రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం కృషి
ABN , Publish Date - Dec 21 , 2025 | 12:29 AM
రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు.
ఇల్లంతకుంట, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి) : రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. మండలంలోని అనంతగిరి గ్రామసమీపంలోని అన్నపూర్ణ రిజర్వాయర్ ప్రధాన కెనాల్, మధ్యమానేరు కుడి కాలువ ద్వారా శనివారం నీటిని విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు రైతులు నారుపోసుకునే సమయంలోనే నీటిని అందించాలని అన్నపూర్ణ, మద్యమానేరుల ద్వారా 100క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. మద్యమానేరు కుడి కాలువ ద్వారా విడుదల చేసిన నీటితో ఇల్లంతకుంట, గన్నేరువరం రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ప్రాజెక్టుల క్రింద ఉన్న ఆయకట్టు పెంచవలసిన అవసరం ఉందన్నారు. అందుకు అవసరమైన భూసేకరణ చేపట్టడానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సకాలంలో నీటిని అందించడం వల్లనే రైతులకు ప్రయోజనం ఉంటుందన్నారు. రాష్ట్రంలో రైతాంగ ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలుచేస్తు రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఈ సుధాకిరణ్, ఈఈ రమేష్, డీఈ ఉపేందర్‌రావు, ఏఈలు సమరసేన, నాగేందర్, వంశీ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు రమణారెడ్డి, అయిలయ్య, మాజీఫ్యాక్స్‌చైర్మన్ మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి పసుల వెంకటి, సర్పంచ్‌లు నవీన్‌రెడ్డి, మామిడి రాజు, వంచ చంద్రారెడ్డి, భూమయ్య, నవీన్‌కుమార్, పండుగు తిరుపతిలతో పాటు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
పర్యాటక కేంద్రంగా మార్చేందుకు కృషి
రాబోవు రోజుల్లో అన్నపూర్ణ రిజర్వాయర్‌ను పర్యాటక కేంద్రంగా మార్చేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతగిరిని పర్యాటక ప్రాంతాంగా మార్చాలని ఈప్రాంతవాసుల ఆకాంక్ష అని, దీనిని నెరవేర్చే దిశలో ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకవెళుతానని అన్నారు. పర్యాటక ప్రదేశంగా మారితే పలువురి జీవితాలు మారుతాయన్నారు. గత ప్రభుత్వం హామీ ఇచ్చిందే తప్ప ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు.