Share News

ఇళ్ల అనుమతులు గగనమే..

ABN , Publish Date - Dec 05 , 2025 | 01:08 AM

కరీంనగర్‌లో ఇళ్లు కట్టుకోవడానికి నగరపాలక సంస్థను అనుమతులు పొందడం గగనమవుతోంది.

ఇళ్ల అనుమతులు గగనమే..

కరీంనగర్‌ టౌన, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌లో ఇళ్లు కట్టుకోవడానికి నగరపాలక సంస్థను అనుమతులు పొందడం గగనమవుతోంది. గత ప్రభుత్వం అనుమతుల మంజూరుకు టీఎస్‌ బీపాస్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానంలో ఆనలైనలో ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకుంటే 21 రోజుల్లో డాక్యుమెంట్లను పరిశీలించి ఇంటి అనుమతులు ఇవ్వాలి. 21 రోజుల్లో అనుమతి ఇవ్వకుంటే ఇళ్లను నిర్మించుకోవచ్చని నిబంధనలు విధించింది. ప్రభుత్వం పారదర్శక సేవల కోసం ఎన్ని సంస్కరణలు తీసుకువచ్చినా క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు రావడం లేదు. కొత్తగా ఇళ్లు నిర్మించుకునే వారు ఆనలైనలో నేరుగా కానీ మున్సిపల్‌ రిజిస్టర్డు ఇంజనీర్ల ద్వారా ఇంటి కోసం దరఖాస్తు చేసుకొని అన్ని డాక్యుమెంట్లను జతచేసినా 21 రోజుల్లో అనుమతులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టౌన ప్లానింగ్‌ అధికారుల చుట్టూ తిరుగుతున్నా అనుమతులు ఇవ్వడం లేదని విమర్శిస్తున్నారు. ప్లాన సరిగా లేదని, ఏదో ఒక సాకును కొరివి పెడుతూ ముప్పుతిప్పలు పెడుతున్నారని, డబ్బులు ఇవ్వనిదే కనీసం ఫైల్‌ ముందుకు కూడా కదలడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.

ఫ నిబంధనలను పట్టించుకోని అధికారులు

మున్సిపల్‌ ఇంజనీర్లు ఆనలైనలో నిబంధనల మేరకు ఫీజులను, ఇతర డాక్యుమెంట్లను జతచేసి దరఖాస్తు చేసుకున్నా ఇంటి అనుమతులు ఇవ్వడ లేదు. వాటిని పరిశీలించి స్థల పరిశీలన చేయకుండా పక్కనబెడుతున్నారని, కొన్ని ఫైళ్ళను బిల్డింగ్‌ ఇనస్పెక్టర్లు, మరికొన్ని ఫైళ్ళను టౌనప్లానింగ్‌ సూపర్‌వైజర్లు వారి వద్దనే పెండింగ్‌లో పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. లంచం ముడితేనే ఫైల్‌ ముందుకు కదులుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు నగరపాలక సంస్థ పరిధిలో విలీన గ్రామాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఇటువంటి నిర్మాణాలను ఆపాల్సిన టౌనప్లానింగ్‌ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. టౌనప్లానింగ్‌ అంటేనే అవినీతికి కేరాఫ్‌గా మారిందని పలువురు బాహటంగానే విమర్శిస్తున్నారు. కమిషనర్‌, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా అనుమతులు రావడం లేదని, అక్రమ కట్టడాలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని నగర వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరపాలక సంస్థలో అత్యంత కీలకమైన టౌనప్లానింగ్‌ విభాగంపై ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని కోరుతున్నారు.

Updated Date - Dec 05 , 2025 | 01:09 AM