Share News

వీధి వ్యాపారులకు రుణాల ఆశలు

ABN , Publish Date - Jul 02 , 2025 | 01:24 AM

వీధి వ్యాపారులను పొదుపు వైపు మళ్లించి వ్యాపార అభివృద్ధికి రుణాలు అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. స్వశక్తి మహిళా సంఘాల తరహాలోనే ప్రభుత్వం కామన్‌ ఇంట్రెస్ట్‌ గ్రూప్‌ (సీఐజీ)లను ఏర్పాటు చేయాలని మెప్మాకు ఆదేశాలు ఇచ్చింది.

వీధి వ్యాపారులకు రుణాల ఆశలు

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

వీధి వ్యాపారులను పొదుపు వైపు మళ్లించి వ్యాపార అభివృద్ధికి రుణాలు అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. స్వశక్తి మహిళా సంఘాల తరహాలోనే ప్రభుత్వం కామన్‌ ఇంట్రెస్ట్‌ గ్రూప్‌ (సీఐజీ)లను ఏర్పాటు చేయాలని మెప్మాకు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే మెప్మా ద్వారా జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలలో సీఐజీ గ్రూపుల ఏర్పాటుకు వీధి వ్యాపారులను గుర్తిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 10 వేలకు పైగా వీధి వ్యాపారులు ఉన్నారు. తోపుడు బండ్లపై పండ్లు, మిర్చి, బజ్జీల వంటి విక్రయాలు, ప్రధాన కూడళ్లలో బట్టలు, ప్లాస్టిక్‌ వస్తువులు అమ్ముకోవడం, మరికొందరు పట్టణాల నుంచి గ్రామాలకు వస్తువులు తీసుకువెళ్లి అమ్ముకుంటూ ఉపాధి పొందుతున్నారు.

బ్యాంక్‌ లింకేజీతో రుణాలు..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గతంలో పీఎం స్వనిధి పథకంలో వీధి వ్యాపారులకు రుణాలు అందించారు. గత సంవత్సరం డిసెంబర్‌లో స్వనిధిలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా రుణాలు ఇవ్వడాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఇదేక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సీఐజీల ద్వారా వీధి వ్యాపారులకు రుణాలు అందించడానికి ఆదేశాలు ఇవ్వడంతో వ్యాపారులకు ఊరటగా మారనుంది. వీధి వ్యాపారుల్లో 5 మంది నుంచి 10 మంది వరకు కామన్‌ ఇంట్రెస్ట్‌ గ్రూపులుగా ఏర్పాటు చేసి వారికి బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు అందించాలని నిర్ణయించారు. ఆరు నెలల పాటు సీఐజీల ద్వారా వీధి వ్యాపారులు పొదుపు చేసుకుంటే మొదటి విడతగా రూ 75 వేల వరకు రుణం అందిస్తారు. తర్వాత దాన్ని రెట్టింపు చేస్తారు. వీధి వ్యాపారంలో స్ట్రీట్‌ వెండర్‌ గుర్తింపు కార్డు ఉన్న వారిలో ఆడ, మగ తేడా లేకుండా కలిపి గ్రూపుగా ఏర్పాటు చేస్తారు. మహిళలకు మాత్రం ఇతర పొదుపు సంఘాల్లో సభ్యురాలుగా ఉంటే సీఐజీలో తీసుకోరు. వీధి వ్యాపారులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే సీఐజీ ఏర్పాటుకు జిల్లా మెప్మా వీధి వ్యాపారులు గుర్తింపును వేగంతం చేసింది.

నిలిచిన స్వనిధి రుణాలు..

వీధి వ్యాపారులకు చేయూతనిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్వనిధి(అత్మ నిర్భర్‌ నిధి) రుణాల పక్రియ 2020 సంవత్సరంలో కరోనా లాక్‌డౌన్‌లో తీసుకవచ్చింది. ఈ పథకం ద్వారా వీధి వ్యాపారులకు రుణాలు అందించి చిరు వ్యాపారాన్ని కొనసాగించుకునే దిశగా మూడు విడతలుగా అందించే స్వనిధి రుణాలు డిసెంబరుతో నిలిపివేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరు వ్యాపారులు మాత్రం రుణాలు అందక నిరాశ చెందుతున్నారు. వీధి వ్యాపారులకు మొదటి విడతగా రూ 10 వేలు, అది చెల్లించిన తరువాత రెండో విడతగా రూ 20 వేలు, మూడవ విడతగా రూ 50 వేల రుణాలు ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చాలామంది వీధి వ్యాపారులు మొదటి విడతలో ఎంతో ఉత్సాహంగా తీసుకున్న రూ 10 వేల రుణాన్ని చెల్లించి రూ.20 వేల రుణాన్ని తీసుకున్నారు. మూడో విడతలో మాత్రం ముందుకు రాలేదు. జిల్లాలో వీధి వ్యాపారులకు రుణాలు అందించడానికి 8,418 మంది లక్ష్యంగా పెట్టుకున్నారు. స్వనిధి ద్వారా జిల్లాలో 26.40 కోట్ల రుణాల పంపిణీ జరిగింది. దరఖాస్తులు 8507 మంది మొదటి విడతలోనే చేసుకున్నారు. సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీల్లో మొదటి విడతలో రూ. 10 వేల చోప్పున 7933 మంది రూ 7.93 కోట్లు అందించారు. వీరు ఏడాదిలోగా రూ. 10 వేలు చెల్లించి తిరిగి రెండో విడతలో 6180 మంది రూ.20 వేల చొప్పున రూ 12.36 కోట్లు రుణం పొందారు. మూడో విడతలో మాత్రం 1222 మంది రూ 50 వేల చొప్పున రూ 6.11 కోట్ల రుణాలు పొందారు. స్వనిధి పక్రియను తాత్కాలింగా నిలిపివేయడంపై వీధి వ్యాపారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jul 02 , 2025 | 01:24 AM