మహిళల ఆర్థిక స్థిరత్వమే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - May 02 , 2025 | 12:34 AM
రాష్ట్రంలోని మహిళలంతా ఆర్థిక స్థిరత్వం సాధించడమే లక్ష్యంగా తమ ప్రజాప్రభుత్వం సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.
- మంథనిలో 410 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు
- రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు
మంథని, మే 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మహిళలంతా ఆర్థిక స్థిరత్వం సాధించడమే లక్ష్యంగా తమ ప్రజాప్రభుత్వం సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శ్రీపాద కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం, ఇందిరా మహిళ శక్తి మొబైల్ క్యాంటీన్, మార్కెట్ ఏరియాలో ఏర్పాటు చేసిన ఫ్యాషన్ వేర్ మ్యాచింగ్ సెంటర్‌ను మంత్రి శ్రీధర్‌బాబు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలకు ఆదాయ మార్గాలు పెరగాలని, వారి కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలన్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఇందిరా మహిళాశక్తి కార్యక్రమాన్ని ప్రారంభించిం దన్నారు. ఈ పథకంలో భాగంగా మహిళలకు కుట్టు మిషన్ కేంద్రాలు, మొబైల్ క్యాంటీన్స్, పలు వ్యాపార యూనిట్ల స్థాపన కోసం కృషి చేస్తున్నామన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన శ్రీపాద మహిళ కుట్టు మిషన్ కేంద్రం ద్వారా మహిళలకు ఉపాధి లభిస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు యూనిఫాం తయారిని ప్రభుత్వం మహిళలకు అప్పగించిందన్నారు. మహిళలకు ఉపాధి కల్పించడం కోసం మంథనిలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాన్నారు. మహిళలు వ్యాపార విస్తరణలో ఎలాంటి కార్యాచరణ తీసుకున్నా ప్రభుత్వపరంగా పూర్తిసహకారం అందిస్తామని తెలిపారు. మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని, దీని ద్వారా అనేక మంది మహిళలు లబ్ధి పొందుతున్నారన్నారు. మంథని పట్టణంలో ఇళ్ల్లు లేని నిరుపేదలకు తొలి జాబితాలో 410 ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. ఇళ్ల స్థలం లేనివారికి కూడా ఇళ్లు పంపిణీ చేసేందుకు స్థలం గుర్తించే కార్యక్రమం కలెక్టర్, ఆర్డీవోల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోందని వివరించారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ.. మహిళలు అర్థికంగా ఎదిగేందుకు పక్కా ప్రణాళికలతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ మహిళా శక్తి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అరుణశ్రీ, ఆర్డీవో సురేష్, తహసీల్దార్ కుమారస్వామి, మున్సిపల్ కమిషనర్ మనోహర్ పాల్గొన్నారు.