హరహర మహాదేవా.. శంభో శంకరా..
ABN , Publish Date - Aug 12 , 2025 | 12:31 AM
హర హర మహాదేవా.. శంభో శంకరా.. అంటూ భక్తులు చేసిన నినాదాలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.
వేములవాడ కల్చరల్, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): హర హర మహాదేవా.. శంభో శంకరా.. అంటూ భక్తులు చేసిన నినాదాలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. శ్రావణ సోమవారం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి 50 వేలకు పైగా భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. సోమవారం తెల్లవారుజామునే భక్తులు రాజన్న ఆలయ ధర్మగుండంలో పవిత్రస్నానాలు ఆచరించారు. భక్తులు శివసత్తుల పూనకాలతో ఊగిపోయారు. కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు. రాజన్నకు ఎంతో ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకునేందుకు క్యూలైన్‌లో నాలుగు గంటలపాటు నిరీక్షించినట్లు భక్తులు తెలిపారు. ధర్మదర్శనం, శీఘ్రదర్శనం, బ్రేక్‌దర్శనం క్యూలైన్‌ల ద్వారా భక్తులు ఆలయంలోకి చేరుకున్నారు. ముందుగా లక్ష్మీగణపతిని, ఆలయంలోకి ప్రవేశించి రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. శ్రావణ మాసం మూడో సోమవారం సందర్భంగా భక్తులు రాజరాజేశ్వరీదేవి అమ్మవారికి నూతన వస్ర్తాలతో ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పరివారం దేవతాలయాలైన సీతరామచంద్ర స్వామి, అనంతపధ్మనాభ స్వామి, బాలత్రిపురసుందరీ దేవి, బాలరాజరాజేశ్వరస్వామి, శ్రీవల్లిసుబ్రహ్మణ్యస్వామి, దక్షణమూర్తిస్వామిని దర్శించుకున్న భక్తులు కుంకుమ పూజలో పాల్గొన్నారు. ఆలయం ముందు రావిచెట్టు కిందకు చేరుకుని దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో రాధాబాయి ఆధ్వర్యంలో ఏఈవోలు బ్రహ్మన్నగారి శ్రీనివాస్, శ్రావణ్‌కుమార్, అశోక్‌కుమార్‌తో పాటుగా ఉద్యోగులు నరేందర్, శ్రీనివాస్‌చారి, రాజేందర్‌లు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ క్యూలైన్‌లు త్వరగా కదిలేలా చర్యలు తీసుకున్నారు.