తల్లులకు నిరీక్షణ..
ABN , Publish Date - Jun 29 , 2025 | 01:21 AM
తల్లులకు నిరీక్షణ తప్పడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను పెంచే దిశగా గత ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా సాగిన అమ్మఒడి పథకం లక్ష్యం కొంతమేరకు నేరవేరినా గర్భిణులు, బాలింతలకు అందించే ప్రోత్సాహకానికి ఎదురుచూడక తప్పడం లేదు.
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
తల్లులకు నిరీక్షణ తప్పడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను పెంచే దిశగా గత ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా సాగిన అమ్మఒడి పథకం లక్ష్యం కొంతమేరకు నేరవేరినా గర్భిణులు, బాలింతలకు అందించే ప్రోత్సాహకానికి ఎదురుచూడక తప్పడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత అమ్మఒడి పథకం పేరును మదర్ చైల్డ్ హెల్త్‌గా మార్చినా పైసలు మాత్రం అందడం లేదు. మాతా శిశు మరణాలు తగ్గించడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచేందుకు దోహదపడుతున్న నగదు ప్రోత్సాహకానికి కొద్ది రోజులుగా నిరీక్షణ తప్పడం లేదు. నాలుగు విడతలుగా అందించే ప్రోత్సాహకం దాదాపు మూడేళ్లుగా ఎదురు చూపులకే పరిమితం అయ్యింది. కొద్ది రోజులగా 16 వస్తువులతో కూడిన కిట్లు కూడా నిలిచిపోయాయి. 2017లో ప్రారంభమైన అమ్మఒడి పథకాన్ని మదర్ చైల్డ్ హెల్త్‌గా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తున్నా ప్రోత్సాహక బకాయిలు అందకపోవడంతో నిరాశ చెందుతున్నారు.
జిల్లాలో రూ 18.03 కోట్ల బకాయిలు..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మదర్ చైల్డ్ హెల్త్ పథకానికి సంబంధించిన ప్రోత్సాహక బకాయిలు రూ 18.03 కోట్ల వరకు ఉన్నాయి. బకాయిల కోసం జిల్లాలో 1,28,094 అర్హులు ఉండగా, 67,536 మంది లబ్ధిపొందారు. ఇంకా 60,558 మంది గర్భిణులు, బాలింతలు ఎదురుచూస్తున్నారు. మదర్ చైల్డ్ హెల్త్ స్కీంలో గర్భం దాల్చిన తరువాత మొదటి విడతలో ప్రసవాల సమయంలో రూ.3 వేలు అందిస్తారు. రెండో విడతలో మగబిడ్డ పుడితే రూ 4 వేలు, ఆడబిడ్డ పుడితే రూ 5 వేలు, మూడో విడతలో ఇమ్యునైజేషన్ సమయంలో రూ 2 వేలు, చివరి ఇమ్యునైజేషన్ నాలుగో విడతలో రూ 3 వేలు తల్లి ఖాతాల్లో జమ చేస్తారు. జిల్లాలో పథకం ప్రారంభమైన తరువాత వివిధ సేవలకు సంబంధించిన ప్రొత్సాహకాల్లో గర్భిణుల్లో 20,381 మంది, ప్రసూతి అయినవారు 10,017మంది, మొదటి టీకాలు తీసుకున్నావారు 19,866 మంది, చివరి టీకాలు తీసుకున్నావారు 17,272 మంది లబ్ధి పొందారు. ప్రోత్సాహకం కోసం ఎదురుచూస్తున్న వారి బకాయిలు రూ.18 కోట్ల 3లక్షల 84వేలు ఉన్నాయి. ఇందులో గర్భిణులకు సంబంధించి 14,623 మందికి రూ 4,38,69,000, ప్రసూతి అయిన వారిలో 11,000 మంది రూ 4,95,00,000, మొదటి ఇమ్యునైజేషన్‌కు సంబంధించి 17,790 మందికి రూ 3,55,80,000, చివరి ఇమ్యునైజేషన్‌కు సంబంధించి 17,145 మందికి రూ 5,14,35,000 బకాయిలు రావాల్సి ఉంది. వీటి కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు.