దుర్గాదేవీ.. నమోస్తుతే
ABN , Publish Date - Sep 23 , 2025 | 01:40 AM
శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి.
- కొలువు తీరిన దుర్గామాత మూర్తులు
కరీంనగర్ కల్చరల్, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. భక్తులు మండపాల్లో దేవీ విగ్రహాలను ప్రతిష్టించి విద్యుత్ దీపాలతో, పూలతో ముస్తాబు చేశారు. రోజుకో అలంకారంతోపాటు అభిషేక, అర్చనలు, ప్రత్యేక పూజలు, విశేష కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశారు. చైతన్యపురి మహాశక్తి ఆలయంలో బాలాత్రిపురసుందరి (శైలపుత్రి) అవతార అలంకరణ, చతుష్షష్ఠి పూజలు చేశారు. ఆలయ నిర్వాహకుడు, ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌తోపాటు కుటుంబ సభ్యులు హజరై పూజలు చేశారు. పలు ప్రాంతాల భక్తులు, భవానీ దీక్షాపరులతో ఆలయం పోటెత్తింది. భవానీ, దుర్గామాత నామస్మరణలతో ఆలయం మార్మోగింది. సాయంత్రం అమ్మవారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. మహేశ్వరశర్మ అమ్మవారి అవతార విశిష్టతను వివరించారు. రాత్రి దాండియా నృత్యం కన్నుల పండువలా జరిగింది. యజ్ఞవరాహస్వామి క్షేత్రంలో వసుధాలక్ష్మి, వరదుర్గ, వాగ్వాదినీ మహాసరస్వతి ఆలయంలో అంకురార్పణ, నవకలశ స్నపనం, సాయంత్రం చతుష్షష్ఠి పూజలు, సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్వ వైదిక సంస్థానం ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ శ్రీభాష్యం వరప్రసాద్, సభ్యులు పాల్గొన్నారు. పాతబజార్ గౌరీశంకరాలయంలో బాలాత్రిపురసుందరి అలంకరణ చేశారు. కార్యక్రమంలో వంశపారంపర్య ధర్మకర్త ప్రొద్దుటూరి శ్రీనివాస్, ఈవో వుడుతల వెంకన్న పాల్గొన్నారు. భగత్‌నగర్ అయ్యప్ప ఆలయంలో జరిగిన పూజల్లో చైర్మన్ వై అనిల్‌కుమార్‌గౌడ్, ధర్మకర్తలు సత్యనారాయణ, కృష్ణ, కవిత, ఆనందరెడ్డి, కాంగ్రెస్ నాయకులు పొన్నం శ్రీనివాస్, తాళ్లపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. జ్యోతినగర్ హనుమాన్ సంతోషిమాత, వావిలాలపల్లి హనుమత్ సహిత కనకదుర్గ, కమాన్‌రోడ్ రామేశ్వర, బొమ్మకల్‌రోడ్ అంబాభవానీ ఆలయాల్లో పూజలు జరిగాయి. టవర్‌సర్కిల్, ప్రకాశంగంజ్, రాంనగర్, మంకమ్మతోట, విద్యానగర్, గాంధీరోడ్, సుభాష్‌నగర్, జగిత్యాలరోడ్, శ్రీపురం కాలనీతో పాటు పలు ఆలయాల్లో, కూడళ్లలో, వస్త్ర వ్యాపార, వాణిజ్య నిలయాల్లో నెలకొల్పిన దుర్గామాత మండపాల వద్ద ప్రతిష్ఠాపనా పూజలు జరిగాయి.