Share News

మహిళా సంఘాలకు తీపి కబురు

ABN , Publish Date - Jul 12 , 2025 | 12:59 AM

మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఆయా జిల్లాల గ్రామీణాభివృద్ధి సంస్థల అధికారులు, మున్సిపాలిటీల పరిధిలోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) డీఎంసీలు సర్కారుకు పూర్తిస్థాయి నివేదికలు అందజేస్తున్నారు.

మహిళా సంఘాలకు తీపి కబురు

- వడ్డీలేని రుణాలు ఇచ్చేందుకు కసరత్తు

- డీఆర్‌డీఏ, మెప్మాల నుంచి ప్రభుత్వానికి నివేదికలు

- మంత్రి అడ్లూరి చేతుల మీదుగా పంపిణీకి ఏర్పాట్లు

- జిల్లాలో 2,31,488 మందికి ప్రయోజనం

జగిత్యాల, జూలై 11 (ఆంధ్రజ్యోతి): మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఆయా జిల్లాల గ్రామీణాభివృద్ధి సంస్థల అధికారులు, మున్సిపాలిటీల పరిధిలోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) డీఎంసీలు సర్కారుకు పూర్తిస్థాయి నివేదికలు అందజేస్తున్నారు. 2005 సంవత్సరం నుంచి మహిళా సంఘాలకు పావలా వడ్డీకి రుణ పథకం అమల్లోకి వచ్చింది. బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి ద్వారా రుణాలు తీసుకునే సభ్యులకు ఇది వర్తింపజేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత 2016 వరకు ఈ విధానం కొనసాగింది. 2017 తర్వాత పావలా వడ్డీ డబ్బులు వారి ఖాతాల్లో వేయడం ఆపేశారు. తొమ్మిదేళ్ల తర్వాత వడ్డీలేని రుణాలు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం మళ్లీ కసరత్తు చేస్తుండటంతో మహిళా సంఘాల సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- రూ. 10 వేల నుంచి రూ. కోటి వరకు..

జగిత్యాల జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో గల సహాయక సంఘాలు, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్‌ మున్సిపాలిటీల పరిదిలో గల మెప్మా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రయోజనం కలిగేలా వడ్డీలేని రుణాలు అందించనున్నారు. గ్రామీణ సంఘాల్లో 1,73,412 సభ్యులు, పట్టణాల్లో గల సంఘాల్లో 58,076 మంది సభ్యులు ఉన్నారు. మొత్తంగా జిల్లావ్యాప్తంగా 2,31,488 మంది స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులున్నారు. ప్రభుత్వం వడ్డీలేని రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావడంతో మహిళలు ఆశించిన స్థాయిలో లబ్ధిపొందే వీలుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళలకు అన్ని రకాల సంక్షేమ పథకాలు వర్తింపజేసేందుకు చర్యలు తీసుకొంటోంది. ఇందిర మహిళా శక్తి పథకం ద్వారా ఇప్పటికే సౌర విద్యుత్‌ యూనిట్లు, ఆర్టీసీ బస్సులు, ఇటుకల తయారీ, స్టీల్‌ బ్యాంకు యూనిట్లు కట్టబెట్టిన విషయం తెలిసిందే. రానున్న రోజుల్లో వడ్డీ లేని రుణాలు రూ. 10 వేల నుంచి రూ. కోటి వరకు ఇచ్చి స్వయం ఉపాధి యూనిట్లు నెలకొల్పేలా పోత్సహించేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది.

- మహిళా శక్తి సంబరాలు...

మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. అర్హులైన సంఘాలకు బ్యాంకు రుణాలు, కొత్త వ్యాపారాల ఏర్పాటుకు ఆర్థిక సాయం, క్యాంటీన్ల ఏర్పాటు వంటివి చేస్తూ ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడుతోంది. ప్రభుత్వపరంగా అతివలకు చేస్తున్న కార్యక్రమాలపై ప్రచారం కల్పించేందుకు ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహిస్తోంది. ఈనెల 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు గ్రామ, మండల, పట్టణ సమాఖ్య సమావేశాలను ఏర్పాటు చేసి సంబరాలు నిర్వహించారు. ఈనెల 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సంఘాల సభ్యుల వివరాలు సేకరించడంతో పాటు అర్హులైన వారికి వడ్డీలేని రుణాలు ఇవ్వడానికి అవసరమైన కసరత్తులు నిర్వహించనుంది. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ చేతుల మీదుగా వడ్డీలేని రుణాలను పెద్దఎత్తున పంపిణీ చేయడానికి కార్యాచరణ రూపొందించి ముందకు వెళ్తున్నారు. బ్యాంక్‌ లింకేజీ, స్త్రీ నిధి రుణాల పంపిణీ, బీమా చేసి ప్రాణాలు కోల్పోయిన వారికి సాయం, తీసుకున్న రుణాలకు తిరిగి వడ్డీ చెల్లింపులు తదితర అంశాలపై సంబరాలల్లో సభ్యులకు మరింత అవగాహన కల్పిస్తున్నారు.

Updated Date - Jul 12 , 2025 | 12:59 AM