రేపటి నుంచి జిన్నింగ్ మిల్లుల బంద్
ABN , Publish Date - Nov 16 , 2025 | 01:11 AM
ఇప్పటికే సీసీఐ ద్వారా అంతంత మాత్రంగా జరుగుతున్న పత్తి కొనుగోళ్ళు సోమవారం నుంచి నిలిచిపోనున్నాయి. సీసీఐ, జిన్నింగ్ మిల్లులను ఎల్-1, ఎల్-2, ఎల్-3 గ్రేడులుగా విభజించి కొనుగోళ్లు చేస్తుండడం, కపాస్ కిసాన్ మొబైల్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవడం లాంటి నిబంధనలను విధించడంపై నిరసన తెలుపుతున్నారు.
- ఆందోళనలో పత్తి రైతులు
- సీసీఐ, ప్రైవేట్ వ్యాపారులు కొన్నది 60వేల క్వింటాళ్లు
- ఇంకా కొనాల్సింది నాలుగు లక్షల క్వింటాళ్లపై చిలుకు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
ఇప్పటికే సీసీఐ ద్వారా అంతంత మాత్రంగా జరుగుతున్న పత్తి కొనుగోళ్ళు సోమవారం నుంచి నిలిచిపోనున్నాయి. సీసీఐ, జిన్నింగ్ మిల్లులను ఎల్-1, ఎల్-2, ఎల్-3 గ్రేడులుగా విభజించి కొనుగోళ్లు చేస్తుండడం, కపాస్ కిసాన్ మొబైల్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవడం లాంటి నిబంధనలను విధించడంపై నిరసన తెలుపుతున్నారు. రాష్ట్రంలోని అన్ని జిన్నింగ్ మిల్లులకు పని కల్పించే విధంగా పత్తి కొనుగోళ్లు చేపట్టాలని తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నది. ఈ అసోసియేషన్ చేసిన డిమాండ్‌ను ప్రభుత్వం పరిశీలించక పోవడంతో ఈనెల 17 నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపివేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా జిన్నింగ్ మిల్లుల సంక్షేమ సంఘం ఈ బంద్‌కు పిలుపు ఇవ్వడంతో కొనుగోళ్లు నిలిచిపోనున్నాయి.
ఫ నిలిచిపోనున్న సీసీఐ కొనుగోళ్లు
ఈనెల 6 నుంచి బంద్ చేపట్టాలని సంఘం నిర్ణయించినా మార్కెటింగ్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అందుబాటులో లేని కారణంగా దానిని వాయిదా వేశారు. ప్రస్తుతం 17 నుంచి జిన్నింగ్ మిల్లులు బంద్ పాటిస్తున్నందున సీసీఐ కొనుగోళ్లు బంద్ కానున్నాయి. ప్రతి యేటా అక్టోబరు మొదటివారంలో సీసీఐ కొనుగోళ్లను ప్రారంభిస్తుంది. వర్షాల కారణంగా పత్తిలో తేమ అధికంగా ఉండడంతో నవంబరులో కొనుగోళ్లు ప్రారంభించారు. జిల్లాలో ఇప్పటి వరకు సీసీఐ ఆరు వేల క్వింటాళ్ల మేరకే పత్తి కొనుగోలు చేసింది. జిల్లాలో 50 వేల ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. సాధారణ పరిస్థితుల్లో ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ళ దిగుబడి వస్తుంది. అకాల వర్షాల కారణంగా కొంత పంట దెబ్బతినడంతో ఎకరాకు 7 నుంచి 10 క్వింటాళ్ల మేరకు దిగుబడి వస్తుందని అంచనా వేశారు. కనీసం 3.5 లక్షల క్వింటాళ్లు, గరిష్ఠంగా ఐదు లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని భావిస్తున్నారు.
ఫ నత్తనడకన కొనుగోళ్లు
ఇప్పటి వరకు సీసీఐ ఆరు వేల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయగా, ప్రైవేట్ వ్యాపారులు మరో 50వేల క్వింటాళ్ళు కొనుగోలు చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు. కనీసం ఎకరాకు ఏడు క్వింటాళ్ల చొప్పున దిగుబడి వచ్చినా మరో మూడు లక్షల క్వింటాళ్ల మేరకు పత్తి కొనుగోలు చేయాల్సి ఉన్నది. సీసీఐ కపాస్ ఆప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని జిన్నింగ్ మిల్లులకు పత్తి తీసుకొని రావాలి అనే నిబంధనలు విధించడంతో ఎల్-1 మిల్లుల బుకింగ్ పూర్తయిన తర్వాతే ఎల్-2 మిల్లుల స్లాట్ బుక్ అవుతుంది. ఇలాంటి సమస్యలతోపాటు తేమశాతం ఎక్కువగా ఉందని కొనుగోలు చేయక పోవడం సమస్య కూడా ఉత్పన్నమవుతున్నది. దీంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు పత్తిని విక్రయించుకోవలసి వస్తోంది. పత్తి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు 8,110 రూపాయలు ఉండగా ప్రైవేట్ వ్యాపారులు 5,500 నుంచి ఆరు వేల రూపాయల వరకు చెల్లిస్తున్నారు. డబ్బులు అవసరమున్న వారు తప్పనిసరి పరిస్థితుల్లో అమ్ముకోవాల్సి వస్తోంది. ధర రాకున్నా చేతికి వచ్చిన పత్తిని అమ్ముకొని దానిని నిల్వచేసే సమస్యను తప్పించుకుందామనుకున్నా జిన్నింగ్ మిల్లులు నిరవధికంగా కొనుగోళ్లు నిలిపివేయనున్న నేపథ్యంలో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. అకాల వర్షాలు కురిస్తే పత్తి తడవడంతోపాటు తేమ పెరిగి ఇప్పుడు లభిస్తున్న ధర కూడా రాకుండా పోతుందేమోనని భయపడుతున్నారు. ప్రభుత్వం జిన్నింగ్ మిల్లుల యజమానుల సంక్షేమ సంఘంతో చర్చించి వెంటనే కొనుగోళ్లు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.