గన్నేరువరం మానేరు వంతెనకు నిధులు
ABN , Publish Date - Oct 25 , 2025 | 01:06 AM
మానేరు నదిపై వంతెన నిర్మించి జిల్లా కేంద్రమైన కరీంనగర్‌తో దూరభారం తగ్గించాలని కోరుతున్న గన్నేరువరం మండల వాసుల కల ఫలిస్తున్నది.
- సీఆర్‌ఐఎఫ్ విడుదల చేస్తూ కేంద్రం ఉత్తర్వులు
- మానేరు వంతెనకు రూ.77 కోట్లు
- ఆర్నకొండ-మల్యాల క్రాస్ రోడ్డు విస్తరణకు రూ.50 కోట్లు
- వంతెన నిర్మాణం ఎక్కడ అన్నది ప్రశ్నార్థకం
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
మానేరు నదిపై వంతెన నిర్మించి జిల్లా కేంద్రమైన కరీంనగర్‌తో దూరభారం తగ్గించాలని కోరుతున్న గన్నేరువరం మండల వాసుల కల ఫలిస్తున్నది. ఇప్పటికే మంజూరైన ఈ వంతెనకు ప్రస్తుతం కేంద్రం నిధులు కూడా విడుదల చేసింది. సెంట్రల్ రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఆర్‌ఐఎఫ్) నుంచివంతెనకు 77 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీఆర్‌ఐఎఫ్ నుంచి 162 కోట్లతో మూడు పనులు మంజూరయ్యాయి. గతంలోనే పనులు మంజూరు కాగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ నుంచి గన్నేరువరం మండల కేంద్రానికి రాకపోకలను దూరభారం తగ్గించి ప్రజలకు చేరువ చేసేందుకు మానేరు నదిపై వంతెన నిర్మించడమే మార్గమని భావించారు. ప్రస్తుతం కరీంనగర్ నుంచి గన్నేరువరం రాజీవ్ రహదారి గుండ్లపల్లి మీదుగా కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకట్రావుపల్లె మీదుగా గానీ వెళ్ళాల్సి వస్తుంది. గుండ్లపల్లి నుంచి వెళితే 40 కి.మీ., వెంకట్రావుపల్లి నుంచి వెళితే 34 కి.మీ ప్రయాణించాల్సి వస్తున్నది. మానేరుపై వంతెన నిర్మిస్తే 20 కి.మీ,లోగానే కరీంనగర్‌కు చేరుకునే అవకాశం కలుగుతుంది. దీనితో కరీంనగర్ ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్ మానేరు నదిపై వంతెన నిర్మించాలని కేంద్రానికి ప్రతిపాదించగా సీఆర్‌ఐఎఫ్ నుంచి ఆ మేరకు మంజూరు చేశారు. ఇప్పుడు 77 కోట్ల రూపాయలు కూడా విడుదల చేశారు. దీనితో పాటు చొప్పదండి మండలం ఆర్నకొండ నుంచి జగిత్యాల జిల్లాకు చెందిన మల్యాల క్రాస్ రోడ్ వరకు 35 కి.మీ, నిడివి గల రోడ్లు, భవనాలశాఖ రహదారిని రెండు వరుసల రోడ్డుగా మార్చేందుకు 50 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నుంచి సిరికొండ వరకు 23 కోట్లతో రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు కూడా నిధులు విడుదల చేశారు. త్వరలోనే ఈ పనులను చేపట్టేందుకు రోడ్లు, భవనాలశాఖ సన్నాహాలు చేస్తున్నది. నిధులు విడుదల కావడంతో వెంటనే టెండర్లు పిలిచి కాంట్రాక్టును ఖరారు చేసి వీలైనంత తొందరలో పనులు ప్రారంభించాలని ఆ శాఖ భావిస్తున్నది.
ఫ మానేరు వంతెన నిర్మించేదెక్కడ ?
గన్నేరువరం మండల కేంద్రానికి ప్రయాణ దూరం తగ్గించేందుకు నిర్మించతలపెట్టిన మానేరు వంతెనను ఎక్కడ చేపట్టాల న్నది వివాదంగా మారింది. ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్ ముందుగా ప్రతిపాదించిన మేరకు కొత్తపల్లి మండలం ఖాజీపూర్, చొక్కారావుపల్లి గ్రామాలను కలుపుతూ మానేరు నదిపై 500 మీ. పొడవున వంతెన నిర్మించాల్సి ఉంటుంది. ఈ వంతెన నిర్మాణమైతే గన్నేరువరం మండల కేంద్రం నుంచి చొక్కారావుపల్లి మీదుగా కరీంనగర్, పద్మనగర్ వరకు 15 కి.మీ. ప్రయాణించి చేరుకునే అవకాశం ఉంటుంది. అయితే మండలవాసుల నుంచి మరో రెండు ప్రతిపాదనలు కూడా వచ్చాయి. ఆ ప్రతిపాదనల మేరకే వంతెన చేపట్టాలని కోరుతూ ఆయా గ్రామాల ప్రజలు వినతిపత్రాలు ఇవ్వడమే కాకుండా ఆందోళనలు కూడా చేపట్టారు. కొత్తగా వచ్చిన ప్రతిపాదనలలో గన్నేరువరం శివారులోని ఆది హన్మాన్ ఆలయం నుంచి ఎలగందులను కలుపుతూ మానేరు నదిపై వంతెన నిర్మించాలనేది ఒకటి. ఈ వంతెన నిర్మాణం చేపడితే వంతెన పొడువు 750 నుంచి కిలో మీటరు వరకు ఉంటుంది. దీనితో నిర్మాణ వ్యయం పెరిగే అవకాశమున్నది. అలాగే గన్నేరువరం నుండి మైలారం గ్రామ మైసమ్మ గుట్టమీదుగా పద్మనగర్ వరకు కలిపే వంతెనను నిర్మించాలని కూడా ఆయా గ్రామాల ప్రజలు ప్రతిపాదిస్తున్నారు. ఈ మార్గం ద్వారా 11 కి.మీ. ప్రయాణించి మండల కేంద్రానికి చేరుకోవచ్చు. అయితే బ్రిడ్జి సుమారు 1.50 కి.మీ.కు పైగా మానేరుపై నిర్మించాల్సి ఉంటుంది. దీనితో నిర్మాణ వ్యయం రెట్టింపవుతుందని భావిస్తున్నారు. ఈ మూడు ప్రతిపాదనలు మండలంలోని ఆయా గ్రామాల ప్రజల నుంచి వస్తుండడంతో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్ వాటిని పరిశీలించారు. అయితే ఎక్కడ వంతెన నిర్మించాలనే విషయంలో వారు ఒక నిర్ణయానికి రాలేదు, ఇప్పటి వరకు ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటించలేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మొదలు ప్రతిపాదించిన మేరకు నిధులు విడుదల చేయడంతో ఇప్పుడు వంతెన నిర్మాణం ఎక్కడ అన్నది తప్పకుండా తేలాల్సిన అవసరం వచ్చింది. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ అయిన కేంద్రమంత్రి ఏ నిర్ణయం తీసుకుంటారన్న విషయం పట్ల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.