జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Oct 13 , 2025 | 12:12 AM
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు గిట్ల ముకుందరెడ్డి డిమాండ్ చేశారు.
హుజూరాబాద్, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు గిట్ల ముకుందరెడ్డి డిమాండ్ చేశారు. హుజూరాబాద్‌లో తెలంగాణ గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా ఐదో మహాసభలు ఆదివారం జరిగాయి. మొదట పట్టణంలోని డిపో క్రాస్ నుంచి కార్మికులు ర్యాలీగా బయలుదేరి వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రదర్శనగా వెళ్లారు. ఈ సందర్భంగా ముకుందరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నా గ్రామపంచాయితీ కార్మికుల జీవితాల్లో ఎలాంటి మార్పు లేదన్నారు. సీఐటీయూ 40ఏళ్లుగా కార్మికుల సమస్యల కోసం కొట్లాడిందన్నారు. పంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత, కనీస వేతనం అమలు చేయాలన్నారు. కార్మికులకు మల్టీ పర్సస్ విధానం రద్దు చేసి కేటగిరీల వారీగా పనులు చేపించాలన్నారు. కార్మికులకు ప్రమాద భీమా సౌకర్యం కల్పించడంతోపాటు కనీసం వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలన్నారు. సమావేశంలో రాచర్ల మల్లేశం, ఉప్పునూటి శ్రీనివాస్, కె శంకర్, అర్జున్, శ్రీనివాస్, చంద్రయ్య, రవీందర్‌రావు, సుధాకర్, కొంరయ్య పాల్గొన్నారు.