పంచాయతీలకు నిలిచిన నిధులు
ABN , Publish Date - May 28 , 2025 | 01:10 AM
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌ల పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక సంఘం నిధులను నిలిపి వేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా స్థానిక సంస్థలకు నిధులు ఇచ్చే పరిస్థితిలో లేకపోవడంతో గడిచిన 15 నెలలుగా పల్లెల్లో పాలన అస్తవ్యస్తంగా మారింది.
జగిత్యాల, మే 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌ల పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక సంఘం నిధులను నిలిపి వేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా స్థానిక సంస్థలకు నిధులు ఇచ్చే పరిస్థితిలో లేకపోవడంతో గడిచిన 15 నెలలుగా పల్లెల్లో పాలన అస్తవ్యస్తంగా మారింది. జిల్లా, మండల పరిషత్ కార్యాలయాల నిర్వహణ కష్టతరంగా మారింది. గ్రామ పంచాయతీ కార్యదర్శులు అప్పులు చేసి మరి అత్యవసర పనులు చేయిస్తున్నారు. 2024 ఫిబ్రవరితో గ్రామ పంచాయతీల్లో పాలక వర్గాల పదవీ కాలం పూర్తయ్యింది. వెంటనే ఎన్నికల నిర్వహణ చేపట్టాల్సి ఉండగా కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలన పెట్టింది. ఏడాదిన్నర కావస్తున్నా పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎలాంటి అడుగులు పడటం లేదు. ఇక మండల, జిల్లా పరిషత్ పాలకవర్గాల కాల పరిమితి కూడా 2024 జులై 5వ తేదీతో ముగిసింది. దీంతో పరిషత్ ఎన్నికల నిర్వహణ లేకపోవడంతో వాటలోనూ ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది.
ఫఆర్థిక సంఘం నిధుల ఖర్చు ఇలా...
స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఆయా గ్రామాల జనాభాను బట్టి ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తుంది. కేంద్రం ఇచ్చే నిధులతో పాటు రాష్ట్రం ఇచ్చే గ్రాంట్‌ని అందులో కలిపి ఇవ్వాలనే నిబంధన ఉంది. అయితే పాలకవర్గాలు లేకపోవడంతో ఆర్థిక సంఘం నిధుల విడుదలని నిలిపి వేసింది. కేంద్రం నుంచి జిల్లాకు వచ్చే మొత్తం నిధుల్లో 5 శాతం జిల్లా పరిషత్‌కు, 10 శాతం మండల పరిషత్‌లకు, 85 శాతం గ్రామ పంచాయతీలకు కేటాయిస్తారు. దీంతో ఆయా పాలక వర్గాల్లోని ప్రజాప్రతినిధులు వారి పరిధిలో అభివృద్ధి పనులు చేసేందుకు అవకాశం ఉండేది. ఆ వచ్చిన నిధుల్లోనే 6 శాతం కార్యాలయాల నిర్వహణకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పంచాయతీల్లో విద్యుత్, నెట్ బిల్లులు, వాహనాల అద్దె చెల్లింపు, ఇతర ఖర్చులకు వినియోగించేవారు. కేంద్రం నిధులు నిలిపివేయడంతో ఇప్పుడు ఈ చెల్లింపులన్నీ నిలిచిపోయాయి.
ఫఅప్పుల్లో కార్యదర్శులు..
వర్షాకాలంలో గ్రామాల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా డబ్బులు లేవు. ప్రతీ నెల విద్యుత్ బిల్లులు, ట్రాక్టర్ ఈఎంఐలు, పారిశుధ్య కార్మికులకు వేతనాలు, వీధి దీపాల నిర్వహణ తదితర పనుల కోసం అప్పులు చేయాల్సి వచ్చిందని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్లులు వస్తాయనే ఆశతో కార్యదర్శులు అప్పులు తీసుకువచ్చి మరీ పనులు చేయిస్తున్నారు. సకాలంలో బిల్లులు మంజూరు కాకపోవడంతో ఇటు బిల్లులు రాక అటు వడ్డీలు పెరిగి అప్పుల పాలవుతున్నారు. మండల పరిషత్తులకు సంబంధించి రెండేళ్ల నుంచి ఎంపీడీవోల వాహనాలకు అద్దె చెల్లింపులు, ఇంటర్నెట్ బిల్లులు, విద్యుత్ బిల్లుల చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లా పరిషత్‌లో నిల్వ ఉన్న ఫండ్ నుంచి కార్యాలయం నిర్వహణ కొనసాగిస్తుండగా రానున్న రోజుల్లో అది కూడా ప్రశ్నార్థకంగా మారనుంది. ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి, ఆర్థిక సంఘం నిధులు విడుదల అయ్యేలా చొరవ చూపి గ్రామాల అభివృద్ధికి బాటలు వేయాలని ప్రజలు కోరుతున్నారు.
నిర్వహణ భారంగా మారింది
-సంతోష్‌రావు, జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం ప్రధాన కార్యదర్శి
పంచాయతీల అభివృద్ధికి మా వంతు కృషి చేస్తున్నాం. గ్రామాల్లో ప్రగతి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుకుంటున్నాం. ప్రభుత్వాల నుంచి నిధులు విడుదల కాక నిర్వహణ భారంగా మారింది. అప్పులు చేసి పనులు చేయాల్సి వస్తోంది.
నిధుల విడుదలకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం
-సీహెచ్ మదన్‌మోహన్, జిల్లా పంచాయతీ అధికారి
పంచాయతీలకు నిధులు విడుదల కాని మాట వాస్తవం. నిధులు విడుదల చేయాలని ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. నిధులు ఖాతాల్లో జమ అవుతాయని ఆశిస్తున్నాం. పంచాయతీల అభివృద్ధికి అందరి సహకారం అవసరం.