నేల వాలిన ఆశలు
ABN , Publish Date - Oct 31 , 2025 | 12:45 AM
మొంథా తుఫాను జిల్లా రైతులకు నిద్ర లేకుండా చేసింది.
జగిత్యాల, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాను జిల్లా రైతులకు నిద్ర లేకుండా చేసింది. రెండు రోజులుగా వర్షాలు కురవడం, మేఘాలు కమ్ముకొని ఉండడంతో వడ్లను కుప్పలు చేసి టార్పాలిన్లు కప్పేసి ఉంచారు. వాతావరణ మార్పులతో వడ్లలో తేమ శాతం ఎక్కడ మారిపోతుందన్న ఆందోళన అందరిలో నెలకొంది. ఇటు వ్యవసాయ అధికారుల సూచన మేరకు రైతులు పంట కోతలను వాయిదా వేశారు. కొన్ని కోట్ల విలువైన ధాన్యం కల్లాలు, రోడ్లపై ఉండడంతో జిల్లా అధికార యంత్రాంగం అవసరమైన టార్పాలిన్లను రైతులకు అందుబాటులో ఉంచాలని సంబంధిత శాఖ సిబ్బందిని ఆదేశించింది.
ఫఆగిన కాంటాలు..
జిల్లాలో వానాకాలం సీజన్‌లో మొత్తం 3.15 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేసినట్లు నమోదు చేశారు. అధికారిక లెక్కల ప్రకారం 7.50 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 8 లక్షల మెట్రిక్ టన్నుల వదరకు ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసి అందుకు అనుగుణంగానే 421 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తుఫాను కారణంగా జిల్లా అంతటా వర్షాలు కురుస్తుండడంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం చేయడం లేదు. రెండు రోజులుగా కాంటాలు నిలిపివేశారు. దీంతో రైతులు పంటను అమ్ముదామన్నా తీసుకునే పరిస్థితి లేదు. వర్షాలు తగ్గుముఖం పట్టి ఎండ వాతావరణం ఏర్పడితే మళ్లీ కాంటా చేయడం ప్రారంభిస్తామని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
ఫదిగుబడి తగ్గి...రంగు మారి
మొంథా తుఫాను ప్రభావంతో బలమైన గాలులు వీయగా వరి నేల వాలింది. వర్షంతో పొలాల్లో నీరు నిలిచి వరి పంట దెబ్బతిన్నది. పత్తిలో వర్షపు నీరు చేరడంతో నల్లబారే ప్రమాదంతో పాటు దిగుబడి తగ్గుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి కూడా కోత దశలో ఉండగా ధాన్యం రంగు మారుతుందని అంటున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల వరి కోయగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదని, ప్రైవేటులో వ్యాపారులు తక్కువ ధరకే అడుగుతున్నారని రైతులు వాపోతున్నారు. ఇక దిగువ ప్రాంతాల్లోని వరి పొలాలను వర్షపు నీరు మంచెత్తడంతో మొలకలు వచ్చే ప్రమాదముంది. పైరు నేలవాలడంతో హర్వెస్టర్లతో కోసే అవకాశం లేకుండా పోతోంది. పత్తి కాయలు పగిలి, దూది బయటకు వస్తున్న తరుణంలో భారీ వర్షాలు కురవడంతో దూది పూర్తిగా తడిచిపోయింది. ఇప్పటికే సీసీఐ విధించిన నిబంధనలతో సతమతం అవుతుండగా తెల్లబంగారం సాగు చేసిన రైతులకు తుపాన్ ప్రభావంతో మరింత నష్టం వాటిల్లనుంది.
ఫఅప్పుల ఊబిలో అన్నదాత..
విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చుల రూపంలో రూ.లక్షలు అప్పు చేసి పంట పండించిన రైతులు తుఫానుతో తీవ్రంగా నష్టపోయారు. కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని ఆందోళనకు గురవుతున్నారు. వర్షాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని ఇప్పటికే వ్యవసాయ కమిషనరేట్ నుంచి జిల్లా వ్యవసాయ అధికారులకు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో అధికారులు వెంటనే క్షేత్ర స్థాయిలో పర్యటించి నష్టపోయిన పంట విస్తీర్ణాన్ని అంచనా వేయాలని, నష్టపోయిన ప్రతీ రైతుకు పరిహారం అందించాలని వేడుకుంటున్నారు. రంగు మారిన, తడిచిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని అంటున్నారు.
ఫజిల్లాలో 73.6 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు
జిల్లాలో బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 73.6 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పెగడపల్లిలో 112.5 మిల్లీమీటర్లు కురిసింది. కథలాపూర్‌లో 99.4 మిల్లీమీటర్లు, కోరుట్లలో 93, భీమారంలో 87.3, మెట్‌పల్లి, కొడిమ్యాలలో 87.2, మల్యాలలో 84.2, సారంగపూర్‌లో 84, మేడిపల్లిలో 73.6, ఇబ్రహీంపట్నంలో 71.7, రాయికల్‌లో 71.2, జగిత్యాలలో 71.1, ఎండపల్లిలో 70.9, బుగ్గారంలో 68.3, జగిత్యాల రూరల్‌లో 65.3, మల్లాపూర్‌లో 63, వెల్గటూరులో 56.1, ధర్మపురిలో 45.7, గొల్లపల్లిలో 42.4, బీర్‌పూర్‌లో 38.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
జిల్లాలో 17,982 ఎకరాల్లో వరి పంట నష్టం..
జిల్లా వ్యాప్తంగా 230 గ్రామాల్లో 16,679 మంది రైతులకు చెందిన 17,982 ఎకరాల్లో వరి పంట నష్టానికి గురయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. భీమారం మండలంలోని 9 గ్రామాల్లో 526 మంది రైతులకు చెందిన 871 ఎకరాలు, మల్యాల మండలంలోని 15 గ్రామాల్లో 925 మంది రైతులకు చెందిన 1,170 ఎకరాలు, పెగడపల్లిలో 17 గ్రామాల్లో 1,432 మంది రైతులకు చెందిన 1,960 ఎకరాలు, రాయికల్‌లో 20 గ్రామాల్లో 1,215 మంది రైతులకు చెందిన 1,122 ఎకరాల్లో వరి దెబ్బతింది. కొడిమ్యాలలో 15 గ్రామాల్లో 162 మంది రైతులకు చెందిన 275 ఎకరాలు, జగిత్యాల రూరల్‌లో 18 గ్రామాల్లో 284 మంది రైతులకు చెందిన 492 ఎకరాలు, వెల్గటూరులో 13 గ్రామాల్లో 446 మంది రైతులకు చెందిన 681 ఎకరాలు, కోరుట్లలో 15 గ్రామాల్లో 1,612 మంది రైతులకు చెందిన 2,201 ఎకరాలు, మల్లాపూర్‌లో 20 గ్రామాల్లో 949 మంది రైతులకు చెందిన 1,046 ఎకరాలల్లో వరి దెబ్బతింది. కథలాపూర్‌లో 19 గ్రామాల్లో 3,148 మంది రైతులకు చెందిన 2,934 ఎకరాలు, మెట్‌పల్లిలో 19 గ్రామాల్లో 1,935 మంది రైతులకు చెందిన 1,570 ఎకరాలు, ఇబ్రహీంపట్నంలో 16 గ్రామాల్లో 1,326 మంది రైతులకు చెందిన 991 ఎకరాలు, సారంగపూర్‌లో 5 గ్రామాల్లో 30 మంది రైతులకు చెందిన 80 ఎకరాలు, బుగ్గారంలో 10 గ్రామాల్లో 542 మంది రైతులకు చెందిన 635 ఎకరాలు, ఎండపల్లిలో 13 గ్రామాల్లో 1,250 మంది రైతులకు చెందిన 1,619 ఎకరాలలో వరి పంట నష్టానికి గురయినట్లు వ్యవసాయ అధికారులు సర్వేలో తేల్చారు.
ఫ1,146 ఎకరాల్లో దెబ్బతిన్న పత్తి
కాగా జిల్లాలో 1,066 మంది రైతులకు చెందిన 1,146 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిన్నట్లు అధికారులు తేల్చారు. ఎండపల్లి మండలంలో 13 గ్రామాల్లో 572 మంది రైతులకు చెందిన 500ఎకరాలు, బుగ్గారం మండలంలోని 10 గ్రామాల్లో 331 మంది రైతులకు చెందిన 372 ఎకరాలు, వెల్గటూరు మండలంలో 163 మంది రైతులకు చెందిన 274 ఎకరాల్లో పత్తి పంట నష్టానికి గురయినట్లు అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలకు తరలించి నిల్వ చేసిన ధాన్యం కుప్పల వద్దకు వర్షపు నీరు చేరి సుమారు 2 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం తడిచిపోయినట్లు అంచనా ఉంది.
ఫరెండు చోట్ల నిలిచిన రాకపోకలు..
పలు చోట్ల వర్షపు నీరు రహదారులు, లో లెవల్ కల్వర్టులపై నుంచి పారడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్-ఫకీర్ కొండాపూర్ మధ్య అప్రోచ్ రోడ్డు తెగిపోయి వరద నీరు పారడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కోరుట్ల మండలం చిన్నమెట్‌పల్లి-మాదాపూర్ మధ్య రోడ్డుపై వాగునీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
పంట నష్టపోయా
-మల్లేశ్, రైతు, మోరపల్లి గ్రామం, జగిత్యాల రూరల్ మండలం
తుఫాను ప్రభావంతో కురిసిన వర్షం వల్ల పంట నష్టపోయాం. చేతికొచ్చిన వరి పంట నేల వాలి గింజలు రాలిపోయి నష్టపోయా. మరికొందరు రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించినప్పటికీ వర్షం వల్ల కుప్పల వద్ద నీరు నిలవడం, ధాన్యం తడిచిపోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రైతులను ఆదుకోవాలి
-కల్వకుంట్ల సంజయ్, కోరుట్ల ఎమ్మెల్యే
జిల్లాలో వర్షం రైతులు తీవ్రంగా పంట నష్టపోయారు. పలు ప్రాంతాల్లో కోతకు వచ్చిన వరి పంట నేలవాలింది. కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం కుప్పల వద్దకు వర్షపు నీరు వచ్చి చేరింది. తేమ శాతం పడిపోవడం వల్ల ధాన్యం విక్రయాల సందర్భంగా ఇబ్బందులు ఎదురవుతుందని రైతులు అంటున్నారు. ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో పరిస్థితిని పరిశీలించి బాధిత రైతులను ఆదుకోవాలి.