‘డబుల్’పై పెరిగిన ఆశలు
ABN , Publish Date - Jun 28 , 2025 | 01:06 AM
సొంతింటి కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల కలను నిజం చేసేలా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
-ఎల్-2 కేటగిరీ దరఖాస్తుదారులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు
-ప్రభుత్వం కీలక నిర్ణయం
-జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు 1,99,957
జగిత్యాల, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): సొంతింటి కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల కలను నిజం చేసేలా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సొంత స్థలం లేని నిరు పేదలకు గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం పూర్తయిన, వివిధ దశల్లో ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించాలని నిర్ణయించింది. తద్వారా జిల్లాలోని పలువురు నిరుపేదలకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే నిర్మాణం పూర్తయి సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్‌రూం ఇళ్లను పంపిణీ చేయడమే కాక వివిధ దశల్లో నిర్మాణాలు పూర్తి కాకుండా ఉన్న ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించనున్నారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 1,99,957 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఎల్-1,2,3 కేటగిరీలుగా విభజించి ఎల్-1 దరఖాస్తుదారులకు మొదట ప్రాధాన్యం ఇచ్చారు. సొంత స్థలం ఉండి గుడిసె, రేకులషెడ్, అద్దె ఇళ్లలో ఉండేవారిని ఈ జాబితాలో పొందుపర్చారు. ఇక గుడిసె, రేకుల షెడ్, టైల్స్ వేసిన అద్దె ఇంట్లో స్థలం లేని వారిని ఎల్-2 కింద, ఇల్లు ఉన్నా తల్లిదండ్రుల నుంచి విడిపోయి తమకు సొంతంగా ఇల్లు కావాలని కోరిన వారిని ఎల్-3 కేటగిరిలో చేర్చారు. జిల్లాలో ఎల్-1 కేటగిరీ కింద 61,438 దరఖాస్తులు, ఎల్-2 కేటగిరీ కింద 57,554 దరఖాస్తులు, ఎల్-3 కేటగిరీ కింద 80,965 దరఖాస్తులు వచ్చాయి.
ఫ7,566 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేత
జిల్లాలో ఇప్పటివరకు ఫేస్-1, ఫేస్-2 కింద 7,566 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్‌లను అందజేశారు. ఇందులో ధర్మపురి నియోజకవర్గంలో 2,629, కోరుట్ల సెగ్మెంట్‌లో 2,826, చొప్పదండి నియోజకవర్గం పరిధిలోని మల్యాల, కొడిమ్యాలలో 883, వేములవాడ నియోజకవర్గం పరిధిలోని మేడిపల్లి, భీమారం, కథలాపూర్‌లలో 908, జగిత్యాల నియోజకవర్గంలో 320 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు. వీటిలో ఫేస్-1 కింద 436 ఇళ్లకు, ఫేస్-2 కింద 2,532 ఇళ్లకు ముగ్గులు పోశారు. జిల్లా వ్యాప్తంగా 258 ఇళ్లు వివిధ లెవల్స్‌లో నిర్మాణంలో ఉన్నాయి.
ఫడబుల్ బెడ్‌రూం ఇళ్ల పరిస్థితి ఇలా..
జిల్లా వ్యాప్తంగా రెండు విడతల్లో గత ప్రభుత్వం 8,525 డబుల్ బెడ్‌రూం ఇళ్లను మంజూరు చేసింది. ఇందులో జగిత్యాల నియోజకవర్గానికి 5,500, ధర్మపురి నియోజకవర్గానికి 1,100, కోరుట్ల నియోజకవర్గానికి 1,400, వేములవాడ నియోజకవర్గం పరిదిలోని కథలాపూర్, మేడిపల్లి మండలాలకు 165, చొప్పదండి నియోజకవర్గం పరిధిలోని మల్యాల, కొడిమ్యాల మండలాలకు 360 డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరు అయ్యాయి. వీటిలో నిర్మాణాలు పూర్తయిన ఇళ్లను పలు ప్రాంతాల్లో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయి. అయితే నిర్మాణం పూర్తి చేసుకొని పంపిణీ చేసిన ఇళ్ల సంఖ్య ఎంత..? వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్లు సంఖ్య ఎంత..? అన్న వివరాలను అధికారులు ఆరా తీస్తున్నారు.
ఫఎల్-2 కేటగిరీలో 57,554 దరఖాస్తులు
గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్‌రూం ఇళ్లు కొన్ని పూర్తయినా పంపిణీ చేయలేదు. మరికొన్ని అసంపూర్తిగా ఉన్నాయి. జిల్లాకు గత ప్రభుత్వ హయాంలో మంజూరైన డబుల్ బెడ్‌రూం ఇళ్లలో నిర్మాణం పూర్తి చేసిన ఇళ్లను పలువురు లబ్ధిదారులకు కేటాయించగా, ఇంకా ఇళ్లు వివిధ దశల్లో మిగిలిపోయాయి. కాగా ఇటీవల ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో సొంత జాగా లేకుండా ఎల్-2 కేటగిరిలో చేర్చిన వారికి డబుల్ బెడ్‌రూం ఇళ్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎల్-2 కేటగిరిలో 57,554 దరఖాస్తులు రాగా అందుబాటులో ఉన్న డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఎన్ని, వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఎన్ని అన్న వివరాలను స్పష్టంగా తెలుసుకోవడానికి అవసరమైన కసరత్తులను అధికారులు చేస్తున్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణయం
-వాసం ప్రసాద్, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి
జిల్లాలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు ఫేస్-1, ఫేస్-2 కింద ప్రొసిడింగ్స్ పంపిణీ చేశాం. ఇందిరమ్మ ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయి. అయితే ఇటీవల ప్రభుత్వం ఎల్-2 కేటగిరి లబ్ధిదారులకు గత ప్రభుత్వ హయాంలో నిర్మాణాలు పూర్తి కాని డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ప్రభుత్వ ఆదేశాల మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు రావాల్సి ఉంది. ప్రస్తుతం ప్రాథమికంగా అవసరమైన కసరత్తులు చేస్తున్నాం.