుత్వ మద్ధతు ధర కంటే 125 నుంచి 175 రూపాయలు రైతుల నుంచి కొనుగోలు చేశారు. దీంతో రైతులు 87.5 లక్షల వరకు నష్టపోవాల్సి వచ్చింది. మక్కలు అమ్ముకున్న రైతులకు పూర్తి స్థాయిలో దళారులు డబ్బులు చెల్లించనట్లు తెలుస్తుంది.

ఫ లైసెన్స్‌ లేని ట్రేడర్లకు నోటీస్‌లు జారీ

లైసెన్స్‌ లేకుండా తమకు ఇష్టం వచ్చిన ధరలకు రైతుల నుంచి మక్కలు కొనుగోలు చేస్తున్న వారిని గుర్తించిన మార్కెట్‌ పాలకవర్గం ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైన ఉన్నతాధికారులు పూర్తి స్థాయి విచారరణ జరిపి దళారులపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - May 19 , 2025 | 12:31 AM