వానాకాలం సాగుపై ఆశలు
ABN , Publish Date - Aug 07 , 2025 | 01:15 AM
వానాకాలం పంటల సాగుకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడానికి షెడ్యూల్ ఖరారైంది. ఎస్సారెస్పీ నీటి విడుదల కోసం ఎదురుచూస్తున్న రైతాంగానికి శివం కమిటీ శుభవార్త చెప్పిం ది. బుధవారం హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగిన రాష్ట్ర స్థాయి సమీకృత నీటి ప్రణాళిక యాజమాన్య కమిటీ (ఎస్‌సీఐడబ్ల్యూఏఎం) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఖరీఫ్ సాగుపై రైతుల్లో ఆశలు రేకెత్తాయి.
- నేటి నుంచి కాకతీయ కాలువకు నీటి విడుదల
- హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
- ఇప్పటికే 1,93,554 ఎకరాల్లో వరి నాట్లు పూర్తి
- మరో 80 వేల ఎకరాల్లో నాట్లు వేసే అవకాశం
- వర్షాలు లేక ఎండుతున్న పంటలకు అందనున్న నీరు
వానాకాలం పంటల సాగుకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడానికి షెడ్యూల్ ఖరారైంది. ఎస్సారెస్పీ నీటి విడుదల కోసం ఎదురుచూస్తున్న రైతాంగానికి శివం కమిటీ శుభవార్త చెప్పిం ది. బుధవారం హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగిన రాష్ట్ర స్థాయి సమీకృత నీటి ప్రణాళిక యాజమాన్య కమిటీ (ఎస్‌సీఐడబ్ల్యూఏఎం) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఖరీఫ్ సాగుపై రైతుల్లో ఆశలు రేకెత్తాయి.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
ఇటీవల కురిసిన వర్షాలతో వచ్చిన కొద్దిపాటి నీరు మినహా చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండక ఖరీఫ్ సాగుపై రైతులు క్రమేపీ ఆశలు కోల్పోతూ ఆందోళన చెందుతున్న దశలో నీటి పారుదల శాఖ శుభవార్త వినిపించింది. వరిపొలాలు, పత్తి, మొక్కజొన్న పంటలు నీరులేక ఎండల తీవ్రతకు ఎండిపోతుండటంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిని వదలాలని తీసుకున్న నిర్ణయం వాటికి ప్రాణం పోయనున్నది. రాష్ట్రస్థాయి సమీకృత నీటి ప్రణాళిక యాజమాన్య కమిటీ సమావేశం ఈ నెల 7 నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద ఉన్న కాకతీయ, లక్ష్మీ కాలువలకు సాగునీరు వదలాలని నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ఉదయం 11 గంటలకు నీటి విడుదల ప్రారంభం కానున్నది.
ఫ ఎస్సారెస్పీలో 40.5 టీఎంసీల నీరు
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ సామర్థ్యం 80 టీఎంసీలు కాగా 50 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరినప్పుడే సాగు అవసరాల కోసం నీరు విడుదల చేయడం ఆనవాయితీగా వస్తున్నది. గత సంవత్సరం ప్రత్యేక సందర్భంలో 45 టీఎంసీల నీరు ఉన్న దశలోనే పంటలను కాపాడడానికి నీటి విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 40.582 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నది. అయినా ఆయకట్టు పరిధిలో ఇంకా నాట్లు పూర్తికాకపోవడం రైతులు పోసుకున్న నార్లు ముదిరి ఎండిపోతున్నాయి. నాట్లు వేసిన పొలాలు కూడా అవసరమైన నీరందక ఎండిపోతుండగా పత్తి, మొక్కజొన్న పంటల పరిస్థితి కూడా ఆశలు వదులు కోవాల్సిన దశకు చేరుకున్నది. దీంతో 40 టీఎంసీలు ఉన్నా నీటి విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని శ్రీరాంసాగర్ ఆయకట్టు పరిధిలో ఉన్న రైతులు స్వాగతిస్తూ హర్షిస్తున్నారు.
ఫ పూర్తికాని వరినాట్లు
జిల్లాలో వానాకాలం 2,76,500 ఎకరాల్లో వరి సాగు చేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇప్పటి వరకు 1,93,892 ఎకరాల్లో రైతులు నాట్లు వేశారు. మరో 80 వేల ఎకరాల్లో నాట్లు వేయాల్సి ఉన్నది. ఇటీవల కురిసిన వర్షపు నీటితో పొలాలన్నింటినీ దున్ని రైతులు నాటుకు సిద్ధం చేశారు. ఈ సీజన్‌లో 48 వేల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేయగా ఇప్పటికే 38,892 ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశారు. అవన్నీ మొలకెత్తాయి. అలాగే 4 వేల ఎకరాల్లో మొక్కజొన్న వేయాల్సి ఉండగా 2,668 ఎకరాల్లో విత్తనాలు వేయడం పూర్తయింది. 3 వేల ఎకరాల్లో పెసర, కంది పంటలు వేస్తారని అంచనా వేయగా 512 ఎకరాల్లో మాత్రమే సాగయ్యాయి. వరి, మొక్కజొన్న, పత్తి పంటలు వ్యవసాయశాఖ అంచనా వేసిన మేరకు సాగవుతాయని భావిస్తున్నారు.
ఫ ప్రాజెక్టు కింద జిల్లాలో 1,39,787 ఎకరాల సాగు
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద కరీంనగర్ జిల్లాలోని 1,39,787 ఎకరాలు సాగవుతాయి. ఇందులో లక్ష ఎకరాలు ఎల్‌ఎండీ దిగువన ఉండగా 39 వేల ఎకరాలు ఎల్‌ఎండీ ఎగువన ఉన్నాయి. కాకతీయ కాలువ ద్వారా ఈ ఆయకట్టుకు నీరు అందుతుంది. ఈ ఆయకట్టు మొత్తం ప్రస్తుతం సాగు చేసేందుకు రైతులు సన్నద్ధమై ఇప్పటికే సగం వరకు నాట్లు వేశారు. బోరుబావులు, ఓపెన్ బావులు, చెరువులు, కుంటల కింద మరో లక్షా 30 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండితే ప్రాజెక్టు ద్వారా కాకతీయ, వరద కాలువలకు నీరు విడుదల చేసి మిడ్ మానేరు, ఎల్‌ఎండీ ప్రాజెక్టులను నింపి వాటి ద్వారా ఆయకట్టుకు నీరందిస్తారు. అయితే వర్షాభావ పరిస్థితుల కారణంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండని పరిస్థితి నెలకొన్నది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 50 శాతం నీరు వచ్చి చేరడంతో నీటి విడుదలకు రంగం సిద్ధం చేశారు. కాకతీయ కాలువకు నీరు విడుదల చేయడంతో ఆయకట్టు పరిధిలో మిగతా 80 వేల ఎకరాల్లో వరినాట్లు పూర్తికావడమే కాకుండా ఇప్పటికే నాట్లు పూర్తయి ఎండిపోతున్న దశలో ఉన్న పైర్లకు కూడా సాగునీరు అంది పంట దక్కించుకునే అవకాశం కలుగుతున్నది. రాబోయే రోజుల్లో ఒకటి రెండు మంచి వర్షాలు కురిసినా ప్రాజెక్టులు నిండే అవకాశాలు ఉండడంతో వానాకాలం సీజన్‌లో అంచనాల మేరకు సాగు జరిగి ఫలసాయం పొందే అవకాశాలు ఉంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.