దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
ABN , Publish Date - Mar 16 , 2025 | 12:40 AM
దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హైస్కూల్ ఆవరణలో గల భవిత సెంటర్‌లో అలింకో కార్పోరేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు పరికరాలను అందజేశారు.

- కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల అగ్రికల్చర్, మార్చి 15(ఆంధ్రజ్యోతి): దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హైస్కూల్ ఆవరణలో గల భవిత సెంటర్‌లో అలింకో కార్పోరేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. అందులో భాగంగానే శనివారం పరికరాలను అర్హులైన దివ్యాంగ విద్యార్థులకు అందజేస్తున్నామన్నారు. చిల్డ్రన్ స్పెషల్ నీడ్ స్కూళ్లలో చదువుతున్న అంగవైకల్యం ఉన్న విద్యార్థులకు అలింకో కార్పొరేషన్ ద్వారా సుమారు 10లక్షల విలువైన పరికరాలను 120మంది పిల్లలకు అందించామన్నారు. రానున్న రోజుల్లో దశల వారీగా మిగతా విద్యార్థులకు అందజేస్తామన్నారు. ఇలాంటి విద్యార్థులను తల్లిదండ్రులు, గురువులు ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రోత్సాహం అందించాలని కోరారు. అనంతరం జాబితాపూర్ గ్రామంలో జడ్పీహెచ్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఆన్‌లైన్ విద్యా బోధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆర్టిఫీషియల్ బోధన ద్వారా కంప్యూటర్ నైపుణ్యాలు నేర్చుకోవడం పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. జిల్లాలో 21 స్కూళ్లలో ఆన్‌లైన్ బోధన ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, ఎక్కడైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయో అలాంటి స్కూళ్లలో పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశామన్నారు. విద్యార్థులకు కంప్యూటర్ నైపుణ్యం పెరుగుతుందని, నైపుణ్యాలను పెంచుకునే అవకాశం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీఈవో రాము, ఆర్డీవో మధుసూదన్, డీడబ్ల్యూవో నరేష్, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.