Share News

నేడే సార్వత్రిక సమ్మె

ABN , Publish Date - Jul 09 , 2025 | 01:17 AM

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే విధానాలను వ్యతిరేకిస్తూ నాలుగు జాతీయ కార్మిక సంఘాలు దేశ వ్యాప్తంగా ప్రభుత్వరంగ సంస్థల్లో బుధవారం సమ్మెకు పిలుపునిచ్చాయి.

నేడే సార్వత్రిక సమ్మె

గోదావరిఖని, జూలై 8(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే విధానాలను వ్యతిరేకిస్తూ నాలుగు జాతీయ కార్మిక సంఘాలు దేశ వ్యాప్తంగా ప్రభుత్వరంగ సంస్థల్లో బుధవారం సమ్మెకు పిలుపునిచ్చాయి. కార్మిక చట్టాల రద్దు, నాలుగు కొత్త లేబర్‌ కోడ్‌లను ప్రవేశపెట్టడాన్ని జాతీయ కార్మిక సంఘాలు ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, హెచ్‌ఎంఎస్‌లు ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. దీనికి తోడు 8గంటల పని దినాలను 10గంటలకు పెంచుతూ తీసుకువచ్చిన జీవోను కూడా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సింగరేణిలో ఈ సమ్మెను విజయ వంతం చేసేందుకు నాలుగు జాతీయ కార్మిక సంఘాలు తీవ్రంగా కృషి చేశాయి. కార్మికవర్గాన్ని బుధవారం జరిగే సమ్మెకు సంసిద్ధం చేశాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన కార్మిక చట్టాలకు కార్మికవర్గానికి, ప్రభుత్వ రంగ పరిశ్రమలకు జరిగే నష్టాన్ని వివరించాయి. సింగరేణిలో సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌(ఏఐటీయూసీ), సింగరేణి కోల్‌మైన్స్‌ లేబర్‌ యూనియన్‌ (ఐఎన్‌టీ యూసీ), సింగరేణి కాలరీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సీఐటీయూ), తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌) కార్మిక సంఘాల జేఏసీగా ఏర్పడి సమ్మెకు కార్మికులను సంసిద్ధం చేశాయి. మరో జాతీయ కార్మిక సంఘం సింగరేణి మైనర్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌(హెచ్‌ఎంఎస్‌)తోపాటు విప్లవ కార్మిక సంఘాలైన గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం(ఐఎఫ్‌టీయూ), గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం శ్రామికశక్తి (ఏఐఎఫ్‌టీయూ), టీఎన్‌టీ యూసీ తదితర కార్మిక సంఘాలు ఐక్య వేదికగా ఏర్పడి సమ్మె కోసం విస్తృత ప్రచారం చేశాయి. సింగరేణి కోల్‌మైన్స్‌ కార్మిక సంఘ్‌(బీఎంఎస్‌) మాత్రం సమ్మెకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించింది.

సింగరేణి యాజమాన్యం ఈ సమ్మె వల్ల సంస్థకు, కార్మికులకు ఉత్పత్తి, ఉత్పాదకతలకు జరిగే నష్టాన్ని వివరిస్తూ బుధవారం జరిగే సమ్మెకు సింగరేణి కార్మికవర్గం దూరంగా ఉండాలని కోరింది. ఒక రోజు సమ్మె చేస్తే 1.92లక్షల టన్నుల ఉత్పత్తికి విఘాతం కలుగుతుందని, ఇది వార్షిక ఉత్పత్తి లక్ష్యాల సాధనపై ప్రభావం చూపుతుందని యాజమాన్యం చెబుతున్నది. దీనికి తోడు కార్మికవర్గం కూడా రూ.13.7కోట్ల వేతనా లను ఒక రోజులో కోల్పోతారని చెబుతున్నది. మొత్తం సంస్థకు కలిగే ఉత్పత్తి నష్టం సుమారు రూ.76కోట్లు ఉంటుందని వివరించింది. సమ్మె డిమాండ్లలో సింగ రేణికి సంబంధించింది, రాష్ట్రప్రభుత్వ పరిధిలో నిర్ణయిం చాల్సి అంశాలు ఏమి లేని కారణంగా సమ్మె వల్ల సంస్థకు నష్టం జరగడం మినహా కార్మికుల సమస్యల పరిష్కారానికి మార్గాలు లేవని స్పష్టం చేసింది. అయితే సింగరేణి కార్మికవర్గంలో సమ్మెకు సంసిద్ధత కనిపి స్తున్నది. సింగరేణిలోని 38వేల మంది కార్మికులు, ఉద్యో గులతోపాటు కాంట్రాక్టు కార్మికులు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులు కూడా సమ్మెలో పాల్గొనే విధంగా కార్మిక సంఘాలు సంసిద్ధం చేశాయి. అయితే అండర్‌ గ్రౌండ్‌ బొగ్గు గనుల్లో అత్యవసర సర్వీసుల్లో పని చేసే సిబ్బంది, కార్మికులు అనివార్యంగా విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. మొత్తంగా సింగరేణిలో ఈ సార్వత్రిక సమ్మె జరిగేలా వాతావరణం ఏర్పడింది. రామగుండం ఎన్‌టీ పీసీలో కార్మిక సంఘాలు సమ్మెను విజయవంతం చేసేందుకు ముమ్మరంగా ప్రచారం నిర్వహించాయి. కానీ ఎన్‌టీపీసీలో సమ్మెకు సంబంధించి స్పష్టమైన వైఖరి కార్మికవర్గంలో కనిపించలేదు. బుధవారం తల పెట్టిన సార్వత్రిక సమ్మెకు కార్మిక సంఘాలతో పాటు భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ), భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) సైతం తమ మద్దతును ప్రకటిం చాయి. సమ్మె సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - Jul 09 , 2025 | 01:17 AM