‘ఉపాధి’కి భరోసా.. వేతనం రాక నిరాశ
ABN , Publish Date - Apr 12 , 2025 | 12:04 AM
వేసవిలో గ్రామాలలోని ప్రజలకు స్థానికంగా ఉపాధి కల్పించాలని కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని 2005లో ప్రవేశపెట్టింది.

తిమ్మాపూర్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): వేసవిలో గ్రామాలలోని ప్రజలకు స్థానికంగా ఉపాధి కల్పించాలని కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని 2005లో ప్రవేశపెట్టింది. దీంతో గ్రామాల్లోని కూలీలందరికీ పనులు దొరకడంతో ఆర్థికంగా తోడ్పాటు అందుతోంది. తిమ్మాపూర్ మండలంలోని 23 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం జాబ్‌కార్డుల సంఖ్య 7,766 అందులో 13,677 కూలీలు నమోదయ్యారు. గత ఏడాది ఏప్రిల్‌లో ఉపాధి హామీ పనులకు 2,150 మంది వెళ్తే ఈ సంవత్సరం 1,150 మంది కూలీలు మాత్రమే పనులకు వెళ్తున్నారు. వ్యవసాయ పనులు ఇంకా పూర్తికాకపోవడంతో కూలీలు సంఖ్య పెరగడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. గ్రామాల్లో ప్రస్తుతం కమ్యూనిటీ వాటర్ హార్వెస్టింగ్ పాండు, వ్యవసాయ పొలాలకు రోడ్ల నిర్మాణం, కొత్త కుంటల నిర్మాణం, ఫీడరు కాలువలో పూడిక తీయడం పనులు చేపడుతున్నారు.
ఫ వేతనాలు అందక కూలీల ఇబ్బందులు
రెండు నెలలుగా వేతనాలు రాక కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ యేడు ఏప్రిల్ 1 నుంచి ఉపాధి హామీ కూలీలకు 300 నుంచి 307 రూపాయలకు వేతనం పెంచింది. అయితే 2005 ఉపాధి హామీ పథకం ప్రారంభించినప్పుడు రోజువారి కూలి 87.50 ఉండగా అప్పటి నుంచి ఏడాదికి 10 నుంచి 30 రూపాయల వరకు పెంచుతూ వచ్చారు. ఈ ఏడాది కేవలం 7 రూపాయలను మాత్రమే పెంచడంపై కూలీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఫ మూడేళ్లుగా నిలిచిన వేసవి భత్యం
గతంలో వేసవి భత్యం 15-30 శాతం వరకు అదనంగా చెల్లించేవారు. 2022 ఏప్రిల్ నుంచి పూర్తిగా తొలగించారు. వీటితో పాటు పార, గడ్డపార, తాగునీరు, మజ్జిగకు సంబంధించి అదనపు భత్యం కూడా ఉండేది. వేసవి భత్యంతో పాటు క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాలని కూలీలు కోరుతున్నారు.