నేడు హిందూ ఏక్తా యాత్ర
ABN , Publish Date - May 22 , 2025 | 01:43 AM
హనుమాన్ జయంతి సందర్భంగా హిందూ ఏక్తా యాత్ర గురువారం కరీంనగర్‌లో జరగనున్నది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పన్నెండేళ్లుగా ఏక్తా యాత్రను నిర్వహిస్తూ వస్తున్నారు. ఆ ఆనవాయితీలో భాగంగానే గురువారం భారీ ఎత్తున నగరంలో ఏక్తా యాత్ర నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానికి 50 వేల మంది హాజరవుతారని భావిస్తున్నారు.
- కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు
- కాషాయమయమైన నగరం
- 50 వేల మందితో ర్యాలీకి ఏర్పాట్లు
- ఏక్తా యాత్రకు పన్నెండేళ్లు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
హనుమాన్ జయంతి సందర్భంగా హిందూ ఏక్తా యాత్ర గురువారం కరీంనగర్‌లో జరగనున్నది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పన్నెండేళ్లుగా ఏక్తా యాత్రను నిర్వహిస్తూ వస్తున్నారు. ఆ ఆనవాయితీలో భాగంగానే గురువారం భారీ ఎత్తున నగరంలో ఏక్తా యాత్ర నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానికి 50 వేల మంది హాజరవుతారని భావిస్తున్నారు. ఏక్తా యాత్ర కోసం నగరాన్ని కాషాయ జెండాలు, ఫ్లెక్సీలు, హోర్డింగులు, కటౌట్లతో అలంకరించారు. యాత్ర సాయంత్రం 4 గంటలకు వైశ్యభవన్ వద్ద ప్రారంభమై టవర్‌సర్కిల్, కమాన్, వన్‌టౌన్ పోలీస్ స్టేషన్, బస్టాండ్, అమరవీరుల స్తూపం మీదుగా తిరిగి వైశ్యభవన్‌కు చేరుకోనున్నది. ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కళా రూపాల ప్రదర్శనలు నిర్వహించనున్నారు. రాజకీయాలకు అతీతంగా హిందువులను సంఘటితపరిచే లక్ష్యంగా ఈ యాత్ర కొనసాగుతుందని, హిందు సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా, సంఘటిత శక్తిని చాటేలా ఏక్తా యాత్రను నిర్వహిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ యాత్రకు సామాజిక సమరసత వేదిక కన్వీనర్ అప్పాల ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. వేలాది మంది హనుమాన్ భక్తులతోపాటు పలు సంఘాల సభ్యులు ఈ యాత్రలో పాల్గొననున్నారు. ఆయా సంఘాలు ఇప్పటికే యాత్రకు సంఘీభావాన్ని ప్రకటించి యాత్రను విజయవంతం చేయాలని ప్రజలను కోరాయి. గత సంవత్సరం పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఏక్తా యాత్రను నిర్వహించలేదు. ఆ ఎన్నికల్లో బండి సంజయ్ కుమార్ పార్లమెంట్ సభ్యుడిగా గెలవడం, కేంద్ర మంత్రి పదవి చేపట్టంతో తన పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి ఈ యాత్రలో పాల్గొనేందుకు వీలుగా సంజయ్ కుమార్ ఏర్పాట్లు చేశారు. యాత్ర సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సిబ్బందిని తరలించి నగరంలోని సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక పికెట్స్ ఏర్పాటు చేసి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీపీ గౌస్ ఆలం పర్యవేక్షణలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి 10 గంటల వరకు నగరంలోని అన్ని వైన్‌షాపులను, బార్ షాపులను మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎండతీవ్రత బాగా ఉంటున్న కారణంగా ర్యాలీ జరిగే వీధుల్లో ర్యాలీలో పాల్గొనే వారికి మంచినీరు, మజ్జిగ అందించేందుకు వివిధ సంఘాలు ఏర్పాట్లు చేస్తున్నాయి.