సంక్షోభంలో గ్రానైట్ పరిశ్రమ
ABN , Publish Date - Jul 16 , 2025 | 02:06 AM
ప్రత్యక్షంగా, పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి కల్పిస్తున్న గ్రానైట్ పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోతున్నది.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
ప్రత్యక్షంగా, పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి కల్పిస్తున్న గ్రానైట్ పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోతున్నది. కరోనా కాలం నుంచి చైనా, ఇతర దేశాలకు తగ్గిన ఎగుమతులతోపాటు రాయల్టీ, మినరల్ ఫండ్, సి పర్మిట్ పేరిట 85 శాతం పన్నులు పెరగడంతో పరిశ్రమ కుదేలవుతున్నది. పెరిగిన పన్నులతో నష్టాల్లో కూరుకుపోయే పరిస్థితి ఉత్పన్నం కావడంతో మూడు రోజులపాటు పరిశ్రమ బంద్ నిర్వహించారు. యజమానులు, కార్మికులు రోడ్లపైకి వచ్చి ప్రదర్శన నిర్వహించాల్సి వచ్చింది.
ఫ 30 వేల మందికి ఉపాధి
గతంలో గ్రానైట్ పరిశ్రమ బాగా నడవడంతో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు జిల్లాలో 300 క్వారీలు లీజులు తీసుకున్నారు. వీటిలో రాయిని వెలికితీసి చైనా, తదితర దేశాలకు గ్రానైట్‌ను ఎగుమతి చేశారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 30 వేల మందికి ఈ పరిశ్రమ ఉపాధి కల్పిస్తున్నది. దేశంలోని సుమారు 8 రాష్ర్టాలకు చెందిన ప్రజలు వివిధ విభాగాల్లో కార్మికులుగా పనిచేసేందుకు వచ్చి ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. 2014లో 300 మేరకు క్వారీలు నడవగా ప్రస్తుతం 60 క్వారీలు మాత్రమే పని చేస్తున్నాయి. క్వారీలు అన్ని ఉత్పత్తి చేసినప్పుడు 24 లక్షల టన్నుల గ్రానైట్ ఎగుమతి కాగా, ఇప్పుడు ఈ క్వారీల నుంచి 10 లక్షల టన్నుల గ్రానైట్ మాత్రమే ఎగుమతి అవుతున్నది.
ఫ మూడు సంవత్సరాల్లో 115 శాతం పెరిగిన పన్నులు
రివిజన్ పేరిట 2022లో 30 శాతం రాయల్టీని పెంచారు. ఒక క్యూబిక్ మీటర్ గ్రానైట్ రాయిపై 2,300 నుంచి 2,990 రూపాయలకు రాయల్టీ పెరిగింది. ఇదే సమయంలో పర్మిట్ సి పేరిట 40 శాతం పన్ను పెంచారు. దీంతో ఒక్కో క్యూబిక్ మీటర్‌పై 1,200 రూపాయల మేరకు భారాన్ని భరించాల్సి వస్తున్నదని క్వారీ యజమానులు వాపోతున్నారు. 10 శాతంగా ఉన్న డిస్ర్టిక్ట్ మినరల్ ఫండ్‌ను ఒకేసారి 20 శాతానికి పెంచడంతో క్యూబిక్ మీటర్ 300 రూపాయల నుంచి 600 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో మినరల్ ఫండ్ 10 శాతం మాత్రమే ఉంది. రాయల్టీ, రివిజన్, పర్మిట్ సీ, డీఎంఎఫ్ పేరిట ఒకేసారి 85 శాతం పన్నులు పెరగడంతో ఆర్థిక భారాన్ని భరించలేని యజమానులు 2022లోనే ఆనాటి ప్రభుత్వాన్ని పన్నులు తగ్గించాలని కోరారు. రెండు సంవత్సరాలపాటు పర్మిట్ సి పన్నును 40 శాతం నుంచి 20 శాతానికి తగ్గించింది. ఆ పరిమితి గడువు ముగియడంతో ఇప్పుడు మళ్లీ 40 శాతం పన్నును చెల్లించాల్సి వస్తున్నదని పరిశ్రమవర్గాలు వాపోతున్నాయి. మూడు సంవత్సరాల వ్యవధిలో పరిశ్రమపై 115 శాతం పన్ను భారం పెరిగి దానిని తట్టుకోలేక క్వారీలు మూసేయాల్సిన పరిస్థితి వస్తున్నదని పరిశ్రమ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
ఫ భారంగా నిర్వహణ ఖర్చులు
ఒకవైపు ఎగుమతులు తగ్గిపోవడంతో లాభాల మాట అటుంచి యంత్రాలు చెడిపోకుండా చూసుకోవాల్సి వస్తోంది. ఉన్న కార్మికులకు ఉపాధి కల్పించడానికి క్వారీల నిర్వహణ పనులు చేయాల్సి వస్తోంది. ఈ ఖర్చు భారంగా మారింది. ఎగుమతులు తగ్గడంతో స్థానిక మార్కెట్‌పైనే ఆధారపడాల్సి వస్తున్నది. ఈ పరస్థితుల్లో పన్నులు మినహాయించి పరిశ్రమను కాపాడాల్సిన ప్రభుత్వం అదనపు భారాన్ని మోపుతోంది గ్రానైట్ వ్యాపారులు అంటున్నారు. వేలాదిమందికి ఉపాధి కల్పిస్తున్న గ్రానైట్ పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి నెలకొన్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రానైట్ పరిశ్రమపై పన్నుల భారం తగ్గించాలని కోరుతున్నారు.