Share News

గోదావరి తీరం జరభద్రం...

ABN , Publish Date - Nov 23 , 2025 | 12:44 AM

గోదావరిఖని, మంథని శివారులోని గోదావరి నది తీరాలు ప్రమాదా లకు నెలవుగా మారుతున్నాయి.

గోదావరి తీరం జరభద్రం...

మంథని/కళ్యాణ్‌నగర్‌, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): గోదావరిఖని, మంథని శివారులోని గోదావరి నది తీరాలు ప్రమాదా లకు నెలవుగా మారుతున్నాయి. నది ప్రవాహంలో బండరాల సొరికెలు, ఇసుక గుంతలు, నీటి సుడులు, ప్రవాహ వేగంతో ప్రమాదాలు చోటు చేసుకొని పలువురు మృత్యువాత పడుతున్నారు. నది సమీపంలో ఎలాంటి హెచ్చరికల బోర్డులు లేకపోవడంతో పుణ్య స్నానాలకు, సరదాగా ఈత, చేపల వేట వెళ్ళి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కొత్తగా ఈ ప్రాంతానికి వచ్చిన వారికి నది ప్రవాహంపై అవగాహన లేకుండా ప్రమాదంలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోతున్నారు.

మంథని తీరంలోని గోదావరి నదిలో శుభకార్యాల సందర్భంగా, కర్మకాండలు చేయడానికి జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన వారు నిత్యం ఇక్కడకు వస్తుంటారు. సెలవులు, పండగ పర్వదినాలు, వీకెండ్‌ సమయాల్లో వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు, యవకులు ఈత కోసం వచ్చి నీటిలో మునిగిపోతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు చూపే హడావుడిని ఆ తర్వాత మరచిపోతున్నారు. నది తీరంలో షెవర్లు ఏర్పాటు చేస్తే నదిలో దిగాల్సిన అవసరం లేక ప్రమాదాలను సైతం నివారించే అవకాశం ఉంది. కలెక్టర్‌ స్పందించి మున్సిపల్‌, రెవెన్యూ, పోలీసు, ఫైర్‌, ఇరిగేషన్‌ శాఖల అధికారుల ద్వారా గోదావరినది నీటి ప్రవాహం, ప్రమాదాలు జరిగే తీరు, ప్రమాదాలకు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల బోర్డులు నది తీరంలో ఏర్పాటు చేస్తే ప్రమాదాల నివారణకు ఉపయోగకరంగా ఉంటుందని ప్రజలు కోరుతున్నారు.

ఫ గోదావరిఖని సమ్మక్క - సారలమ్మ స్నాన ఘట్టాల వద్ద ప్రమాద హెచ్చరికలు సూచించే బోర్డులు, ఫెన్సింగ్‌ లేకపోవడంతో లోతు ప్రాంతాలకు వెళ్లి వరద నీటిలో కొట్టుకుపోతున్నారు. గోదావరినదిపై సుందిళ్ల బ్యారేజీ నిర్మించడంతో స్టోరేజీ వాటర్‌ ఉండేది. ప్రస్తుతం సుందిళ్ల బ్యారేజీలోని గేట్లు ఎత్తివేశారు. దీంతో ఇటీవల కురిసిన వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. పండుగల సందర్భంగా గోదావరిఖనితో పాటు ఇతర ప్రాంతాల వారు పుణ్య స్నానాలు ఆచరించడానికి గోదావరి నదికి వస్తున్నారు. వారు మెట్లు ఉన్నాయనే ఉద్దేశ్యంతో కింద వరకు వెళ్లి ప్రమాదాలకు గురవుతున్నారు. మెట్ల వరకు ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాల్సి ఉండగా కార్పొరేషన్‌ పట్టించుకోకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగు తున్నాయి. రాజీవ్‌ రహదారికి సమీపంలో ఉండడంతో పలు ప్రాంతాల నుంచి గోదావరి స్నానాలను ఆచరించడానికి నిత్యం ఇక్కడికి వస్తుంటారు. గోదావరి వద్ద ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో ప్రమాదభారిన పడుతున్నారు.

ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలి

ఎల్లంపల్లి గేట్లను ఎత్తుతుండడంతో వరద ప్రవాహం పెరుగుతుంది. సమ్మక్క - సారలమ్మ జాతర సమయంలో గోదావరి నదీ తీరంలో భక్తులు స్నానాలు ఆచరించడానికి మెట్లు ఏర్పాటు చేసినప్పటికీ లోతు భాగం వద్ద ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయకపోవడంతో నీటిలోకి దిగి వరద తాకిడికి కొట్టుకుపోతున్నారు. గతంలో కార్పొరేషన్‌ ప్రమాద హెచ్చరికలను సూచిస్తూ బోర్డులు ఏర్పాటు చేయగా అవి ఇప్పుడు అగుపించడం లేదు. ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసి ఎవరూ లోపలికి వెళ్ళకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

ఫ మంథనికి చెందిన రావికంటి సాయికృష్ణ అనే యువకుడు సరదగా నదిలో ఈత కొట్టడానికి వెళ్ళి నీటి ప్రవాహంలో చిక్కుకొని మృత్యవాత పడ్డాడు. మంథనికి చెందిన ముగ్గురు యువకులు సరదగా ఈత కోసం నదిలోకి దిగి మునిగి మృతి చెందారు.

ఫ పుణ్యస్నానం కోసం వచ్చిన ఓ ప్రేమ జంట వరద ఉధృతితో ఇద్దరు కొట్టుకుపోయారు. ప్రియురాలు మృతి చెందగా, ప్రియుడిని అక్కడే ఉన్న జాలర్లు కాపాడారు.

ఫ ఇటీవల ఓ యువకుడు స్నానానికి వచ్చి వరదలో కొట్టుకుపోతుం డగా అక్కడే ఉన్న జాలర్లు గమనించి యువకుడిని బయటకు తీసుకువచ్చారు.

Updated Date - Nov 23 , 2025 | 12:44 AM