వర్షంతో అపార నష్టం
ABN , Publish Date - Oct 31 , 2025 | 12:54 AM
జిల్లాలో మొంథా తుఫాన్ పంటలపై తీవ్ర ప్రభావం చూపింది.
కరీంనగర్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో మొంథా తుఫాన్ పంటలపై తీవ్ర ప్రభావం చూపింది. బుధవారం కురిసిన భారీ వర్షానికి ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యం కళ్ల ముందే కొట్టుకు పోవడం, కోతకు వచ్చిన పంట నీట మునగడంతో అన్నదాతలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జిల్లాలో అత్యదికంగా సాగు చేసే వరి, పత్తి పంటలకు తుఫాన్ తీవ్ర నష్టం కలిగించింది. వారంరోజులుగా ధాన్యాన్ని అమ్ముకునేందుకు కొనుగోలుకేంద్రాలు, వ్యవసాయ మార్కెట్ యార్డులకు తరలించారు. తేమశాతం ఎక్కువగా ఉండడంతో ఆరబెట్టుకున్నారు. ఆ ధాన్యమంతా తడిసి ముద్దయింది. రోడ్ల పక్కన ఆరబెట్టిన వరి ధాన్యం భారీ వర్షానికి వచ్చిన వరదలో కొట్టుకుపోయింది.
ఫ వరి, పత్తికి తీవ్ర నష్టం
జిల్లా వ్యవసాయశాఖ అధికారులు వేసిన అంచనా మేరకు జిల్లాలోని 183 గ్రామాల పరిధిలోని 3,321 మంది రైతులకు సంబంధించిన 3,512 ఎకరాల్లో పత్తి చేన్లు తడిసి ముద్దయ్యాయి. అత్యధికంగా కొత్తపల్లి మండలంలో 1200 ఎకరాల్లో, ఇల్లందకుంట మండలంలో 300 ఎకరాలు, జమ్మికుంటలో 200 ఎకరాలు, సైదాపూర్‌లో 324 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. జిల్లాలోని 15 మండలాల్లో వరి పంటకు తీవ్ర నష్టం కలిగింది. 26,441 మంది రైతులకు సంబంధించిన 30,560 ఎకరాల్లో వరి పంట నీటమునిగింది. వ్యవసాయ మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి తీసుకువచ్చిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. చాలా చోట్ల రైతులు రోడ్ల వెంట ఆరబెట్టిన ధాన్యం వరదకు కొట్టుకు పోయింది. జిల్లాలో ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో 4,684 క్వింటాళ్లు, డీసీఎంఎస్ కేంద్రాల్లో 6,690 క్వింటాళ్లు, హాకా పరిధిలోని కొనుగోలుకేంద్రాల్లో 270 క్వింటాళ్ల ధాన్యం తడిసింది. మొత్తం జిల్లాలో 11,644 క్వింటాళ్ల ధాన్యం, 3,512 ఎకరాల్లోని పత్తి పంటకు నష్టం వాటిల్లినట్లు అధికారుల సమాచారం.
ఫ మండలాల వారీగా..
వీణవంక మండలంలోని 26 గ్రామాల్లో 1,250 ఎకరాల వరి పంట, 220 ఎకరాల పత్తిపంట వరద నీటిలో మునిగింది. హుజురాబాద్ మండలంలోని 19 గ్రామాల్లో 3,959 ఎకరాల్లోని వరి పంట నీటిపాలైంది. జమ్మికుంట మండలంలో 400 ఎకరాల్లో వరి, 200 ఎకరాల్లో పత్తి పంటకు నీట మునిగి నష్టం వాటిల్లడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యంపై టార్పాలిన్లను వేసినప్పటికీ భారీ వర్షంతో ధాన్యం తడిసి ముద్దయింది. ఇల్లందకుంట మండలంలో 1,200 ఎకరాల వరి పంట దెబ్బతినగా, 300 ఎకరాల్లో పత్తిపంట తడిసి దెబ్బతిన్నదని రైతులు వాపోతున్నారు. శంకరపట్నం మండలంలో 1,500 ఎకరాల వరి పంట నీట మునిగింది. గన్నేరువరం మండలంలో 1,700 ఎకరాల్లో వరి పంట, 270 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిన్నట్లు రైతులు తెలిపారు. మానకొండూర్ మండలంలోని 1,800 ఎకరాల్లో వరి పంట, 220 ఎకరాల్లో పత్తిపంటకు నష్టం వాటిల్లింది. సైదాపూర్ మండలంలో 2,447 ఎకరాల్లో వరి పంట, 518 ఎకరాల్లో పత్తి పంట నీట మునిగింది. 2,270 క్వింటాళ్ల ధాన్యం వరదలో కొట్టుకుపోయింది. కరీంనగర్ రూరల్ మండలంలో 2,498 ఎకరాల్లో సాగు చేసిన వరి పంట, 1,033 ఎకరాల్లో పత్తి పంట నష్టానికి గురైంది. కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి ఆరబెట్టిన 6,844 క్వింటాళ్ల వరి ధాన్యం తడిసి పోయింది. గంగాధర మండలంలో 1530 ఎకరాల వరి పంట నీట మునిగింది. కొనుగోలు కేంద్రాలకు అమ్ముకునేందుకు రైతులు తీసుకువచ్చిన వరి ధాన్యం తడిసి పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొత్తపల్లి మండలంలో 2500 ఎకరాల్లో వరి, 1200 ఎకరాల పత్తి పంటకు నష్టం వాటిల్లింది. చొప్పదండి మండలంలో 458 ఎకరాల వరి, 35 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతిన్నది. తిమ్మాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో సాగు చేసిన 338 ఎకరాల వరి, ఐదు ఎకరాల టమాట పంట పూర్తిగా నీట మునిగింది. జూగుండ్లలోని ఐకేపీ కేంద్రానికి తీసుకవచ్చిన 200 క్వింటాళ్ళ వరి ధాన్యం వర్షానికి తడిసి పోయింది. చిగురుమామిడి మండలంలోని 17 గ్రామాల్లో కురిసిన భారీ వర్షానికి 3,300 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నది. కొనుగోలు కేంద్రాల్లోని 1,572 క్వింటాళ్ల ధాన్యం తడిసి పోయింది.
ఫ పలు చోట్ల రాకపోకలకు అంతరాయం
మానకొండూర్ మండలంలోని ఈదులగట్టపల్లి-మానకొండూర్ గ్రామాల మధ్యగల లోలెవల్ బ్రిడ్జి నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వెళ్లడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. సైదాపూర్ మండలంలో వెంకపల్లి.. తుమ్మలచెరువు కట్ట కాలువ తెగడంతో వరద ఉధృతంగా ప్రవహించడంతో కల్లాలు, రోడ్లపై ఆరబోసిన వరి ధాన్యం ముద్దయింది. కొన్ని చోట్ల ఆ ప్రవాహానికి ధాన్యం కొట్టుకుపోయింది. హుస్నాబాద్-హుజురాబాద్ ప్రధాన రహదారిలోని సైదాపూర్ సమీపంలోగల లోలెవల్ వంతెన రోడ్డుపై నుంచి, సోమారపు చౌరస్తా వద్ద రోడ్డుపై నుంచి భారీగా వరద నీరు ప్రవహించడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులకు గురయ్యారు. ఎక్లాస్‌పూర్- సోమారం మధ్య వాగు లోలెవల్ వంతెనపై నుంచి నీరు ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు అక్కడి చేరుకొని వంతెనపై నుంచి వాహనాలను అనుమతించకుండా దారి మళ్లించారు. హుజురాబాద్ మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామంలో మూడు ఇళ్లు, ధర్మరాజు పల్లి గ్రామంలో ఒక ఇళ్లు భారీ వర్షాలకు కూలిపోయాయి. చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి, సుందరగిరి, ఉల్లంపల్లి గ్రామాల్లో మూడు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లక పోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. రేకొండ గ్రామంలో ఇనుగొండ రమేశ్‌కు చెందిన రెండు పాడి ఆవులు, దూడ పశువుల పాక కూలి మృతిచెందాయి. గన్నేరువరం మండలం చెరువు వద్ద కల్వర్టుపై ప్రవహిస్తున్న వరద ప్రవాహంలో బీహార్‌కు చెందిన యువకుడు వెళ్తుండగా నీటిలో కొట్టుకుపోయాడు. స్థానిక మత్స్యకారులు ఆయనను రక్షించారు.
ఫ నష్టాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్
సైదాపూర్: మండలంలో వర్షానికి దెబ్బతిన్న ప్రాంతాలను రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గరువారం పరివవలించారు. మండలంలో వరద వస్తున్న ప్రాంతాల్లో హైలెవల్ వంతెనలు మంజూరు చేస్తామని తెలిపారు. దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు వెంటనే నిధులు మంజూరు చేస్తామన్నారు. వరదలకు కొట్టుక పోయిన రోడ్లు, నష్టపోయిన పంటలను మొత్తం రికార్డ్ చేయాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్‌ఆలం, అడిషనల్ కలెక్టర్ల అశ్విని తానాజీ వాకడే, లక్ష్మికిరణ్, ఆర్డీవోలు మహేశ్వర్, రమేష్, సైదాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్, సింగిల్ విండో చైర్మన్ కొత్త తిరుపతిరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
ఫ ఇందుర్తి- కోహెడ హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి కృషి
చిగురుమామిడి: వర్షాలతో దెబ్బతిన్న పంటలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హుస్నాబాద్‌కు వస్తున్నారని, ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడి ఇందుర్తి-కోహెడ హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తాని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ ఆన్నారు. గురువారం మండలంలోని సీతారాంపూర్ గ్రామంలో తెగిన రోడ్డును, ఇందుర్తి ఎల్లమ్మ వాగును, కూలిన విద్యుత్ స్తంభాను, పొలాలను, తడిసిన ధాన్యాన్ని అయన పరిశీలించారు. ఇసందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. కార్యక్రమంలో హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, రూరల్ ఏసీపీ విజయ్‌కుమార్, తిమ్మపూర్ సీఐ సదన్‌కుమార్ పాల్గొన్నారు.