నామినేటెడ్ పోస్టులపై ఆశలు
ABN , Publish Date - Jul 05 , 2025 | 01:11 AM
ఏడాది కాలంగా భర్తీ కాకుండా ఉన్న నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకేతాలు ఇవ్వడంతో పార్టీ నాయకుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. రాష్ట్ర వాప్త్యంగా ఉన్న వివిధ కార్పొరే షన్లకు సంబంధించి కొన్ని పోస్టులను మాత్రమే భర్తీ చేయగా, మిగతా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారా అని అనేక మంది నాయకులు ఎదురు చూస్తున్నారు.
- కార్పొరేట్, పార్టీ పదవులపై నేతల కన్ను.
- రెండు మార్కెట్ కమిటీల పదవులకు పోటీ
- స్థానిక సంస్థల ఎన్నికల్లోపే పదవుల భర్తీ అయ్యే అవకాశం
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
ఏడాది కాలంగా భర్తీ కాకుండా ఉన్న నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకేతాలు ఇవ్వడంతో పార్టీ నాయకుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. రాష్ట్ర వాప్త్యంగా ఉన్న వివిధ కార్పొరే షన్లకు సంబంధించి కొన్ని పోస్టులను మాత్రమే భర్తీ చేయగా, మిగతా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారా అని అనేక మంది నాయకులు ఎదురు చూస్తున్నారు. వాటితోపాటు పార్టీ పదవులు కూడా ఆశిస్తున్నారు. 20 రోజుల క్రితం టీపీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించగా అందులో పెద్దపల్లి జిల్లాకు పెద్దగా ప్రాధాన్యం లభించలేదని పార్టీ నాయ కులు నిరాశతో ఉన్నారు. కేవలం ఇద్దరికి మాత్రమే టీపీ సీసీ పదవులు దక్కాయి. అందులో రాష్ట్ర ఐటీ పరిశ్ర మల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సోదరుడు శ్రీనివాస్ బాబుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి దక్కగా, మాజీ డీసీసీ అధ్యక్షుడు ఈర్ల కొమురయ్యకు కూడా అదే పదవి వరించింది. అయితే ఆయనకు పార్టీ పదవిని కట్టబెట్టడంపై పెద్దపల్లి నియోజకవర్గ నాయకులు అసంతృప్తి వక్యం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీకి రాజీనామా చేసి బీఎస్పీలో చేరిన ఆయన కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తిరిగి కాం గ్రెస్‌లో చేరారు. ఎన్నికల సమయంలో పార్టీలో ఉండి పార్టీ అభ్యర్థుల గెలుపునకు పాటుపడాల్సిన ఈర్ల కొము రయ్యకు కీలకమైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పదవి ఎలా ఇస్తారని ఇటీవల జరిగిన పెద్దపల్లి నియోజకవర్గ స్థాయి సమావేశంలో పలువురు నాయకులు టీపీసీసీ పరిశీలకులను ప్రశ్నించారు. జిల్లాలో ఉన్న మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందినప్పటికి కేవలం ఇద్దరికీ మాత్రమే టీపీ సీసీలో చోటు కల్పించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కొందరికే నామినేటెడ్ పదవులు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో కొందరికే నామినేటెడ్ పదవులు దక్కాయి. రామగుండం నియోజకవర్గానికి చెందిన హర్కార వేణుగోపాల్ రావుకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవి దక్కగా, ఇటీ వల మల్లేపల్లి లక్ష్మయ్యను బుద్దవనం ప్రాజెక్టు ప్రత్యేక అధికారిగా నియమించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా అంతటి అన్నయ్య గౌడ్‌ను నియమించారు. ఇతర కార్పొరేషన్ పదవులు జిల్లాకు దక్కలేదు. రాష్ట్రంలో ఇంకా కొన్ని కార్పొరేషన్ పదవులు ఖాళీగా ఉండడంతో ఆ పదవులపై జిల్లాకు చెందిన పలువురు నాయకులు ఆశలు పెట్టుకున్నారు.
డీసీసీ, మార్కెట్ చైర్మెన్ పదవులపై ఆశలు
టీపీసీసీ కార్యవర్గ నియామకం పూర్తి కావడంతో అన్ని జిల్లాల్లో డీసీసీ అధ్యక్షులను నియమించేందుకు పార్టీ కసరత్తు చేస్తున్నది. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడిగా రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకుర్ మక్కాన్‌సింగ్ కొనసాగుతున్నారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల జరగాల్సి ఉండడంతో ఆయననే కొనసాగిస్తారా లేక మరెవరినైన నియమిస్తారా అనే విషయం తేలడం లేదు. అయితే ఈ పదవిపై పలువురు నాయకులు ఆశలు పెంచుకుకున్నారు. అలాగే జిల్లాలో ఎనిమిది వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉండగా, పెద్దపల్లి, సుల్తానాబాద్, జూలపల్లి, కాల్వశ్రీరాంపూర్, ధర్మారం, రామగుండం మార్కెట్ కమిటీల పాలక వర్గాలను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల సిఫారసుతో నియ మించారు. మంథని అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మంథని, కమాన్‌పూర్ మార్కెట్ కమిటీల పాలక వర్గా లను ఇప్పటి వరకు నియమించలేదు. మంత్రి శ్రీధర్ బాబు ఆశీస్సులు ఎవరికి ఉంటే వారికే మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు దక్కనున్నాయి. అయితే ఈ కమిటీ లను స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయిన తర్వాత నియమిస్తారా అనే విషయమై పార్టీ నాయకుల్లో చర్చ జరుగుతున్నది. స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే నామినేటెడ్, డీసీసీ అధ్యక్షులను, మార్కెట్ కమిటీ పాలక వర్గాలను, దేవాలయ కమిటీ చైర్మన్లను నియమించే అవకాశలు కనబడుతున్నాయి.