గం‘జాయ్’
ABN , Publish Date - Aug 30 , 2025 | 01:26 AM
జిల్లాలో కొద్ది మంది యువకులు గం‘జాయ్’లో తేలిపోతున్నారు. ఆ మత్తుకు బానిసగా మారినవారు మత్తులో నుంచి బయటపడలేక విలవిలలాడుతున్నారు. ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితమైన గంజాయి మత్తు ప్రస్తుతం జిల్లా కేంద్రాలకు, పల్లెలకు కూడా వ్యాపించింది. యువత, బాలురు కూడా గంజాయి భూతం బారినపడి ఆర్థికంగా, శారీరకంగా, కుటుంబ పరంగా తీవ్ర ఇబ్బందులపాలవుతున్నారు.
కరీంనగర్ క్రైం, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొద్ది మంది యువకులు గం‘జాయ్’లో తేలిపోతున్నారు. ఆ మత్తుకు బానిసగా మారినవారు మత్తులో నుంచి బయటపడలేక విలవిలలాడుతున్నారు. ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితమైన గంజాయి మత్తు ప్రస్తుతం జిల్లా కేంద్రాలకు, పల్లెలకు కూడా వ్యాపించింది. యువత, బాలురు కూడా గంజాయి భూతం బారినపడి ఆర్థికంగా, శారీరకంగా, కుటుంబ పరంగా తీవ్ర ఇబ్బందులపాలవుతున్నారు. విద్యార్థులే లక్ష్యంగా గంజాయి మాఫియా తన అక్రమదందాను విస్తరిస్తున్నది. మత్తుకు బానిసలుగా మారిన వారితోనే గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలు సాగిస్తోంది. ఏడు నెలల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో టాస్క్‌ఫోర్స్, సివిల్ పోలీసులు నిర్వహించిన దాడుల్లో 31 కిలోల గంజాయిని పట్టుకున్నారు. గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ, విక్రయించిన 16 కేసుల్లో 39 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి మత్తుకు బానిసలుగా మారిన మరో 50 మంది వరకు వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించి హెచ్చరించి వదిలేశారు.
ఫ అలవాటు.. అక్రమ రవాణా.. అమ్మకం
గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలను చేపడుతున్న మాఫియా పల్లెల్లోని అమాయక యువతకు అలవాటు చేసి మత్తు ఊబిలోకి లాగుతున్నది. ఒకసారి గమ్మత్తుగా అలవాటైన మత్తులో నుంచి యువత, విద్యార్థులు బయటకు రాలేకపోతున్నారు. దీంతో గంజాయి కొనుగోలుకు డుబ్బులు లేకపోవడంతో మత్తుకు బానిసలుగా మారిన కొందరు యువకులే గంజాయిని ఇతరులకు విక్రయించే దందాను సాగిస్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు. మరి కొందరు ఖర్చుల కోసం దొంగతనాలకు పాల్పతున్నారు. గంజాయితో నింపిన సిగరెట్లను 100 నుంచి 200 రూపాయలకు, 50 గ్రాముల గంజాయి పౌడర్‌ను 500 రూపాయలకు ఈ మాఫియా విక్రయిస్తున్నది. మరి కొందరు గంజాయి(హాష్) ఆయిల్‌ను సేవిస్తున్నారు. గంజాయి చాక్‌లెట్స్ కూడా మార్కెట్‌లోకి వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో కోడ్ బాషను ఉపయోగించి గంజాయి మత్తు బానిసలకు గంజాయి చాక్లెట్లను కూడా విక్రయిస్తున్నారు.
ఫ విద్యార్థులే లక్ష్యంగా.....
కరీంనగర్‌తోపాటు జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు, యువకులకు కొందరు ఏజెంట్లు ఒడిసా, విశాకపట్నం వంటి ఇతర ప్రాంతాల నుంచి కరీంనగర్‌కు గంజాయి తీసుకువచ్చి సరఫరా చేస్తూ విద్యార్థులను బానిసలుగా మార్చుతున్నారు. కరీంనగర్ శివారు ప్రాంతాల్లోని ప్రధాన రహదారుల పక్కన చెట్ల పొదల్లో విద్యార్థులు గంజాయిని సేవిస్తున్నట్లు ఇటీవల తనిఖీలలో వెల్లడైంది. విద్యార్థులు గమ్మత్తుగా మొదలుపెట్టిన గంజాయి మత్తుకు బానిసగా మారి అందులోనే కూరుకుపోతున్నారు. కొంత కాలం క్రితం కరీంనగర్ రూరల్ మండలానికి చెందిన 10 మంది యువకులు ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో పోలీసుల తనిఖీల్లో గంజాయితో చిక్కిన ఘటన కలకలం సృష్టించింది. ఆ యువకులు గంజాయికి అలవాటు పడి డబ్బుల కోసం గంజయిని విక్రయించేందుకు సిద్ధమయ్యారని పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఫ గ్రానైట్ కార్మికుల రూపంలో గంజాయి ఏజెంట్లు
ఒడిశాకు చెందిన గంజాయి స్మగ్లర్లు తమ వ్యాపారాన్ని కరీంనగర్‌లో విస్తరించేందుకు గ్రానైట్ కార్మికుల రూపంలో వారి ఏజెంట్లను నియమించారు. స్థానిక ఏజెంట్లు ఉంటే ఎవరికైనా అనుమానం వస్తుందని భావించిన మాఫియా ఒడిశాకు చెందిన వారినే ఏజెంట్లుగా నియమించుకుని గంజాయి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.
రెండున్నర సంవత్సరాల్లో గంజాయి కేసుల వివరాలు...
--------------------------------------------------------------------------
సం. కేసులు పట్టుకున్నగంజాయి అరెస్ట్ వ్యక్తులు
-------------------------------------------------------------------------
2023 22 27కిలోలు 55
2024 39 128 85
2025(7 నెలలు)16 31.360 39