Share News

ఆశలు గల్లంతు..

ABN , Publish Date - Jun 22 , 2025 | 01:16 AM

నిరుద్యోగులకు ఆర్థికంగా చేయూతనందించే సంకల్పంతో ప్రభుత్వం శ్రీకారం చుట్టిన రాజీవ్‌ యువ వికాసం పథకానికి బ్రేకులు పడ్డాయి.

ఆశలు గల్లంతు..

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

నిరుద్యోగులకు ఆర్థికంగా చేయూతనందించే సంకల్పంతో ప్రభుత్వం శ్రీకారం చుట్టిన రాజీవ్‌ యువ వికాసం పథకానికి బ్రేకులు పడ్డాయి. ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతీ యువకుల ఆశలు ఒక్కసారిగా గల్లంతయ్యాయి. మార్చి, ఏప్రిల్‌లో రాజీవ్‌ యువ వికాసం పథకానికి యువతీ యువకుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. జూన్‌ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాజీవ్‌ యువ వికాసం పథకంలో ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందిస్తారని హడావుడి చేశారు. తీరా పథకం అమలుకు ఆకస్మికంగా బ్రేక్‌ వేశారు. స్థానిక ఎన్నికల తర్వాతనే ముందుకు వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన జాబితాను సిద్ధం చేసిన పథకం వాయిదా పడడంపై నిరుద్యోగ యువతీ యువకుల్లో అయోమయం ఏర్పడింది.

రూ 50వేల నుంచి రూ 4 లక్షల వరకు...

రాజీవ్‌ యువ వికాసం పథకం ద్వారా నిరుపేద, మధ్య తరగతి యువతకు ఉపాధి కల్పించేందుకు రూ 50 వేల నుంచి 4 లక్షల వరకు రుణాలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం యువత నుంచి దరఖాస్తులు అహ్వానించి లబ్ధిదారులను ఎంపిక ప్రక్రియ చేపట్టింది. రాజీవ్‌ యువ వికాసంతో ఉపాధిపై ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులకు సిబిల్‌ స్కోర్‌ అడ్డుగా మారింది. డిప్యూటీ సీఎం రాజీవ్‌ యువ వికాసానిని సిబిల్‌ స్కోర్‌ అవసరం లేదని ప్రకటనలు చేసినా ప్రభుత్వ మార్గదర్శకాలు బ్యాంకర్లకు చేరకపోవడంతో సిబిల్‌ స్కోర్‌ చిక్కుముడి అలాగే ఉండిపోయింది. బ్యాంకర్లు ఏటువంటి రుణాలు ఇవ్వాలన్నా మొదట సిబిల్‌ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటారు. రాజీవ్‌ యువ వికాసం దరఖాస్తులు బ్యాంక్‌లకు వెళ్లిన తరువాత సిబిల్‌ స్కోర్‌ యువతకు నిరాశ మిగిలిస్తోంది. ఆధార్‌, సెల్‌నంబర్‌లు జత చేయడంతో రుణాల ప్రక్రియ కొంత అయోమయంగానే మారింది. రాజీవ్‌ యువ వికాసం పథకంలో రూ 50 వేలు, రూ లక్ష, రూ 2 లక్షల నుంచి రూ 4 లక్షల రుణాలు అందిస్తుండగా, రూ 50 వేల వరకు వంద శాతం సబ్సిడీ రాయితీ, రూ 50 నుంచి రూ లక్ష వరకు 90 శాతం సబ్సిడీ రాయితీ కాగా, పది శాతం లబ్ధిదారుడు చెల్లించాల్సి ఉంటుంది. రూ లక్ష నుంచి రూ 2 లక్షల వరకు 80 శాతం రాయితీ, 20 శాతం రుణం, రూ 2 నుంచి 4 లక్షల వరకు 70 శాతం సబ్సిడీ 30 శాతం రుణంగా అందించనున్నారు. ప్రభుత్వం అందించే యూనిట్లలో పౌల్ర్టీ, బ్యాగుల తయారీ, కొబ్బరి బొండాల దుకాణాలు, బ్యాంగిల్‌ స్టోర్‌, డెయిరీ ఫాం, ఎలక్ర్టికల్‌, మినీ సూపర్‌ బజార్‌, స్ర్పింక్లర్లు, డ్రిప్‌ ఇరిగేషన్‌, గొర్రెలు, సెలూన్‌, బ్యూటీపార్లర్‌, హార్డ్‌వేర్‌, మెడికల్‌ దుకాణాలు.. ఇలా పలు యూనిట్లను నిర్ణయించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాత్రం అర్హులైన వారికి ఆర్థిక వికాసంగా రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని అందించడానికి సిద్ధమైనా తాత్కలికంగా నిలిచిపొయింది.

జిల్లాలో 7121 మంది ఎంపిక..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాజీవ్‌ యువ వికాసం పథకానికి 36,819 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఎస్సీ కార్పొరేషన్‌కు 8,865 దరఖాస్తులు, ఎస్టీ కార్పొరేషన్‌కు 1,943 దరఖాస్తులు, బీసీ కార్పొరేషన్‌కు 23,243 దరఖాస్తులు, మైనార్టీ కార్పొరేషన్‌కు 1,606 దరఖాస్తులు, క్రిస్టియన్‌ మైనార్టీ కార్పొరేషన్‌కు 39 దరఖాస్తులు, ఈబీసీ దరఖాస్తులు 1,123 వచ్చాయి. దరఖాస్తులను మండల కేంద్రాలు, మున్సిపల్‌ కార్యాలయాల్లో పరిశీలించారు. జిల్లాలో 7,680 యూనిట్లకు రుణాల పంపిణీ లక్ష్యం కాగా, 7,121 మంది అర్హులను ఎంపిక చేశారు. రూ 50 వేల వరకు 2,464 యూనిట్లకు 2,148 మంది అర్హులుగా గుర్తించారు. రూ 50 వేల నుంచి లక్ష వరకు 1,876 యూనిట్లకు 1,771 మంది అర్హులు, రూ లక్ష నుంచి రూ 2 లక్షల వరకు 1,642 యూనిట్లకు 1,587 మంది అర్హులుగా రూ 2 నుంచి రూ 3 లక్షల వరకు 372 యూనిట్లుకు 372 మంది అర్హులు, రూ 2 లక్షల నుంచి రూ 4 లక్షల వరకు 941 యూనిట్లకు 924 మంది అర్హులు, రూ 3 లక్ష లనుంచి రూ 4 లక్షల వరకు 308 యూనిట్లకు 308 మంది అర్హులు 43 బోర్‌వెల్‌ యూనిట్లకు 8 మంది అర్హులు. ఎనర్జీ ఓఆర్‌సీ 32 యూనిట్లకు ఇద్దరు అర్హులు, సోలార్‌ ప్యానెల్‌ ఫర్‌ బోర్‌వెల్‌కు 2 యూనిట్లకు ఒక్కరు అర్హులుగా గుర్తించారు. యవ వికాసం పథకం ఎప్పుడు అమలులోకి వస్తుందా అని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.

Updated Date - Jun 22 , 2025 | 01:16 AM