Share News

వేడెక్కిన రాజకీయాలు

ABN , Publish Date - Aug 26 , 2025 | 12:17 AM

కరీంనగర్‌లో బీజేపీ, కాంగ్రెస్‌పార్టీ శ్రేణులు పోటాపోటీగా దిష్టిబొమ్మలు దహనం చేయడం రాజకీయ దుమారాన్ని రేపుతున్నది.

వేడెక్కిన రాజకీయాలు

కరీంనగర్‌ అర్బన్‌, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌లో బీజేపీ, కాంగ్రెస్‌పార్టీ శ్రేణులు పోటాపోటీగా దిష్టిబొమ్మలు దహనం చేయడం రాజకీయ దుమారాన్ని రేపుతున్నది. చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర మండలంలో ప్రజాహిత పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆదివారం సాయంత్రం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై ఘాటుగా విమర్శలు చేశారు. బండి సంజయ్‌ చోరీ ఓట్లతో, మతపరమైన రెచ్చగొట్టే వాఖ్యలు చేసి గెలిచారని వ్యాఖ్యలు చేశారు.

ఫ పరస్పర ఖండనలు

ఈ వాఖ్యలపై ఆగ్రహం చెందిన బీజేపీ, అనుబంధ సంఘాల కార్యకర్తలు, నాయకులు సోమవారం ప్రెస్‌మీట్‌లు పెట్టి ఖండించారు. అనంతరం సాయంత్రం ఇందిరాచౌక్‌లో ఉన్న టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్‌ఫొటోతో ఉన్న భారీ ఫ్లెక్సీపై పెట్రోల్‌పోసి నిప్పంటించారు. ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సమాచారం అందుకున్న కాంగ్రెస్‌పార్టీ నగరశాఖ అధ్యక్షుడు, సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి రాత్రి 7 గంటల సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు దిష్టిబొమ్మ, ఫ్లెక్సీ ఫొటోతోపాటు కేంద్రమంత్రి బండి సంజయ్‌ ఫోటోలను దహనం చేశారు. పోటాపోటీ దిష్టిబొమ్మలు, ఫోటో ఫ్లెక్సీలను దహనం చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇందిరాచౌక్‌లో పోలీసులను మోహరించారు.

Updated Date - Aug 26 , 2025 | 12:17 AM