ముగింపు దశలో ధాన్యం కొనుగోళ్లు
ABN , Publish Date - May 30 , 2025 | 01:03 AM
జిల్లాలో యాసంగి సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లు ముగింపు దశకు చేరుకున్నాయి.
జగిత్యాల, మే 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో యాసంగి సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లు ముగింపు దశకు చేరుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ధాన్యం కొనుగోళ్లలో జగిత్యాల జిల్లా మూడో స్థానంలో నిలిచింది. ఇప్పటికే జిల్లాలో 284 కేంద్రాలు వంద శాతం కొనుగోళ్లు పూర్తి చేసి మూతపడ్డాయి. వారం రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తి చేయడానికి అధికారులు సన్నద్ధం అవుతున్నారు. జిల్లాలో 4.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని అధికారులు అంచనా వేయగా జిల్లాలో ఇప్పటి వరకు 4.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. వాతావరణ పరిస్థితులతో దిగుబడులు తగ్గడంతో ధాన్యం అంచనా మేరకు కొనుగోలు కేంద్రాలకు రాలేదు.
జిల్లాలో 3.10 లక్షల ఎకరాల్లో వరి సాగు
2024 యాసంగిలో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 3.10 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఇందుకు గాను జిల్లాలో 4.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందన్న తొలుత అంచనా వేశారు. ఈ మేరకు జిల్లా ఇందిరాకాంతి పథం, సహకార, మార్కెటింగ్, మెప్మా తదితర శాఖల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏప్రిల్ నుంచి కేంద్రాలను ప్రారంభించి కొనుగోలు జరుపుతున్నారు. దిగుబడులు తగ్గడం వల్ల కేవలం 4.50 లక్షల మెట్రిక్ టన్నుల వరకే ధాన్యం కేంద్రాలకు రానున్నట్లు ప్రస్తుతం గుర్తించారు.
జిల్లాలో కొనుగోళ్లు ఇలా...
జిల్లా వ్యాప్తంగా 428 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు జరుపుతున్నారు. ఇందులో ఐకేపీ ఆధ్వర్యంలో 137 కేంద్రాలు, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 120 కేంద్రాలను, మెప్మా ఆధ్వర్యంలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 72,193 మంది రైతుల వద్ద నుంచి రూ.1,010.43 కోట్ల విలువ గల 4,35,531 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో రూ.950.69 కోట్ల విలువ గల 4,09,781.440 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లను ట్యాబ్‌ల్లో అప్‌లోడ్ చేశారు. రూ.893.71 కోట్ల విలువ గల 3,85,220 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని లారీల్లో లోడ్ చేసి గానుగాడించడం కోసం మిల్లర్లకు పంపగా ట్రక్‌షీట్ జనరేట్ అయింది. ఇందుకు గాను 69,190 మంది రైతులకు చెందిన 3,85,220 మెట్రిక్ టన్నులకు సంబంధించిన రూ.893.71 కోట్ల డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేశారు. మిగిలిన డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికే 284 కేంద్రాల మూత
జిల్లాలోని పలు మండలాల్లో వంద శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేసిన 284 కేంద్రాలను అధికారులు మూసివేశారు. ఇందులో 173 ఇందిరాక్రాంతి పథం కేంద్రాలు, 110 సహకార సంఘాల కేంద్రాలు, ఒకటి మెప్మా కేంద్రం మూతపడ్డాయి. ఈ కేంద్రాల్లో వంద శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయి. జిల్లాలో రానున్న వారం రోజుల్లో అన్ని కేంద్రాల్లో వంద శాతం కొనుగోళ్లు పూర్తవుతాయన్న అంచనాల్లో అధికారులున్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన కేంద్రాలకు మరో 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అభిప్రాయ పడుతున్నారు.
ధాన్యం కొనుగోళ్లు వంద శాతం పూర్తి చేస్తాం
-బీఎస్ లత, అదనపు కలెక్టర్
జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లను వంద శాతం పూర్తి చేస్తాం. చివరి గింజ వరకు కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. వచ్చే వారం, పది రోజుల్లో పూర్తి స్థాయిలో కొనుగోళ్లు పూర్తి చేసే దిశగా పనిచేస్తున్నాం. సకాలంలో ధాన్యం కొనుగోళ్లు చేయడం, ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయడం, లారీల్లో లోడింగ్ చేయడం, మిల్లర్లకు రవాణా చేయడం, మిల్లుల్లో అన్‌లోడింగ్, రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయడం వంటి పనులకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం.