Share News

భూ హక్కులపై ఆశలు

ABN , Publish Date - Aug 31 , 2025 | 01:07 AM

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సాదా బైనామాలకు అడ్డుగా ఉన్న కోర్టు కేసు తొలగిపోవడంతో ఇకనైనా నిరీక్షణకు తెర పడుతుందని రైతుల్లో ఆశలు మొదలయ్యాయి.

భూ హక్కులపై ఆశలు

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సాదా బైనామాలకు అడ్డుగా ఉన్న కోర్టు కేసు తొలగిపోవడంతో ఇకనైనా నిరీక్షణకు తెర పడుతుందని రైతుల్లో ఆశలు మొదలయ్యాయి. సాదా బైనామాల రిజిస్ట్రేషన్‌లను వ్యతిరేకిస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ కొట్టివేసింది. 2020లో హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసింది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2020 సంవత్సరంలో తీసుకువచ్చిన 112 జీవో స్థానంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చింది. రైతులు భూభారతిలో సాదా బైనామాలకు పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నట్లుగానే ప్రభుత్వం సాదా బైనామాల పరిష్కారంపై విధివిధానాలను హైకోర్టుకు సమర్పించి కేసును కొట్టి వేయించింది. సాదా బైనామాల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రైతుల్లో ధీమా ఏర్పడింది. సాదాబైనామాల క్రమబద్ధీకరణ దరఖాస్తులను పరిశీలించి పట్టాదారు పాసుపుస్తకాలను జారీ చేయాల్సి ఉండగా వివిధ కారణాలతో గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. కోర్టులో దాఖలైన పిటిషన్లకు గత ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయకపోవడంతోనే పరిష్కారం లభించలేదు. దీంతో రైతులు ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు దూరమయ్యారు. రైతుబంధు, రైతు బీమా, బ్యాంకు రుణాలు, రుణమాఫీ వంటి పథకాలను అందుకోలేకపోయారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు భరోసా, రైతు బీమా, ఫసల్‌బీమా వంటివి అందించే దిశగా సాదాబైనామాలను క్రమబద్ధీకరించే చర్యల్లో భాగంగానే ఆర్వోఆర్‌-2024 చట్టం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. కోర్టు కేసు తొలగిపోవడంతో వేగంగా సాదాబైనామా దరఖాస్తులు పరిష్కారం అవుతాయని, రైతులకు ఊరట కలుగుతుందని భావిస్తున్నారు.

భూభారతిలో కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు..

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ధరణి భూ సమస్యలకు పరిష్కారం చూపకపోగా, పట్టాదారులకు కొత్త సమస్యలను తెచ్చిపెట్టింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతిని తీసుకురావడంతో రైతుల్లో మళ్లీ భూసమస్యలు తీరుతాయని ఆశగా ఎదురుచూశారు. భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూసమస్యలపై మళ్లీ కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చాయి. భూభారతి సదస్సులో అసైన్డ్‌ భూముల సమస్యలతో పాటు సాదాబైనామాలపైన ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 6787 దరఖాస్తులు రెవెన్యూ సదస్సులో వచ్చాయి. వీటిలో సాదాబైనామా దరఖాస్తులు 1675 వచ్చాయి. దరఖాస్తుల పరిష్కారానికి రెవెన్యూ అధికారులు కసరత్తు ప్రారంభించారు. జిల్లాలో ప్రధానంగా రైతుల ఎదుర్కొంటున్న సమస్యల్లో దాదాపు 10 ఏళ్లుగా ఇబ్బందిపెడుతున్న సమస్య సాదా బైనామాలు ప్రధానంగా ఉన్నాయి. సాదా బైనామాలు పరిష్కారం పేరిట గత ప్రభుత్వం 2016లో జీవో నంబర్‌ 153 తీసుకువచ్చింది. 2014 జూన్‌ 2వ తేదీ ముందు సాదా బైనామాతో భూములు కొనుగోలు చేసిన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. చట్టబద్ధత కల్పించాలని భావించారు. ఇందుకోసం 2020 అక్టోబరు 12న జీవో నంబరు 112 జారీచేసింది. దీనికి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది. సాదా బైనామాలపై తహసీల్దార్‌లకు అధికారాలు ఇచ్చిన మార్గదర్శకాలు ఇవ్వకపోవడంతో సమస్యలు మాత్రం పరిష్కరించలేదు. హైకోర్టు నాటి స్టేను ఎత్తివేయడంతో పదేళ్ల నిరీక్షణకు తెరపడింది.

గత ప్రభుత్వం ప్రకటించినా..

సాదాబైనామాలకు చట్టబద్ధత కల్పించి క్రమబద్ధీకరిస్తామని గత ప్రభుత్వం ప్రకటించినా ఆచరణలోకి రాలేదు. గత ప్రభుత్వం నిర్ణయించి దరఖాస్తులు తీసుకున్నా ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం తెల్లకాగితం ఒప్పందాలకు చట్టబద్ధత కల్పించాలని తెలంగాణ భూభారతి బిల్లు 2024 ద్వారా సాదాబైనామాలతో క్రమబద్ధీకరణకు భూభారతి పోర్టల్‌ ద్వారా రైతులందరికి పట్టాదారు పాసుపుస్తకాలు అందించాలని నిర్ణయించారు. గత ప్రభుత్వం 2020 సంవత్సరం నవంబరు వరకు సాదాబైనామాల దరఖాస్తులను స్వీకరించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 15వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. మీ సేవా ద్వారా చేసుకున్న దరఖాస్తుల్లో సిరిసిల్ల మండలంలో 428, వేమువాడ మండలంలో 675, వేములవాడ రూరల్‌లో 1072, ఎల్లారెడ్డిపేటలో 1227, తంగళ్లపల్లిలో 1776, ముస్తాబాద్‌లో 1685, గంభీరావుపేటలో 1403, చందుర్తిలో 1259, బోయినపల్లిలో 764, కోనరావుపేటలో 2690, రుద్రంగిలో 162, వీర్నపల్లిలో 379మంది దరఖాస్తులు వచ్చాయి. వీటిని క్రమబద్ధీకరించే చర్యలు మాత్రం జరగలేదు. తాజాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం భూభారతి రెవెన్యూ సదస్సులో మళ్లీ దరఖాస్తులు చేసుకున్నారు. జిల్లాలోని 167 రెవెన్యూ గ్రామాల పరిధిలో సదస్సులు నిర్వహించగా జిల్లాలో భూ సమస్యలపై 6787 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో మిస్సింగ్‌ సర్వే నంబర్లు, విస్తీర్ణంలో మార్పులు, చేర్పులు, సాదాబైనామాలు, కోర్టు కేసులు, ఒకరి భూములు మరొకరిపై నమోదు కావడం, పెండింగ్‌ మ్యుటేషన్‌ తదితర సమస్యలపై దరఖాస్తులు చేసుకున్నారు. మిస్సింగ్‌ సర్వే నంబర్లకు సంబంధించి 1393 దరఖాస్తులు, పెండింగ్‌ మ్యుటేషన్‌కు 295 దరఖాస్తులు, డీఎస్‌ పెండింగ్‌లో 404 దరఖాస్తులు వచ్చాయి. భూమి విస్తీర్ణం, చేర్పులు మార్పులు సంబంధించి 2093 దరఖాస్తులు వచ్చాయి. నిషేధిత జాబితాలో భూములు నమోదు అయినట్లు సవరించడానికి 270 దరఖాస్తులు వచ్చాయి. అసైన్డ్‌ భూములు, భూసేకరణ, ఇతర రికార్డులకు సంబంధించిన సమస్యలపై 3489 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 1675 సాదాబైనామాల సమస్యలపైనే దరఖాస్తులు వచ్చాయి. బోయినపల్లి మండలంలో 167, చందుర్తిలో 287, ఇల్లంతకుంటలో 200, గంభీరావుపేటలో 192, కోనరావుపేటలో 136, ముస్తాబాద్‌లో 306, సిరిసిల్లలో 13, తంగళ్ళపల్లిలో 75, వేములవాడలో 92, వేములవాడ రూరల్‌లో 82, వీర్నపల్లిలో 49, ఎల్లారెడ్డిపేటలో 76 దరఖాస్తులు వచ్చాయి.

సమస్యల పరిష్కారంపై ఆశలు

కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్తగా ఆర్‌వోఆర్‌ 2020-25 భూభారతి చట్టాన్ని తీసుకువచ్చింది. భూభారతిపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు సదస్సులు నిర్వహించి దరఖాస్తులను స్వీకరించారు. భూభారతిలో సాదా బైనామాలు సమస్యలు పరిష్కారం అవుతాయని దరఖాస్తుదారులు ఆశలు ఏర్పడ్డాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలు జరుగుతున్న భూరికార్డుల నిర్వహన పద్ధతులను పరిశీలించిన అనంతరం వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు సంబంధించి వేర్వేరు రికార్డులు చేయడానికి ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. భూ రికార్డులు మెరుగ్గా ఉండే విధంగా రైతు సంఘాలు మేధావులు, విద్యావేత్తలు, న్యాయవాదులు ప్రజాప్రతినిధులు, విశ్రాంత రెవెన్యూ ఉద్యోగుల సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకోని భూ భారతి కొత్త చట్టాని తీసుకవచ్చారు. పకడ్బందీగా భూ భారతిలో డేటాను అప్‌లోడ్‌ చేశారు. 33 నుంచి 6 మాడ్యూల్‌లకు పరిమితం చేశారు. భూమిత్రలో సందేహాలను నివృత్తి చేసే విధంగా చాట్‌ బోర్డులు ఏర్పాటు చేశారు. దీనిద్వారా ఏ సందేహాం అయినా తీర్చుకునే వీలు కల్పించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ సహకారంతో ఈ చాట్‌ బోర్డు పనిచేసేలా డిజైన్‌ చేశారు. ధరణి పోర్టల్‌లో వివరాల నమోదు, ఓటీపీ నమోదు వరకు 30 సెకండ్లు అవుతుండగా దీనినే నాలుగు సెకండ్లలోనే వివరాలు అందించేలా స్పీడ్‌ పెంచారు. 33 మాడ్యూల్‌లో కొన్నింటిని అనుసంధానం చేయగా 5, 6 మాడ్యుల్‌లను పూర్తిగా తొలగించారు. 18, 19 మాడ్యూల్లను కలిపి ఆరుగా మార్చారు. రైట్‌ టు ప్రైవసీ చెక్‌ను తొలగించారు. గతంలో ధరణి పోర్టల్‌లో కొందరు తమ భూముల వివరాలను గోప్యంగా ఉంచుకునేందుకు వెసులుబాటు కల్పించిన ప్రైవసీచెక్‌ను పూర్తిగా ఎత్తివేశారు. ప్రతి ఎకరంభూమి వివరాలు ఉండే విధంగా ఏర్పాటు చేశారు. సరళమైన భాషలో జనానికి అర్థమయ్యే విధంగా అంశాలను పొందుపర్చారు.

Updated Date - Aug 31 , 2025 | 01:07 AM