వాడీవేడిగా చర్చ..
ABN , Publish Date - Apr 25 , 2025 | 02:52 AM
విద్యుత్ సమస్యలు, చేపట్టబోయే పనులు, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, లూజ్‌వైర్లు, ఇతర సమస్యలపై వాడివేడీగా చర్చ సాగింది.
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
విద్యుత్ సమస్యలు, చేపట్టబోయే పనులు, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, లూజ్‌వైర్లు, ఇతర సమస్యలపై వాడివేడీగా చర్చ సాగింది. సెస్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై బాధ్యులపై చర్యలు ఏవని ప్రశ్నించారు. సెస్ స్టోర్ స్థలంలో నిర్మించిన రైతు బజార్‌ను స్వాధీనం చేసుకోవాలని సెస్ గ్రామ ప్రతినిధులు డిమాండ్ చేశారు. సిరిసిల్ల పద్మనాయక కల్యాణ మండపంలో గురువారం చైర్మన్ చిక్కాల రామారావు అధ్యక్షతన సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం 51వ మహాజన సభ జరిగింది. 20 అంశాలతో ప్రవేశపెట్టిన ఎజెండాపై చర్చలు జరిపి ఆమోదం తెలిపారు. 2025-2026 అంచనా బడ్జెట్ రూ.678 కోట్ల 39లక్షల 95 వేలను ఆమోదించారు. ఈసందర్భంగా సభ్యులు ఎజెండా అంశాలపై మొదట చర్చ లేకుండానే చప్పట్లతో ఆమోదం తెలుపుతున్న క్రమంలో పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. చర్చ జరిగిన తర్వాత ఆమోదం ప్రకటించాలని సెస్ సిరిసిల్ల ప్రతినిఽధులు సత్యనారాయణ, సత్తార్, సంపత్‌రావు, నారాయణలు డిమాండ్ చేశారు. దీంతో సెస్ చైర్మన్ రామారావు ఎజెండాలోని అంశాల వారీగా చర్చలు జరుపుదామని అనుమతి ఇచ్చారు. ప్రతినిధి సత్యనారాయణ మాట్లాడుతూ సెస్ స్టోర్‌కు సంబంధించిన స్థలం మూడెకరాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకొని రైతుబజార్ నిర్మించిందని, దానికి బదులుగా స్థలం ఇవ్వలేదని, తిరిగి రైతు బజార్‌ను స్వాధీనం చేసుకోవాలన్నారు. దీంతో పాటు ఎల్లారెడ్డిపేటలో పోలీస్ ఆధీనంలో ఉన్న సేవాసదన్‌ను కూడా తీసుకోవాలని పలువురు ప్రతినిధులు డిమాండ్ చేశారు. రైతు బజార్‌ను స్థలంలోనే తిరిగి స్టోర్‌ను నిర్మించడానికి ఆందోళనకు సైతం సిద్ధమంటూ పలువురు ప్రతినిధులు తెలిపారు. సెస్ చైర్మన్ సోమవారం తరువాత కలెక్టర్, ఇతర ప్రతినిధులు దృష్టికి తీసుకవెళ్లి చర్యలు తీసుకుందామని తెలిపారు. ఎల్లారెడ్డిపేట సేవాసదన్ కోసం పోలీస్ డిపార్ట్‌మెంట్ ఎస్పీలను కలిశామని, ఈసారి గట్టిగా ప్రయత్నం చేద్దామన్నారు. సెస్‌లో అగ్నిప్రమాదం జరిగిన సంఘటనలో బాధ్యులను సస్పెండ్ చేయాలని పలువురు డిమాండ్ చేశారు. చైర్మన్ సమాధానం ఇస్తూ అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశామని, విచారణ రిపోర్ట్ ఇంతవరకు ఇవ్వలేదని, రాగానే చర్యలు తీసుకుంటామన్నారు. ముస్తాబాద్ గ్రామ ప్రతినిధి కల్వకుంట్ల గోపాల్‌రావు మాట్లాడుతూ మల్లన్నసాగర్ కాలువల్లోకి నీళ్లు వస్తున్నాయని, రైతులు మోటార్లు పెట్టుకోవడం ద్వారా ట్రాన్స్‌ఫార్మర్లపై లోడ్ పెరిగి వ్యవసాయ కనెక్షన్‌దారులకు ఇబ్బందులు కలుగుతున్నాయని, అదనంగా ట్రాన్స్‌ఫార్మర్‌లు ఏర్పాటుచేయాలన్నారు. చైర్మన్ మాట్లాడుతూ ట్రాన్స్‌ఫార్మర్‌లు ఏర్పాటు చేయాలంటే ఇరిగేషన్ నుంచి అనుమతి అవసరం అవుతుందన్నారు. ప్రస్తుతం వ్యవసాయానికి 7 హెచ్‌పీ వరకు రాయితీ వస్తుందని, 15 హెచ్‌పీల వరకు కూడా వాడుతున్నారన్నారు. అదనంగా బోర్‌లు వేస్తే వ్యవసాయ కనెక్షన్లు తీసుకోవాలని కోరారు. బకాయిల వసూళ్లకు సహకరించాలన్నారు. ప్రతినిధి సంపత్‌రావు మాట్లాడుతూ గ్రామ ప్రతినిధులకు సభకు హాజరుకావడానికి నోటీస్ ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. ఆహ్వానం పంపాలని గత మహాసభలోనే చెప్పామన్నారు. మహాసభ నివేదిక వారం రోజుల ముందే పంపించాలన్నారు. ప్రతినిధి లక్ష్మణ్, కాంతారెడ్డిలు మాట్లాడుతూ మిడిల్ పోల్స్ వేయాలని, ఐరన్ పోల్స్ తొలగించాలని కోరారు. అవసరమైన చోట ట్రాన్స్‌ఫార్మర్లు వేయాలన్నారు. ప్రతినిధి పద్మారెడ్డి మాట్లాడుతూ లూజ్‌వైర్లు సమస్యను పరిష్కరించడంతో పాటు పొలాల్లో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను రోడ్లవైపు మార్చాలని కోరారు. చైర్మన్ మాట్లాడుతూ 8వేల మిడిల్ పోల్స్‌లను దశల వారీగా కొనుగోలు చేసి ఏర్పాటు చేస్తామన్నారు. మొదటి విడతగా 500 కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోలుకు ప్రతిపాదించామన్నారు. వివిధ అంశాలపై సభ్యులు చర్చలు జరిపారు. మహాసభలో సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, డైరెక్టర్లు దిడ్డి రమాదేవి, దార్నం లక్ష్మీనారాయణ, మల్లుగారి రవీందర్‌రెడ్డి, గౌరీనేని నారాయణరావు, వరుస కృష్ణహరి, సందుపట్ల అంజిరెడ్డి, మాడుగుల మల్లేశం, పొన్నాల శ్రీనివాసరావు, ఆకుల గంగారాం, నామాల ఉమ, రేగులపాటి హరిచరణ్‌రావు, ఆకుల దేవరాజం, పొట్టెపల్లి సుధాకర్, ఏవో శ్రీనివాసరెడ్డి, డీఈ రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎన్‌పీడీసీఎల్ కంటే మెరుగైన సేవలు
- సెస్ చైర్మన్ చిక్కాల రామారావు
ఎన్‌పీడీసీఎఫ్, ఎస్పీడీసీఎల్ కంటే సెస్ పరిధిలో మెరుగైన సేవలు అందిస్తున్నామని, సెస్‌కు సంబంధం లేనివారు ఎన్‌పీడీసీఎల్‌లో విలీనం చేయాలంటూ వినియోగదారులను తప్పుదారి పట్టించే మాటలు మాట్లాడుతున్నారని చైర్మన్ చిక్కాల రామారావు అన్నారు. మహాసభను ప్రారంభిస్తూ ఎన్‌పీడీసీఎల్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ విలీనం కానివ్వమని అన్నారు. మరింత బలోపేతంగా పనిచేస్తామన్నారు. సెస్ పరిధిలో ఎలాంటి పైరవీలు, తప్పులు జరగకుండా ఎన్‌పీడీసీఎల్ ద్వారా భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం, నియామకాలు చేపడుతామన్నారు. బకాయిల వసూళ్లకు గ్రామ ప్రతినిధులు, వినియోగదారులు సహకరించాలన్నారు. వినియోగదారుల నుంచి రూ.162 కోట్లు బకాయిలు రావాల్సి ఉందని, ప్రభుత్వం నుంచి రూ.625 కోట్లు రావాల్సి ఉందని అన్నారు. విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు పోను సెస్‌కు రూ.250 కోట్ల వరకు మిగులు ఉంటుందన్నారు. సెస్ స్టోర్‌కు సంబంధించి మూడెకరాల స్థలాన్ని జిల్లాల పునర్విభజనలో స్వాధీనం చేసుకొని స్టోర్‌కు ఎలాంటి స్థలాన్ని కేటాయించలేదని, ఐదెకరాల స్థలంతో పాటు రూ.10 కోట్లు బడ్జెట్ కేటాయించే విధంగా తీర్మానం ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. ఎల్లారెడ్డిపేట సేవాసదన్ 1987 నుంచి పోలీస్ శాఖ ఆధీనంలో ఉందని, తిరిగి స్వాధీనం చేసుకోవడంతో పాటు ప్రతి మండల కేంద్రంలో 15 గుంటల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించే విధంగా నివేదించడం, కేటాయించని పక్షంలో సొంత నిధులతో కొనుగోలు చేసి సేవా సదన్‌లను నిర్మిస్తామన్నారు. సిరిసిల్లలో పవర్‌లూం పరిశ్రమకు విద్యుత్ సరఫరా అందిస్తూ చేయూతను ఇస్తున్నామని టెక్స్‌టైల్ పార్కు, అపెరల్ పార్కుకు ప్రత్యేక సబ్ స్టేషన్ ద్వారా నిరంతర విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు. సెస్ అభివృద్ధి వైపు వెళ్తుంటే విద్యుత్ చౌర్యం ఆర్థిక పరిపుష్టిని బలహీనపరుస్తుందన్నారు. గృహజ్యోతి పథకం ద్వారా 99,535 మంది వినియోగదారులకు లబ్ధి జరిగిందని రూ.4.08 కోట్లు సబ్సిడీ ఇచ్చామన్నారు. వ్యవసాయ బావులకు విద్యుద్దీకరణతో పాటు జిల్లాలో 76 విద్యుత్ ఉపకేంద్రాలు ఉండగా, మరో 12 అదనంగా ఏర్పాటు చేస్తామన్నారు. మరో 6 అదనంగా సబ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించామన్నారు. జిల్లాలో 132/33 కేవీ కేంద్రాలు 6 ఉండగా, నేరేళ్ల, బోయినపల్లిలో ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించామన్నారు.
అనధికారిక సర్వీస్‌లు క్రమబద్ధీకరించుకోవాలి..
- సెస్ ఎండీ విజయేందర్‌రెడ్డి
అనధికారిక విద్యుత్ సర్వీస్‌లను క్రమబద్ధీకరించుకోవాలని, సంస్థ ప్రగతికి సహాకరించాలని సెస్ ఎండీ విజయేందర్‌రెడ్డి కోరారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఉచిత విద్యుత్ సరఫరా అందిస్తోందని, కానీ సెస్ పరిధిలో అనధికారిక, అధికలోడ్ కలిగిన వ్యవసాయ సర్వీస్‌లు ఉండడం వల్ల విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు తరచుగా కాలిపోతున్నాయని అన్నారు. సంస్థకు, రైతాంగానికి నష్టం కలుగుతుందని, దీనిని నివారించడానికి ప్రతినిధులు వినియోగదారులను చైతన్యపరిచి సర్వీస్‌లను క్రమబద్ధీకరించుకునేలా చేయాలని కోరారు.
ఆమోదించిన ఎజెండా అంశాలు..
- 2023- 2024 సంవత్సరానికి జమ ఖర్చులు, ఆస్తి, అప్పులు, బడ్జెట్, సభ్యుల వాటాధనం
- 2025-2026 ఆర్థిక సంవత్సరం అంచనా బడ్జెట్ రూ.678 కోట్ల 39లక్షల 95వేల
- ఉద్యోగుల సర్వీస్ నియమావళి కోసం బైలాస్ సవరణ
- సిరిసిల్ల సెస్ ప్రధాన కార్యాలయం మరమ్మతులు, పెయింటింగ్ పనులు
- సెస్ స్టోర్ నిర్మాణానికి ఐదెకరాల స్థలం, రూ.10 కోట్ల బడ్జెట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి.
- ఎల్లారెడ్డిపేటలో పోలీస్ ఆధీనంలో ఉన్న సెస్ సేవాసదనాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం.
- సెస్ సంస్థలో బైలా, చట్ట విరుద్ధంగా చేపట్టిన నియామకాలు పదోన్నతులపై పునః సమీక్ష, విచారణకు కమిటీ.
- 8వేల మిడిల్ పోల్స్ దశల వారీగా కొనుగోలు.
- మొదటి విడతగా 500 కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోలు.
- సెస్ పరిధిలో పురాతనమైన వైరును తొలగించడం.
- ప్రొబేషన్ పూర్తి చేసుకున్న అసిస్టెంట్ హెల్పర్లను హెల్పర్‌లుగా పదోన్నతులు కల్పించడం.
- నూతన మండలాల్లో సేవాసదన్‌లు ఏర్పాటుకు స్థలం లేనిచోట 15 గుంటల స్థలాన్ని కేటాయించడానికి ప్రభుత్వాన్ని కోరడం, కేటాయించని పక్షంలో సెస్ నిధులతో కొనుగోలు
- పహల్గాం మృతులకు నివాళి, ఉగ్ర దాడిపై ఖండన.