Share News

కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఆశలు

ABN , Publish Date - Jul 18 , 2025 | 01:15 AM

కాంగ్రెస్‌ పార్టీ సంస్థాగత పునర్నిర్మాణంపై దృష్టిసారించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఆశలు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

కాంగ్రెస్‌ పార్టీ సంస్థాగత పునర్నిర్మాణంపై దృష్టిసారించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అధికారంలో లేకపోవడం, ఏడాదిన్నర క్రితం అధికారంలోకి వచ్చినా అటు సంస్థాగత పదవులు గానీ, ఇటు నామినేటెడ్‌ పదవులు దక్కక నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్న పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు, క్రియాశీల కార్యకర్తలు, గ్రామీణస్థాయి నాయకుల్లో ఇప్పుడు ఉత్సాహం మొదలైంది. పార్టీ అధిష్ఠానవర్గం సంస్థాగత పునర్నిర్మాణంపై దృష్టిసారించడమే కాకుండా ఉమ్మడి జిల్లాల స్థాయిలో ఇన్‌చార్జీలను పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను నియమించడంతో వారు తమకు అప్పగించిన బాధ్యతల్లో పనిచేయడం ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా సంస్థాగత ఇన్‌చార్జి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ ఉమ్మడి జిల్లా పరిధిలోని జిల్లాల్లో పర్యటన ప్రారంభించారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో ఆయన సమావేశం ఏర్పాటు చేసి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒక జిల్లా ఉపాధ్యక్షున్ని, ప్రతి బ్లాక్‌ నుంచి ఒక ప్రధాన కార్యదర్శిని, ప్రతి మండలం నుంచి ఒక కార్యదర్శిని తీసుకుంటామని ప్రకటించారు. క్షేత్రస్థాయి నేతలు ఆయా పదవుల కోసం అప్పుడే తమ ప్రయత్నాలు ప్రారంభించారు. జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి కూడా తీవ్రమైన పోటీ నెలకొన్నది.

ఫ ప్రయత్నాలు ముమ్మరం చేసిన నేతలు

సంస్థాగత ఇన్‌చార్జి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ జిల్లాలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేయడంతో డీసీసీ పదవిని ఆశిస్తున్నవారు అలర్ట్‌ అయి అందుకు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రధానంగా పదవి కోసం ప్రస్తుతం కాంగ్రెస్‌ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న కోమటిరెడ్డి పద్మాకర్‌ రెడ్డి, పార్లమెంట్‌ స్థానానికి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వెలిచాల రాజేందర్‌రావు, పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్‌ కుమార్‌, జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్నరెడ్డి, సీనియర్‌ నేత, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆకారపు భాస్కర్‌ రెడ్డి పోటీ పడుతున్నారు. వీరంతా వారి వారి స్థాయిల్లో అటు మంత్రులతో, పార్టీలో కీలక నేతలతో కలిసి తమకు పదవి లభించేలా చూడాని కోరుతున్నట్లు సమాచారం. కోమటిరెడ్డి పద్మాకర్‌ రెడ్డి జిల్లాలోనే ఉన్న అద్దంకి దయాకర్‌ను కలిసి తాను ఎన్‌ఎస్‌యూఐ నుంచి పార్టీ ప్రస్థానం ప్రారంభించి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి వరకు వచ్చి అంకితభావంతో పనిచేస్తున్నానని, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా, సింగిల్‌విండో చైర్మన్‌గా, మండల కాంగ్రెస్‌ అధ్యక్షునిగా గత రెండు దశాబ్దాలుగా సేవలందించానని, తన కష్టాన్ని గుర్తించి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి అప్పగించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. డీసీసీ అధ్యక్ష పదవిని మొదటి నుంచి ఆశిస్తూ వస్తున్న కోమటిరెడ్డి నరేందర్‌ రెడ్డి సుడా చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన నగర అధ్యక్షుడిగా పనిచేస్తూ వచ్చి డీసీసీ పదవి కోసం చాలాకాలం ప్రయత్నాలు చేశారు. డీసీసీ పదవి నియామకం కాకముందే సుడా చైర్మన్‌ పదవి దక్కడంతో ఆ పదవిని చేపట్టారు. ఆయనకు డీసీసీ బాధ్యతలు చేపట్టాలని ఉన్నా ఇప్పటికే ఒక పదవి ఉండడంతో అది అంత సులువుగా దక్కకపోవచ్చని భావించి ప్రయత్నాలు విరమించుకున్నట్లు తెలుస్తున్నది. పార్టీ పదవి బాధ్యతలు అప్పగిస్తే మాత్రం తప్పక నిర్వహిస్తానని అంటున్నట్లు సమాచారం. పీసీసీ కార్యదర్శిగా ఉన్న అంజన్‌ కుమార్‌ కూడా తాను పార్టీని వదలకుండా తొలి నుంచి అంటిపెట్టుకుని ఉన్నానని, తాను డీసీసీ అధ్యక్ష పదవికి అన్ని విధాలా అర్హునిగా ఉన్నానని పేర్కొంటూ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. మరో సీనియర్‌ నేత ఆకారపు భాస్కర్‌ రెడ్డి కూడా డీసీసీ పదవిని ఆశిస్తున్నారు. ఆయన కొంతకాలం టీఆర్‌ఎస్‌లోకి వెళ్లి రావడంతో పార్టీలో కొంత మైనస్‌గా మారింది. మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సత్యప్రసన్న రెడ్డి కరీంనగర్‌ డీసీసీ అధ్యక్ష పదవిని తనకు అప్పగించి మహిళలకు పార్టీ ఇస్తున్న గుర్తింపును చాటాలని కోరుకుంటున్నారు. అటు మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఇటు మరో మంత్రి శ్రీధర్‌బాబు ఆశీస్సులు ఎవరికి దక్కుతాయో, అధిష్ఠానవర్గం ఎవరిని అక్కున చేర్చుకుంటుందోనన్న ఆసక్తి కాంగ్రెస్‌ పార్టీలో నెలకొన్నది.

Updated Date - Jul 18 , 2025 | 01:15 AM