Share News

ఎన్‌డీఎస్‌ఎల్‌ పునరుద్ధరణపై ఆశలు

ABN , Publish Date - Sep 26 , 2025 | 12:44 AM

నిజాం దక్కన్‌ షుగర్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌డీఎస్‌ఎల్‌) పునరుద్ధరణపై ఆశలు చిగురిస్తున్నాయి.

ఎన్‌డీఎస్‌ఎల్‌ పునరుద్ధరణపై ఆశలు

జగిత్యాల, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): నిజాం దక్కన్‌ షుగర్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌డీఎస్‌ఎల్‌) పునరుద్ధరణపై ఆశలు చిగురిస్తున్నాయి. నిజాం షుగర్స్‌ తెరవడానికి కీలకమైన బాధ్యతలను రైతులపై పెడుతోంది. కర్మాగారం నడవాలంటే అవసరమైన చెరుకును సాగు చేయడానికి రైతులను ప్రోత్సహించే ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలో చెరుకు రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 26వ తేదీన ముత్యంపేట చక్కర కర్మాగారానికి రాష్ట్ర ఉన్నతాధికారుల బృందం రానుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను కలెక్టర్‌ సత్యప్రసాద్‌ ఆధ్వర్యంలో పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ, పరిశ్రమ తదితర శాఖలకు చెందిన అధికారులు పూర్తి చేస్తున్నారు.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ హామీ...

రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా ఎన్‌డీఎస్‌ఎల్‌ పునరుద్ధరణకు కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. ఈమేరకు ఎన్‌డీఎస్‌ఎల్‌ యూనిట్లను పునరుద్ధరించడానికి సీఎం రేవంత్‌రెడ్డి సర్కారు అడుగులు వేసినప్పటికీ సరైన స్పష్టత రావడం లేదు. జగిత్యాల జిల్లా ముత్యంపేట చక్కర కర్మాగారంతో పాటు నిజామాబాద్‌ జిల్లా బోధన్‌, మెదక్‌ జిల్లా ముంబోజిపల్లి కర్మాగారాలను తెరిపించడానికి గత యేడాది జనవరి నెలలో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీ కొంత ప్రక్రియ పూర్తి చేసింది. ఉమ్మడి యాజమాన్యం పరిధి లోని ఈ ఫ్యాక్టరీలకు చెందిన 400 కోట్ల రూపాయల బ్యాంకు బకాయిలకు సంబంధించి వన్‌ టైం సెటిల్‌మెం ట్‌ కింద రాష్ట్ర ప్రభుత్వం 190 కోట్ల రూపాయలు చెల్లించింది. నిజాం షుగర్స్‌ను పునరుద్ధరించినప్పటికీ తాము నడపలేమని భాగస్వామ్య సంస్థ అయిన డెల్టా పేపర్స్‌ లిమెటెడ్‌ గతంలోనే ప్రభుత్వానికి స్పష్టం చేసింది. సంస్థలో 51 శాతం వాటాను కలిగిన డెల్టాకు స్వస్తి పలకాలంటే ఆస్థుల విలువ, సాంకేతిక స్థితిగతు లు, న్యాయపరమైన చిక్కులు తదితర అంశాలపై ప్ర భుత్వం దృష్టి సారించాల్సి ఉంది. 2025 డిసెంబరు నాటికి ఫ్యాక్టరీని తెరిపిస్తామని ప్రకటించినప్పటికీ... అది మరింత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కనీ సం 2026 డిసెంబరు క్రషింగ్‌ సీజన్‌ నాటికి కర్మాగారం పరిధిలో రైతులు గణనీయమైన విస్తీర్ణంలో చెరుకు పంట పండించేందుకు ముందుకు రావాల్సి ఉందని ప్రభుత్వం గుర్తించింది. ఈదిశగా రైతులను ప్రోత్సహిం చడానికి సర్కారు ప్రయత్నాలు చేస్తోంది.

- తేలని డెల్టా వాటా వ్యవహారం..

నిజాం షుగర్స్‌పై అధ్యయనం చేసి ఆస్థుల విలువ ను లెక్కించి అవసరమైన సలహాలు, సూచనలతో నివేదికను సమర్పించడానికి క్యాపిటల్‌ ఫార్చున్స్‌ అనే సంస్థను కన్సల్‌టెంట్‌గా ఎంపిక చేసి బాధ్యతలు అప్ప గించింది. సాధ్యమైనంత తొందరలో కన్సల్‌టెంట్‌ కంపె నీ అధ్యయనం చేసి నివేదిక అందజేయాలని ఆదేశిం చింది. ప్రస్తుతం కర్మాగారాల్లో గల యంత్రాలు వినియో గించే స్థితిలో ఉన్నాయా...మరమ్మతులతో నడిపించు కునే వీలు ఉంటుందా.. లేదంటే కొత్తవి కొనుగోలు చేయాలా అన్న వివరాలు సేకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్‌డీఎస్‌ఎల్‌ తరఫున సమాచారం ఇచ్చేందుకు సంస్థలో పనిచేసి పదవీ విరమణ పొందిన ఓ డిప్యూటీ డైరెక్టర్‌ను సమన్వయ అధికారిగా ప్రభు త్వం నియమించినట్లు ప్రచారం జరుగుతోంది. కన్సల్‌ టెంట్‌ సంస్థ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవడానికి యోచిస్తున్నారు. డెల్టా వాటాను తిరిగి అప్పగించి స్వస్తి పలకాలంటే ఏం చేయాలన్న అంశం తేలడం లేదు.

నిర్వహణపై రాని స్పష్టత...

ఎన్‌డీఎస్‌ఎల్‌లో భాగస్వామిగా ఉన్న డెల్టా కంపెనీకి స్వస్తి పలికి ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలన్న యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తదుపరి కర్మాగారాలను ఏ తరహాలో నిర్వహించాలన్న అంశంపై కమిటీ సభ్యులతో పాటు ప్రభుత్వ పెద్దలు పలు విధాలుగా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహణ ఉండాలా.. ప్రైవేటు కంపెనీకి బాధ్యతలు అప్పగించాలా... సహకార పద్ధతి లో నిర్వహించాలా అన్న అంశంపై ఇంకా స్పష్టత రావ డం లేదు. సహకార పద్ధతిలో నడిచే షుగర్‌ ఫ్యాక్టరీల ప్రోత్సాహకానికి కేంద్రం బడ్జెట్‌లో కేటాయింపులు చేయడంతో నిధులు రావాలంటే సహకార విధానం అనుసరించాలా అన్న చర్చలు సైతం జరుగుతున్నాయి. వచ్చే యేడాది క్రషింగ్‌ సీజన్‌ నాటికి కర్మాగారాలను పునరుద్ధరణ జరుగుతుందని కమిటీ వర్గాలు అంటు న్నాయి. ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన అంశాలపై స్పష్టత రావడం లేదు. ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయాలు జరిగితేగాని పునరుద్ధరణ ముందుకు పడే అవకాశాలు లేవన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కర్మాగార పునరుద్ధరణపై అన్నదాతలు ఆశతో ఎదురుచూస్తున్నారు.

రైతుల అభిప్రాయ సేకరణ..

మూడు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సంజయ్‌ కుమార్‌ హైద్రాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రఘునందన్‌ రావు, డైరెక్టర్‌ ఆఫ్‌ షుగర్‌ సీ.హెచ్‌ నర్సిరెడ్డిలతో జిల్లా కలెక్టర్‌ సత్య ప్రసాద్‌ ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ నెల 26వ తేదీన ముత్యంపేట చెరుకు రైతులతో పరిశ్రమలు, వ్యవసాయశాఖ ఉన్నతాధికారుల సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరిశ్రమలు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తారని, అందుకు తగిన ఏర్పాట్లు చేయవల్సిందిగా అధికారులను ఆదేశించారు. చెరుకు రైతుల సమస్యలు, ఫ్యాక్టరీ ప్రారంభం గురించి రైతుల అభిప్రాయాలను ఉన్నతాధికారులు సేకరిస్తారని వివరించారు. చెరుకు సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తూ, ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కావాల్సిన ఏర్పాట్లను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారని తెలిపారు. ఉన్నతాధికారుల పర్యటన నేపథ్యంలో రైతులు సంయమనంతో వారి సమస్యలను అధికారులకు తెలపాలని, అవాంఛనీయా సంఘటనలు జరగకుండా భద్రత పటిష్టం చేయాలని ఎస్పీ అశోక్‌కుమార్‌, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ యాదగిరి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాస్కర్‌, మెట్‌పల్లి ఆర్డీవో ఎన్‌. శ్రీనివాస్‌, మెట్‌పల్లి డీఎస్పీ రాములు, అసిస్టెంట్‌ చెరుకు కమిషనర్‌ వెంకట రవితో పాటు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్‌డీఎస్‌ఎల్‌ కర్మాగారం పునరుద్ధరణకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండడంతో చెరుకు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

Updated Date - Sep 26 , 2025 | 12:44 AM