మంచి విత్తనాలతోనే అధిక దిగుబడి
ABN , Publish Date - Jun 15 , 2025 | 12:25 AM
వానాకాలంలో అధిక దిగుబడి సాధించాలంటే మంచి విత్తనాలను రైతులు ఎంపిక చేసుకోవాలి. వాతావరణం, నేల స్వభావాన్ని బట్టి విత్తనాలను నాటాలి.
ఫ ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వ్యవసాయ శాఖ అధికారులు
హుజూరాబాద్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): వానాకాలంలో అధిక దిగుబడి సాధించాలంటే మంచి విత్తనాలను రైతులు ఎంపిక చేసుకోవాలి. వాతావరణం, నేల స్వభావాన్ని బట్టి విత్తనాలను నాటాలి. వ్యవసాయాధికారుల సూచనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే చీడపీడలు, తెగుళ్లు ఆశించడం వల్ల పంట నష్టం జరుగుతుంది. దీన్ని గమనించి రైతులు విత్తనాలను కొనుగోలు చేయాలి. ఎరువుల దుకాణాల నుంచి విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు తప్పకుండా బిల్లును తీసుకోవాలి. విత్తనాల్లో ఏమైనా సమస్యలుంటే వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది.
ఫ తీసుకోవాల్సిన జాగ్రత్తలు
రైతులు ఎరువుల దుకాణాలకు వెళ్లినప్పుడు సరైన సీలుతో ఉన్న విత్తనాలనే కొనుగోలు చేయాలి. విత్తన సంచులపై విత్తన రకం, లాట్ నంబర్, గడువు తేదీ, తదితర వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు బిల్లు తప్పకుండా తీసుకొని షాపు యజమాని సంతకం తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. విత్తన రకం, మొలకెత్తే స్వభావం, జన్యుపర నాణ్యత వివరాలు లేబుల్ మీద ఉంటేనే కొనుగోలు చేయాలి. రైతులు ఇంటి వద్దనే విత్తన మొలెకెత్తే శాతాన్ని పరీక్షించుకున్న తర్వాతనే దుక్కులు, పొలాల్లో విత్తుకోవాలి. విత్తనాల్లో ఏమైనా లోపాలు ఉంటే దుకాణదారుడి వద్దకు వెళ్లి అడగాలి. సరైన సమాధానం ఇవ్వకుంటే వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేయాలి. పంటలకు నష్టం జరిగితే దుకాణదారుడు ఇచ్చిన బిల్లే కీలకంగా మారుతుంది. విత్తనాలు కొనుగోలు చేసిన బిల్లులను పంట పూర్తయ్యే వరకు జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. సీల్ లేని విత్తనాలను కొనుగోలు చేయవద్దు. విత్తనాలు కొనుగోలు చేసే ముందు బరువును కూడా సరి చూసుకోవాలి.
ఫ బీజీ-3 విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలి.
రైతులు మార్కెట్లో బీజీ-3 విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలి. బీజీ-3 విత్తనాలను ప్రభుత్వం నిషేధించింది. గ్రామాల్లో ఎవరైనా బీజీ-3 విత్తనాలు అమ్మితే కొనుగోలు చేయవద్దు. ఇప్పటికే గ్రామాల్లో వ్యవసాయాధికారులు బీజీ-3 విత్తనాలు వాడవద్దని అవగాహన కల్పించారు. దీంతో రైతులు పెద్దగా బీజీ-3 విత్తనాలపై ఆసక్తి చూపడం లేదు.
ఫ వ్యవసాయ పనుల్లో రైతులు బిజీ
కరీంనగర్ రూరల్: వానాకాలం సాగు పనులు ప్రారంభమయ్యాయి. అడపాదడపా కురుస్తున్న వర్షాలతో రైతన్నలు వ్యవసాయ పనుల్లో బిజీ అయ్యారు. ఇప్పటికే పత్తి వేయడానికి దుక్కులు దున్నిన రైతులు విత్తనాలు వేస్తున్నారు. వరి సాగు చేసే రైతులు నారుమడులు సిద్ధం చేశారు. కరీంనగర్ రూరల్ మండలంలో ఈ సీజన్‌లో వరి అత్యధికంగా సాగవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. గత యాసంగి సీజన్‌లో ధాన్యం దిగుబడి మంచిగా రావడంతో వరి వేసేందుకు అన్నదాతలు సిద్ధమయ్యారు. ఈ సీజన్‌లో 15,900ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేయనుండగా వరి 12,600ఎకరాలకుపైగా, పత్తి 2300 ఎకరాల్లో సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. మండలంలో ఎస్సారెస్పీ కాలువలతోపాటు చెరువు పారకం, వ్యవసాయ బావులు, వ్యవసాయ బోర్ల ఆధారంగా రైతులు పంటలు సాగు చేస్తున్నారు.
ఫ వ్యవసాయాధికారుల సూచనలు పాటించాలి..
- సునీత, ఏడీఏ, హుజూరాబాద్
రైతులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు వ్యవసాయాధికారుల సూచనలు పాటించాలి. సరైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. ఎరువుల దుకాణాల్లో విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా బిల్లులు తీసుకొని భద్రపరుచుకోవాలి. ప్రభుత్వం బీజీ-3 విత్తనాలను నిషేధించింది. గ్రామాల్లో ఎవరైనా బీజీ-3 విత్తనాలు అమ్మితే వ్యవసాయాధికారులకు సమాచారం అందించాలి. వర్షాలు సమృద్ధిగా కురిసిన తర్వాతనే విత్తనాలు వేసుకోవాలి.