Share News

ఎన్నికలకు కాసులు ఎట్లా?

ABN , Publish Date - Nov 29 , 2025 | 01:17 AM

ఎన్నికల్లో గెలవాలంటే నామినేషన్‌ వేయాలి.. ప్రచారం చేయాలి. అందుకు కార్యకర్తలు, ప్రచార సామగ్రి తదితరాలు కావాలి. వీటన్నింటి కోసం డబ్బు కావాలి.. అకస్మాత్తుగా వచ్చిన ఎన్నికల నోటిఫికేషన్‌తో పోటీ చేసే అభ్యర్థులు కావాల్సినంత డబ్బు లేక నానా అవస్థలు పడుతున్నారు.

ఎన్నికలకు కాసులు ఎట్లా?

- ఎమ్మెల్యేలపై కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ఆశలు

- దిక్కులు చూస్తున్న ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు

- ఆస్తులను కుదువ పెడుతున్న మరికొందరు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ఎన్నికల్లో గెలవాలంటే నామినేషన్‌ వేయాలి.. ప్రచారం చేయాలి. అందుకు కార్యకర్తలు, ప్రచార సామగ్రి తదితరాలు కావాలి. వీటన్నింటి కోసం డబ్బు కావాలి.. అకస్మాత్తుగా వచ్చిన ఎన్నికల నోటిఫికేషన్‌తో పోటీ చేసే అభ్యర్థులు కావాల్సినంత డబ్బు లేక నానా అవస్థలు పడుతున్నారు.

కోర్టులో బీసీ రిజర్వేషన్ల అంశం తేలేవరకు ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగవని స్థానిక నేతలు నింపాదిగా ఉండగా, అకస్మాత్తుగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడంతో ఆశావహులు ఆందోళనకు గురవుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు డబ్బులు సమకూర్చుకునేది ఎలా అనే ఆలోచనలో పడ్డారు. అప్పులు ఇచ్చే వారి చుట్టూ తిరుగుతున్నారు. కొందరు ఆస్తుల అమ్మకాలకు తెగ బడుతుండగా, మరికొందరు ఆస్తులు కూడబెడుతున్నారు. ఈనెల 25వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ మూడు విడతల్లో డిసెంబర్‌ 11,14, 17 తేదీల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్‌ ఈ నెల 27న విడుదల కాగా, 29వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. మొదటివిడతలో కాల్వ శ్రీరాంపూర్‌, మంథని, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్‌ మండలాల్లోని 99గ్రామపంచాయతీల సర్పంచ్‌ స్థానాలతో పాటు 896వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. రెండోవిడతలో పాలకుర్తి, అంతర్గాం, ధర్మారం, జూలపల్లి మండలంలోని 73గ్రామపంచాయతీలోని సర్పంచ్‌ స్థానాలకు, 684 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మూడో విడతలో సుల్త్తానాబాద్‌, ఎలిగేడు, పెద్దపల్లి, ఓదెల మండలాల్లోని 91 గ్రామపంచాయతీల సర్పంచ్‌ స్థానాలతో పాటు 852వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఈ ఎన్నికల్లో పోటీచేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అభ్యర్థులు ఆశ పడుతున్నారు. గ్రామపంచాయతీల పదవీకాలం 2024జనవరి నెలాఖరుతో ముగియగా మరుసటి నెలలోనే ఎన్నికల నిర్వహించాల్సిన ప్రభుత్వం నిర్వహించలేదు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీ మేరకు ఎన్నికలను సకాలంలో నిర్వహించలేకపోయింది. ఇందుకోసం కులగణన సర్వే చేపట్టి బీసీ డెడికేషన్‌ కమిషన్‌ ప్రభుత్వం వేసింది. కుల గణన సర్వేకు అసెంబ్లీ ఆమోదం తెలుపగా డెడికేషన్‌ కమిషన్‌ సూచన మేరకు బీసీలకు శాతం రిజర్వేషన్లు కల్పించాలని బిల్లులను తీసుకువచ్చి గవర్నర్‌ ఆమోదానికి పంపించారు. అలాగే ఆర్డినెన్స్‌ను సైతం తీసుకువచ్చారు. ఇవి రాష్ట్రపతి ఆమోదం పొందక పోవడంతో బీసీలకు స్థానిక సంస్థలు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. ఆ మేరకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. సెప్టెంబర్‌ 27వ తేదీన ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ఒకేసారి ముందుగా మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలతో పాటు ఆ తర్వాత గ్రామపంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు షెడ్యూల్‌ విడుదల చేసింది.

డైలమాలో అభ్యర్థులు..

సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా ప్రభుత్వం స్థానిక సంస్థలు రిజర్వేషన్లు ప్రకటించిందనీ, ఎన్నికలపై స్టే విధించాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన కోర్టు ఆరు వారాలపాటు స్టే విధించి అఫిడవిట్లో దాఖలు చేయాలని అటు.. ప్రభుత్వాన్ని, ఇటు.. పిటిషనర్లను ఆదేశించింది. దీంతో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఒక్కసారిగా డీలా పడ్డారు. ఇప్పట్లో బీసీల రిజర్వేషన్ల అంశం తెగదని భావించారు. వచ్చే ఏడాది మార్చి నెలాఖరుతో 15వ ఆర్థిక సంఘం గడువు ముగుస్తున్నదని, ఆలోపు స్థానిక ఎన్నికలు నిర్వహించకుంటే రాష్ట్రానికి రావలసిన 3000కోట్ల రూపాయల నిధులు రాకుండా పోతాయని ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50శాతం రిజర్వేషన్లు మించకుండా ఎన్నికలను నిర్వహిస్తున్నది. సెప్టెంబర్‌లో ఇచ్చిన షెడ్యూల్లో మొదట మండల జిల్లా పరిషత్‌ ఎన్నికలను నిర్వహించేందుకు షెడ్యూల్‌ ప్రకటించగా, ఇప్పుడు మాత్రం కేవలం గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణకు మాత్రమే షెడ్యూల్‌ ఇచ్చింది. దీంతో అకస్మాత్త్తుగా ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎన్నికల్లో పోటీచేసే విషయమై డైలమాలో పడ్డారు.

కనీసం రూ.10లక్షలైనా ఉండాలి..

సర్పంచ్‌గా పోటీ చేయాలంటే కనీసం 10లక్షల రూపాయలైనా ఉండాలి. బీసీ, జనరల్‌ స్థానాల్లో ఆయా గ్రామ పంచాయతీలను బట్టి 10నుంచి 50లక్షలకు పైగా ఎన్నికల ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. నామినేషన్లు వేసిన దగ్గర నుంచి గుర్తులు కేటాయించే వరకు, ఆ తర్వాత పోలింగ్‌ వరకు వారం రోజుల పాటు ప్రచార నిర్వహించాల్సి ఉంటుంది. ప్రచార ఖర్చులతో పాటు పోల్‌ మేనేజ్మెంట్‌ కోసం డబ్బులు అవసరం ఉంటాయి. ఆ డబ్బుల కోసం అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. అధికార కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకులు ఎమ్మెల్యేలపై ఆశలు పెంచుకోగా, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు దిక్కులు చూస్తున్నారు. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు తమ అభ్యర్థుల గెలుపు కోసం ఖర్చు పెట్టే పరిస్థితిలో ఉన్నట్టుగా కనబడడం లేదు. దీంతో ఆయాపార్టీకి చెందిన ఆశావహులు, అభ్యర్థులు డబ్బుల కోసం ఆస్తులను కొందరు కుదువపెట్టి రుణాలు తీసుకువస్తుండగా, మరికొందరు అమ్మకానికి పెట్టారు. ఏడాదిన్నర కాలంగా గ్రామ ప్రజలు ఎన్నికల్లో పోటీచేయాలని తహ తహలాడుతున్నా కొందరు నాయకులు ఈ ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోవాలని చూస్తున్నారు. అప్పులు చేసైనా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్త్తున్నారు.

Updated Date - Nov 29 , 2025 | 01:17 AM