వరలక్ష్మీ వందనం
ABN , Publish Date - Aug 09 , 2025 | 12:14 AM
మహిళలు భక్తిశ్రద్ధలతో శుక్రవారం వరలక్ష్మీ వ్రతాలు, పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తుల దైవ సందర్శనతో ఆలయాలన్నీ కిటకిటలాడాయి.
కరీంనగర్ కల్చరల్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): మహిళలు భక్తిశ్రద్ధలతో శుక్రవారం వరలక్ష్మీ వ్రతాలు, పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తుల దైవ సందర్శనతో ఆలయాలన్నీ కిటకిటలాడాయి. వరలక్ష్మీ వ్రతాలు, కుంకుమార్చనలు, అమ్మవారి నామస్మరణలు, దీపకాంతులతో ప్రతీ గృహం కళకళలాడింది. మహిళలు, యువతులను ఇంటికి ఆహ్వానించి మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తూ పరసర్పం పసుపు కుంకుమలు, పప్పు బెల్లాలు, ఫలతాంబూలాలు, వాయినాలుగా ఇచ్చుకుని ఆశీస్సులు పొందారు. ఆలయాల్లో అర్చనలు జరిపి ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
చైతన్యపురి మహాశక్తి ఆలయం మహిళలతో పోటెత్తింది. ఉదయం మహాహారతి, సాయంత్రం వరలక్ష్మీ వ్రతం, సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. వరలక్ష్మీ వ్రతంలో కేంద్ర హోంశాఖా సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ పాల్గొని అమ్మవార్లను దర్శించుకొని పూజలు చేశారు. యజ్ఞవరాహక్షేత్రంలో మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకం, పూలంగిసేవ, వరాహస్వామి మూలమంత్ర హవనం, మహాభిషేకం, వరలక్ష్మి వ్రతం జరిగింది. సాయంత్రం సహస్రనామార్చన, ఊంజల్‌సేవ, కుంకుమార్చనలు జరిగాయి. జ్యోతినగర్ హనుమాన్ సంతోషిమాత ఆలయంలో ఒడిబియ్యం, గాజులు, పసుపుకుంకుమలు, చీరలు సమర్పించారు. వావిలాలపల్లి శ్రీహనుమత్ సహిత కనక దుర్గ ఆలయంలో శ్రీచక్రార్చన, కుంకుమార్చన జరిగింది. భగత్‌నగర్ అయ్యప్ప ఆలయంలో కుంకుమార్చనలు జరిగాయి. అశోక్‌నగర్ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో కుంకుమ పూజలు నిర్వహించారు. కమాన్ రోడ్ రామేశ్వరాలయంలో కుంకుమార్చనలు, పర్వతవర్ధినీ అమ్మవారికి విశేషాలంకారం చేశారు.