Share News

క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం

ABN , Publish Date - Dec 01 , 2025 | 12:29 AM

రాష్ట్రంలో క్రీడాకారులకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం

సిరిసిల్ల టౌన్‌, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో క్రీడాకారులకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో ఆదివారం 8వ రాష్ట్ర స్థాయి జూనియర్స్‌ బాలబాలికల వాలీబాల్‌ క్రీడా పోటీలను విప్‌ ఆది శ్రీనివాస్‌ ప్రారంభించారు. ముందుగా క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్యఅతిథులకు స్వాగతం పలుకుతూ విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యఅతిథి ఆది శ్రీనివాస్‌ జ్యోతిప్రజ్వలన చేసి ఒలంపిక్‌, వాలీబాల్‌ అసోసియేషన్‌ జెండాలను ఆవిష్కరించి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. వేదికపై ఉన్న ముఖ్య అతిథులకు 10 జిల్లా క్రీడాకారులు మార్చు ఫాస్ట్‌ ద్వారా గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్‌ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులను పూర్తి చేసుకొని శారీర, మానసిక ఉల్లాసం కోసం కబడ్డీ, వాలీబాల్‌, ఖోఖోలాంటీ గ్రామీణ క్రీడలను ఆడేవారన్నారు. కపిల్‌దేవ్‌ హయాంలో ప్రపంచ కప్‌ సాధించిన అనంతరం క్రికెట్‌ వంటి క్రీడలపై మొగ్గు చూపిన గ్రామాల్లో యూత్‌ క్లబ్‌లు, అసోసియేషన్స్‌ పెద్దల సహకారంతో కబడ్డీ, వాలీబాల్‌, ఖోఖో క్రీడలను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. వేములవాడలో వాలీబాల్‌, కబడ్డీ రాష్ట్ర స్థాయి పోటీలతో పాటు జాతీయ వాలీబాల్‌ పోటీలకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్రంలో క్రీడాకారులకు కొదవలేదని మట్టిలో మాణిక్యాల్లాంటి క్రీడాకారులు ఉన్నారని, వారిని వెలికితీయడానికి క్రీడలను ప్రోత్సహిస్తామన్నారు. క్రీడలతో మానసిక వికాసంతో పాటు మానసిక ధైర్యం పెంపొందుతాయన్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాలీబాల్‌ క్రీడాకారులు క్రీడా నైపుణ్యంను ప్రదర్శించి జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. అనంతరం ముఖ్యఅతిథి ప్రభుత్వ విప్‌ వాలీబాల్‌ క్రీడలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాలీబాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గజ్జెల రమేష్‌బాబు, ప్రధాన కార్యదర్శి ఎన్‌వీ హన్మంత్‌రెడ్డి, కోశాధికారి కృష్ణప్రసాద్‌, ఉమ్మడి జిల్లా ప్రధానకార్యదర్శి గిన్నె లక్ష్మన్‌, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు చెన్నమనేని శ్రీకుమార్‌, ఉపాధ్యక్షులు చింతకింది శ్యాంకుమార్‌, లక్ష్మీనారాయణగౌడ్‌, ప్రధానకార్యదర్శి ఏ రాందాస్‌, సహాయ కార్యదర్శులు లక్ష్మణ్‌, రామస్వామి, రెఫరీ బోర్డు రాష్ట్ర చైర్మన్‌ గణపతి, కన్వీనర్‌ రవీందర్‌రెడ్డి, ఎస్‌జీఎఫ్‌ జిల్లా ప్రధానకార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్‌, ఉపాధ్యక్షుడు బొప్ప దేవన్న, పీసీసీ మాజీ కార్యదర్శి గడ్డం నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 01 , 2025 | 12:29 AM