Share News

ఈఎస్‌ఐ ఆసుపత్రికి గ్రీన్‌ సిగ్నల్‌

ABN , Publish Date - Sep 04 , 2025 | 01:38 AM

కోల్‌సిటీ, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): రామగుండం ప్రాంతంలో దశాబ్దాలుగా కార్మికులు ఎదురుచూస్తున్న ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. నాలుగేళ్ల క్రితమే ఆసుపత్రి మంజూరైనా స్థలం లేదంటూ గతంలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాల మధ్య వివాదాలు సాగాయి. దీంతో ఆసుపత్రి నిర్మాణం పెండింగ్‌ పడింది.

ఈఎస్‌ఐ ఆసుపత్రికి గ్రీన్‌ సిగ్నల్‌

రామగుండంలో 100పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రి

రూ.150కోట్లతో నిర్మాణానికి టెండర్లు

పాత డిస్పెన్సరీ ప్రాంగణంలో నిర్మాణం

ఐదు అంతస్థుల్లో ఆసుపత్రి

అత్యాధునిక వసతులతో నిర్మాణానికి ప్రణాళికలు

40వేల మంది కాంట్రాక్టు కార్మిక కుటుంబాలకు ప్రయోజనం

కోల్‌సిటీ, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): రామగుండం ప్రాంతంలో దశాబ్దాలుగా కార్మికులు ఎదురుచూస్తున్న ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. నాలుగేళ్ల క్రితమే ఆసుపత్రి మంజూరైనా స్థలం లేదంటూ గతంలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాల మధ్య వివాదాలు సాగాయి. దీంతో ఆసుపత్రి నిర్మాణం పెండింగ్‌ పడింది. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి ఈఎస్‌ఐసీ కేంద్ర కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న అంశంపై పలుమార్లు సంప్రదింపులు జరిపారు. ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ స్వయంగా ఢిల్లీకి వెళ్లి ఈఎస్‌ఐసీ అధికారులకు వినతిపత్రాలు ఇచ్చారు. ఎంపీ వంశీకృష్ణ పార్లమెంట్‌లోనూ ఈ అంశాన్ని లేవనెత్తారు. దీంతో మూలకు పడుతుందనుకున్న ఆసుపత్రి నిర్మాణం ప్రతిపాదనలు బడ్జెట్‌ కేటాయింపులతో మళ్లీ ముందుకు సాగాయి. ఎట్టకేలకు ఈఎస్‌ఐ బోర్డు రామగుండం పట్టణంలో రూ.150.08కోట్ల వ్యయంతో ఆసుపత్రి నిర్మాణానికి ఆగస్టు 27న టెండర్లు పిలిచింది. 30నెలల్లో ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసేందుకు టెండర్లను ఆహ్వానించారు. సెప్టెంబర్‌ 25వ తేది టెండర్‌ దాఖలు చేసేందుకు గడువు కాగా సెప్టెంబర్‌ 26న టెండర్లను ఖరారు చేయనున్నారు.

రామగుండం పట్టణంలోనే నిర్మాణం..

ఈఎస్‌ఐ 100పడకల ఆసుపత్రిని రామగుండం పట్టణంలోని పాత ఈఎస్‌ఐ ఆసుపత్రి డిస్పెన్సరీ ప్రాంగణంలోనే నిర్మించనున్నారు. ఇక్కడ ఈఎస్‌ఐ ఆసుపత్రికి 3.75ఎకరాల స్థలం ఉన్నది. 1968లో ఈ డెస్పెన్సరీ, స్టాఫ్‌ క్వార్టర్లను నిర్మించారు. మొదట ఈ ఆసుపత్రి ప్రాంగణంలోనే భవనాలను వినియోగించుకుంటూ ఆసుపత్రి నిర్వహించాలని ప్రతిపాదించారు. ఎన్‌ఐటీ, వరంగల్‌ సివిల్‌ విభాగం ఈ మేరకు తనిఖీలు జరిపి సర్టిఫికెట్‌ కూడా ఇచ్చింది. కానీ దేశవ్యాప్తంగా అత్యాధునిక వసతులతో మొదట ఈఎస్‌ఐ ఆసుపత్రులు, తరువాత ఆసుపత్రులకు అనుబంధంగా మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేయాలని కేంద్ర కార్మిక, ఉపాధిశాఖ ఆధ్వర్యంలోని ఈఎస్‌ఐసీ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు ఈ ప్రాంగణంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి జూలై 2022న ఈఎస్‌ఐసీ రీజనల్‌ డైరెక్టర్‌ రేణుక ప్రసాద్‌ ఆధ్వర్యంలో సైట్‌ సెలక్షన్‌ కమిటీ పరిశీలన జరిపి ఆమోదం తెలిపింది.

ఐదు అంతస్థుల్లో అత్యాధునిక ఆసుపత్రి..

8అంతస్థుల్లో స్టాఫ్‌ క్వార్టర్లు

రామగుండం పట్టణంలో ఐదు అంతస్థుల్లో మెడికల్‌ కౌన్సిల్‌ఆఫ్‌ఇండియా గైడ్‌లైన్స్‌ ప్రకారం ఆసుపత్రి నిర్మాణం జరుగనున్నది. జీప్లస్‌ 5ఫ్లోర్‌లో ఆసుపత్రి నిర్మించనున్నారు. అలాగే 8అంతస్థుల్లో 32స్టాఫ్‌ క్వార్టర్లను నిర్మిస్తారు. ఆసుపత్రిలో అత్యాధునిక వసతులు ఏర్పాటు చేయనున్నారు. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా గైడ్‌లైన్స్‌, నేషనల్‌ బిల్డింగ్‌ కోడ్స్‌(ఎన్‌బీసీ) నిబంధనల మేరకు ఈఎస్‌ఐసీ ఈ నిర్మాణం జరుపనున్నది. క్యాజువాలిటీ, ఎమర్జెన్సీ బ్లాక్‌, అవుట్‌ పేషెంట్‌, ఇన్‌పేషెంట్‌ వార్డులు, గైనిక్‌ వార్డులు, ఎంఆర్‌ఐతో కూడుకున్న రేడియాలజీ విభాగం, క్యాన్సర్‌ విభాగం, కీమో థెరపీ, డయాలసిస్‌, ఫార్మసీ, మెడికోల్‌ స్టోర్‌, బ్లడ్‌ స్టోరేజీ, ఫిజియో థెరపీ, యోగా సెంటర్లు, వేస్ట్‌మేనేజ్‌మెంట్‌ సిస్టం, సీవరేజ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం, ఆక్సిజన్‌ ప్లాంట్‌ తదితర నిర్మాణాలు జరుగనున్నాయి. సెంట్రల్‌ ఏసీతో నిర్మితమయ్యే ఈ ఆసుపత్రిలో ఆధునిక సౌకర్యాలు కల్పిం చేందుకు నిధులు కేటాయించారు.

బీ పవర్‌హౌస్‌ నుంచి నాలుగు లైన్ల రహదారి..

ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకుని బీ పవర్‌హౌస్‌ నుంచి మసీదు కార్నర్‌ వరకు 80అడుగుల్లో నాలుగు లైన్ల రహదారిని నిర్మిస్తున్నారు. ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఈ మేరకు టెండర్ల ప్రక్రియ పూర్తై ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో పనులు కూడా మొదలయ్యాయి. రహదారికి ఇరువైపులా అమృత్‌ పథకంలో డ్రైన్ల నిర్మాణం జరుగుతుంది. మసీదు కార్నర్‌ నుంచి ఆసుపత్రి వరకు రోడ్డును అభివృద్ధి చేసేందుకు సైతం రామగుండం నగరపాలక సంస్థ నిధులు కేటాయించింది.

25వేల మంది కాంట్రాక్టు కార్మికులకు ప్రయోజనం...

రామగుండంలో 100పడకల ఆసుపత్రి వినియోగంలోకి వస్తే పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలోని సుమారు 40వేల మంది కాంట్రాక్టు కార్మికులకు, కుటుంబాలకు ప్రయోజనం చేకూరనున్నది. ఎన్‌టీపీసీ, సింగరేణి, ఆర్‌ఎఫ్‌సీఎల్‌, కేశోరాం సిమెంట్స్‌, జెన్‌కో, రైల్వే, రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌, మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్‌ మున్సిపాలిటీలు, రైస్‌మిల్లులు, కాటన్‌, జిన్నింగ్‌ మిల్లులు, ఎక్స్‌ప్లోజివ్‌ కంపెనీలు, ట్రాన్స్‌పోర్ట్‌లు, మెడికల్‌ కళాశాలలు, ఇరిగేషన్‌ ప్రాజెక్టులు, మిషన్‌ భగీరథ, సింగరేణి జైపూర్‌ పవర్‌ప్లాంట్‌, సిరామిక్స్‌ కంపెనీలు, తదితర సంస్థల్లో కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నారు. వీరిని ఇప్పటి వరకు వరంగల్‌లోని ఆసుపత్రికి రెఫర్‌ చేసేవారు. రామగుండం ఆసుపత్రి నిర్మాణం పూర్తయి వినియోగంలోకి వస్తే రామగుండంలోనే అన్నిరకాల వైద్య సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. కాంట్రాక్టు కార్మికులకు చికిత్సకు ప్రైవేట్‌ ఆసుపత్రుల చుట్టూ తిరిగే భారం తగ్గనున్నది.

రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితోనే నిర్మాణానికి టెండర్లు..

ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌

రామగుండంలో ఈఎస్‌ఐ ఆసుపత్రి, మెడికల్‌ కళాశాల నిర్మించాల్సి ఉంది. గతంలో బీఆర్‌ఎస్‌, బీజేపీ వివాదంలో పెడింగ్‌లో పెట్టారు. నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ వంశీకృష్ణ సహకారంతో ఒత్తిడి పెంచాం. ముఖ్యమంత్రి ఢిల్లీలో కేంద్ర కార్మికశాఖ మంత్రిని కూడా ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ప్రిన్సిపాల్‌ సెక్రెటరీగా ఉన్న దాన కిశోర్‌ ఎప్పకటిప్పుడు పర్యవేక్షించారు. ఈ ఆసుపత్రి నిర్మాణంతో ఈ ప్రాంతంలోని కాంట్రాక్టు కార్మికులకు కార్పొరేట్‌ వైద్యం అందనున్నది.

Updated Date - Sep 04 , 2025 | 01:38 AM