Share News

చివరి దశకు ధాన్యం కొనుగోళ్లు

ABN , Publish Date - May 12 , 2025 | 12:21 AM

మండలంలో ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరాయి. ఇప్పటికే రెండు, మూడు కేంద్రాల్లో పూర్తిగా కొనుగోళ్లు పూర్తి కాగా మూసివేసేందుకు సిద్ధమయ్యారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో చివరి దశకు చేరగా నగునూర్‌ కొనుగోలు కేంద్రంలో ధాన్యం పేరుకుపోయింది. దీంతో కాంటాలు కాని రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

చివరి దశకు ధాన్యం కొనుగోళ్లు

కరీంనగర్‌ రూరల్‌, మే 11 (ఆంధ్రజ్యోతి): మండలంలో ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరాయి. ఇప్పటికే రెండు, మూడు కేంద్రాల్లో పూర్తిగా కొనుగోళ్లు పూర్తి కాగా మూసివేసేందుకు సిద్ధమయ్యారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో చివరి దశకు చేరగా నగునూర్‌ కొనుగోలు కేంద్రంలో ధాన్యం పేరుకుపోయింది. దీంతో కాంటాలు కాని రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ యాసంగిలో మండలంలో 13,210 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందులో 2,100 ఎకరాల్లో సన్నాలు, 11,110 ఎకరాల్లో దొడ్డురకం వరి పంటను సాగు చేశారు. మొత్తం 20 వేల మెట్రిక్‌ టన్నుల దాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ అంచనా వేశారు. మండలంలో 20 కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోళ్లను గత నెల 18న ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ప్రారంభించారు. గత సీజన్‌లో 1.49 లక్షల క్వింటాళ్ల ధాన్యం సేకరించగా ప్రస్తుతం ఇప్పటి వరకు 1,45,534 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించారు. ఇందులో కరీంనగర్‌ వ్యవసాయ సహకారం సంఘం ఆధ్వర్యంలో ఎనిమిది గ్రామాల్లో 1,605 మంది రైతుల నుంచి 81,362 క్వింటాళ్లు కొన్నారు. దుర్శేడ్‌ వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఐదు కొనుగోలు కేంద్రాల్లో 40,710 క్వింటాళ్లు, ఐకేపి ఆధ్వర్యంలో ఆరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో 23,462 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించారు. నగునూర్‌ కొనుగోలు కేంద్రంలో ధాన్యం పేరుకుపోయింది. ఇప్పటికే మొగ్దుంపూర్‌లో కొనుగోలు కేంద్రం మూసి వేశారు.

Updated Date - May 12 , 2025 | 12:21 AM