జిల్లాలో ఊపందుకున్న ధాన్యం కొనుగోళ్లు
ABN , Publish Date - May 03 , 2025 | 12:32 AM
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఇప్పటి వరకు 82,136.74 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా శుక్రవారం ఒక్క రోజే 15,199 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. గడిచిన యాసంగి సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 2 లక్షల 2 వేల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు.
- ఇప్పటి వరకు 82,136.74 టన్నుల కొనుగోలు
- రైతుల ఖాతాల్లో రూ.130. 94 జమ
- సన్న ధాన్యం కొనుగోళ్లలో జాప్యం
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఇప్పటి వరకు 82,136.74 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా శుక్రవారం ఒక్క రోజే 15,199 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. గడిచిన యాసంగి సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 2 లక్షల 2 వేల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఇందులో 30 శాతం సన్నరకం వరి సాగు చేశారు. మొత్తం 4 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తా యని అధికారులు అంచనా వేశారు. ఇందులో 50 వేల టన్నుల ధాన్యం విత్తన కంపెనీలకు పోతుంది. 4 లక్షల టన్నుల వరకు కేంద్రాలకు వస్తుందని అధికారులు భావించారు. కొందరు రైతులు ధాన్యాన్ని ముందుగానే రైస్‌మిల్లర్లకు విక్రయించారు. 2.75 లక్షల టన్నుల వరకు కేంద్రాలకు వచ్చే అవకాశాలున్నాయి.
జిల్లాలో వరి కోతలు ఇరవై రోజుల నుంచి నడుస్తున్నాయి. ఎనభై శాతానికి పైగా కోతలు పూర్తి కాగా, రైతులు ధాన్యాన్ని ఆరబోసి కొనుగోలు కేంద్రా లకు తీసుక వస్తున్నారు. జిల్లాలోని ప్రతీ గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 333 కేంద్రాలకుగాను 315 ప్రారంభించారు. ఐకేపీ ద్వారా 67 కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల ద్వారా 266 కేంద్రాలు, హాకా ద్వారా 4 కేంద్రాలను ఆరంభించారు. ఇప్పటి వరకు 189 కోట్ల 71 వేల రూపాయల విలువైన 82,136.74 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 10,152 మంది రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఇందులో దొడ్డు రకం 81,308.30 టన్నుల ధాన్యాన్ని, సన్నరకం 828.44 టన్నుల ధాన్యాన్ని కొను గోలు చేశారు. ఆన్‌లైన్‌లో 96 శాతం ధాన్యం కొనుగోళ్ల వివరాలను నమోదు చేయగా, 56,700.76 టన్నుల ధాన్యానికి సంబంధించి 7,016 మంది (69 శాతం) రైతుల ఖాతాల్లో 130 కోట్ల 94 రూపాయలును జమ చేశారు.
పది రోజుల క్రితం వరకు ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరిగింది. కేంద్రాలను ఆరంభించారు గానీ, రైస్‌మిల్లుల అలాట్‌మెంట్‌లో జాప్యం జరిగింది. 25 శాతం బ్యాంకు గ్యారంటీలు ఇవ్వనిదే ధాన్యం కేటా యింపులు చేయరాదనే నిబంధన ప్రభుత్వం విధిం చింది. బ్యాంకు గ్యారంటీలు సమర్పించడంలో రైస్ మిల్లర్లు కావాలనే జాప్యం చేశారని తెలుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం విధించిన మద్దతు ధర చెల్లించేం దుకు ధాన్యంలో తేమ 17 శాతానికి మించి ఉండకూ డదు. ఇది యాసంగి సీజన్ కావడం తో వరి కోసిన తర్వాత నాలుగైదు రోజులకే నిర్ణీత తేమ శాతం వచ్చిం ది. కానీ కొనుగోళ్లలో జాప్యం జరగడం వల్ల ధాన్యం బాగా ఎండిందని రైతులు తెలిపారు. 26వ తేదీ నాటికి కేవలం 28,404 టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొను గోలు చేశారు. ఆ తర్వాత నుంచి ధాన్యం కొనుగోళ్లు ఊపందుకుంటున్నాయి. కలెక్టర్ కోయ శ్రీహర్ష, జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి, పౌరసరఫరాల సంస్థ మేనేజర్ కేంద్రాల్లో వేగంగా తూకం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఫ సన్న రకం ధాన్యం కొనుగోళ్లలో జాప్యం..
ఈ సీజన్‌లో రైతులు 30 శాతం వరకు సన్న రకం ధాన్యాన్ని సాగు చేశారు. ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో జాప్యం చేస్తున్నారని రైతులు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 828.44 టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. గురువారం నాటికి 415.88 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, శుక్రవారం 422.64 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. సన్న రకం ధాన్యాన్ని పండించే రైతులకు క్వింటాలు ధాన్యానికి 500 రూపాయల బోనస్ అంద జేస్తున్నది. గడిచిన వానాకాలం నుంచి ఈ బోనస్ ఇవ్వడం ఆరంభించింది. గత నెల నుంచి రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తున్న దృష్ట్యా ప్రభుత్వం సన్న రకం ధాన్యం సాగును ప్రోత్స హించేందుకు క్వింటాలు ధాన్యానికి 500 బోనస్ ప్రకటించింది. ఈ సీజన్‌లో చాలా మంది రైతులు కేంద్రాల్లో సన్నరకం ధాన్యాన్ని 15 రోజుల నుంచి కుప్పలు పోశారు. రైస్‌మిల్లులు కేటాయించలేదనే కారణంగా సన్న రకం ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేయడం లేదని నిర్వాహకులు చెబుతున్నట్లు రైతులు తెలిపారు. ఎక్కువ రోజులు కేంద్రాల్లోనే ధాన్యాన్ని ఉండడంతో దూకం తగ్గి నష్టపోవాల్సి వస్తుందని రైతులు తెలిపారు. సన్నరకం ధాన్యాన్ని కూడా వేగంగా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
ఈ విషయమై జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ ముప్పిడి శ్రీకాంత్ రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ బ్యాంకు గ్యారంటీలు సమర్పించిన 118 రైసు మిల్లు లకు ధాన్యం కేంద్రాలను కేటాయించాం. సన్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని, ప్రతి గింజ కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని, దళారులకు కాకుండా కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు.