దోపిడీ దొంగల ముఠా అరెస్టు
ABN , Publish Date - Jul 24 , 2025 | 12:42 AM
జిల్లా కేంద్రంలో దోపిడీకి పాల్పడిన ఎనిమిది మంది సభ్యులు గల దోపిడి ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
- ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- తులం పావు బంగారం, రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం
జగిత్యాల, జూలై 23 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో దోపిడీకి పాల్పడిన ఎనిమిది మంది సభ్యులు గల దోపిడి ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద తులం పావు బంగారం, రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు, ఎనిమిది స్మార్ట్ ఫోన్లు, లక్ష రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. సంఘటనకు కారకులయిన జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామానికి చెందిన తరాల శ్రీకాంత్ అలియాస్ బండి శ్రీకాంత్, చెట్ల మహేశ్, జగిత్యాల పట్టణంలోని హనుమాన్‌వాడకు చెందిన పాలకుర్తి రాజు, విద్యానగర్ కాలనీకి చెందిన ఉల్లెంగుల సతీష్, పెగడపల్లి మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన బడుసు మురళీ, సారంగపూర్ మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన ఏలేటి మోహన్ రెడ్డి, రేచపల్లి గ్రామానికి చెందిన అన్నారపు రఘు, బండి మధును పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ అశోక్‌కుమార్ వివారలు వెల్లడించారు. జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామానికి చెందిన ఇందూరి శంకరయ్య ఈనెల 22వ తేదీన మధ్యాహ్న సమయంలో గ్రామం నుంచి జగిత్యాలకు సొంత పనిమీద ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. ఈక్రమంలో పట్టణంలోని హనుమాన్ వాడలో గల బీరయ్య గుడి వద్దకు రాగానే అకస్మత్తుగా బండి శ్రీకాంత్, పాలకుర్తి రాజు, చెట్ల మల్లేశం అను ముగ్గురు వ్యక్తులు అడ్డుకున్నారు. శంకరయ్యను సమీపంలోని పాలకుర్తి రాజు ఇంట్లోకి బలవంతంగా లాక్కొని వెళ్లి, కొట్టి బెదిరించి అతని వద్ద ఉన్న తులం పావు బంగారం దోపిడీ చేశారు. బండి శ్రీకాంత్ అను వ్యక్తి భయబ్రాంతులకు గురిచేసి శంకరయ్య ఫోన్ ద్వారా ఒక లక్ష రూపాయలు ఫోన్ పే చేయించుకున్నాడు. తర్వాత బండి శ్రీకాంత్, చెట్ల మల్లేశం సమాచారం ఇవ్వడంతో మరో ఇద్దరు వ్యక్తులు ఉల్లెంగుల సతీష్, బడుసు మురళి కలిసి టీఎస్02ఈక్యూ3666 నంబరు గల కారులో బలవంతంగా శంకరయ్యను సారంగాపూర్ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి కొట్టారు. శంకరయ్యను ఇంకా డబ్బులు కావాలని ఇవ్వకుంటే చంపుతామని కత్తితో బెదిరించారు. తరువాత బండి శ్రీకాంత్ సెల్‌ఫోన్ ద్వారా ఏలేటి మోహన్‌రెడ్డి అనే వ్యక్తికి సమాచారం అందించి అక్కడికి పిలిపించాడు. జరిగిన విషయం చెప్పి వచ్చిన డబ్బులు అందరం పంచుకుందామని తెలిపాడు. ఏలేటి మోహన్ రెడ్డి అనే వ్యక్తి అన్నారపు రఘు, బండి మధును పిలిచి విషయం చెప్పగా వారు కూడా ఒప్పుకుని తర్వాత టీఎస్18హెచ్1246 నంబరు గల ఒక ద్విచక్రవాహనంపై కల్లెడ గ్రామంలోని ఇంటికి శంకరయ్యను తీసుకెళ్లారు. ఇంకా డబ్బు, బంగారం కావాలని శంకరయ్యను బెదిరించారు. దీంతో శంకరయ్య భయానికి గురయి ఇంట్లో తన తల్లి మీద గల బంగారు పుస్తెలతాడు తీసుకుని నిందితులకు ఇవ్వడానికి ప్రయత్నించాడు. కాగా సదరు బంగారు పుస్తెల తాడును తీసుకోకుండా, అది అమ్మి డబ్బులు తేవాలని బెదిరింపులకు గురిచేశారు. కల్లెడ గ్రామం నుంచి జగిత్యాలకు నిందితులు శంకరయ్యను ద్విచక్రవాహనంపై కూర్చోబెట్టుకుని తీసుకొని వచ్చారు. పట్టణంలోని క్లాక్ టవర్ దగ్గర గల బాలాజీ జువేల్లర్స్ దుకాణంలో బంగారు పుస్తెల తాడును విక్రయించి డబ్బులు తీసుకుంటుండగా శంకరయ్యకు బావ అయిన తుమ్మనపల్లి రమేష్ అక్కడకు అకస్మత్తుగా వచ్చి అడ్డుకున్నాడు. వెంటనే బావ తుమ్మనపల్లి రమేష్ సహకారంతో పట్టణ పోలీస్ స్టేషన్‌లో శంకరయ్య ఫిర్యాదు చేశారు. జగిత్యాల పట్టణ ఇన్‌స్పెక్టర్ కరుణాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈనెల 23వ తేదీన సంఘటనలో నిందితులైన ఎనిమిది మంది జగిత్యాల పట్టణంలో టీఎస్ 21 ఎఫ్ 0252 నంబరు గల కారులో కూర్చుని దోపిడీ చేసిన డబ్బులు పంచుకుందామని మాట్లాడుకుంటుండగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు. దోపిడీ దొంగల ముఠాను పట్టుకోవడంలో కృషి చేసిన డీఎస్పీ రఘుచందర్, టౌన్ ఇన్‌స్పెక్టర్ కరుణాకర్, రూరల్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్, రూరల్ ఎస్‌ఐ సధాకర్, ఎస్‌ఐ కుమారస్వామి, మహిళా ఎస్‌ఐ సుప్రియ, పోలీసు సిబ్బందిని ఎస్పీ అశోక్‌కుమార్ అభినందించి రివార్డును అందజేశారు.