రాజరాజేశ్వరి రూపంలో అమ్మవారు
ABN , Publish Date - Oct 01 , 2025 | 11:25 PM
ధర్మపురి క్షేత్రంలోని లక్ష్మీ నృసింహస్వామి అనుబంధ శ్రీ రామ లింగేశ్వర స్వామి ఆలయంలో దసరా నవరాత్రోత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు.
ధర్మపురి, అక్టోబరు1 (ఆంధ్రజ్యోతి): ధర్మపురి క్షేత్రంలోని లక్ష్మీ నృసింహస్వామి అనుబంధ శ్రీ రామ లింగేశ్వర స్వామి ఆలయంలో దసరా నవరాత్రోత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. అమ్మవారలు రాజ రాజేశ్వరీ రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చింది. ఆలయ వేదపండితులు బొజ్జ రమేష్‌శర్మ, వేదపారాయణదారు పాలెపు ప్రవీణ్ కుమార్‌శర్మ, సామవేద పండితులు ముత్యాలశర్మ, భరత్‌శర్మ, దుద్దిళ్ల నారాయణశర్మ, అర్చకులు ద్యావళ్ల విశ్వనాథ శర్మ మంత్రోచ్ఛరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారలను దర్శనం చేసుకున్నారు. సాయంత్రం వేళలో శ్రీ యోగా, ఉగ్ర నారసింహ స్వామి వారలను పొన్న చెట్టు సేవపై పుర వీధుల్లో ఊరేగించి రాత్రి వేళలో ఆలయానికి తీసుక వచ్చారు. నవ దుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో చండీ హోమం నిర్వహిం చారు. అమ్మవారలకు షోడషోపచార పూజతో హారతి, మంత్రపుష్పం, కన్యకా పూజ, ముత్తైదువల లలిత సహస్రనామ పారాయణంతో తీర్థప్రసాద వితరణ జరిపారు. టీటీడీ కల్యాణ మండపంలో నవదుర్గ సేవా సమితి, చింతామణి చెరువు వద్ద మహా శక్తి సేవా సమితి, తిమ్మాపూర్ శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో, ఒజ్జల వీధిలో, నేరెళ్లలో రుత్వికులు జన్మంచి వంశీకృష్ణ, నారంభట్ల ప్రశాంత్, కశొజ్జల బాలకృష్ణ, మదు నటరాజ్‌శర్మ, పెండ్యాల రాజేష్‌శర్మ, ఒజ్జల వికాస్, విలాస్ తదితరులు అమ్మవారలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ జుక్కు రవీందర్, ఆలయ ఉపప్రధాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాసాచార్యులు, సూపరిం టెండెంట్ ద్యావళ్ల కిరణ్, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, ధర్మకర్తలు, అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
మంత్రి అడ్లూరి ప్రత్యేక పూజలు
ధర్మపురి క్షేత్రంలోని రామలింగేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన నవరాత్రోత్సవాల్లో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ బుధవారం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో నిర్వహించిన చండీ హోమం, పూర్ణాహుతి కార్యక్రమంలో ఆయన పాల్గొని పూజలు నిర్వహించారు. నవ దుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గా మాతను, స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ను ఆలయం పక్షాన శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఆయన వెంట టీపీసీసీ సభ్యులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సంగనభట్ల దినేష్, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేముల రాజేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చీపిరిశెట్టి రాజేష్, చిలుముల లక్ష్మణ్, సీపతి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.