Share News

ఆన్‌లైన్‌ పెట్టుబడుల పేరుతో మోసం

ABN , Publish Date - Oct 13 , 2025 | 01:10 AM

మెటా ఫండ్‌ ప్రో అనే క్రిప్టో కరెన్సీ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే మూడింతలు లాభాలు వస్తాయని ప్రజలను మోసం చేసిన వ్యవహారాలు జగిత్యాలలో వెలుగులోకి వస్తున్నాయి.

ఆన్‌లైన్‌ పెట్టుబడుల పేరుతో మోసం

జగిత్యాల, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): మెటా ఫండ్‌ ప్రో అనే క్రిప్టో కరెన్సీ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే మూడింతలు లాభాలు వస్తాయని ప్రజలను మోసం చేసిన వ్యవహారాలు జగిత్యాలలో వెలుగులోకి వస్తున్నాయి. యేడాది క్రితం పలువురు వ్యక్తులు కీలకంగా వ్యవహరించి భారీగా పెట్టుబడులు పెట్టించారు. మెటా ఫండ్‌ ప్రో అనే యాప్‌లో పెట్టుబడి పెడితే మూడింతల లాభాలు వస్తాయని నమ్మించి మోసం చేస్తున్న ఘటనలు ఒక్కొక్కటికి బయటకు వస్తున్నాయి. ఎక్కువ మందిని స్కీమ్‌లో జాయిన్‌ చేస్తే భారీగా డబ్బు సంపాదించవచ్చని ఆశ చూపి పెట్టుబడులు రాబట్టారు. ఈ వ్యవహారంలో జగిత్యాల, కొడిమ్యాల పోలీసులు ఇప్పటికే ముగ్గురు వ్యక్తులపై రెండు కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. కేసులో ఇంకా ఎవరెవరి పాత్ర ఎంత ఉందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఫకొడిమ్యాలలో ఫిర్యాదుతో వెలుగులోకి..

కొడిమ్యాలకు చెందిన రాయనవేని వసంత, అడ్లగట్ట రమేశ్‌, బొల్లం రాకేశ్‌లతో మెటా మాస్క్‌ క్రిప్టో కరెన్సీ వ్యాలెట్‌ యాప్‌లో అదే గ్రామానికి చెందిన వీరబత్తిని రాజు, సింగిరెడ్డి తిరుపతి రెడ్డి, జగిత్యాలకు కస్తూరి రాకేశ్‌ కుమార్‌లు గత యేడాది రూ.20.50 లక్షల పెట్టుబడిని పెట్టించారు. తమ పెట్టుబడులకు సంబంధించిన వివరాలపై ఇటీవల బాధితులు అడగ్గా కొన్ని రోజుల్లో డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని నమ్మిస్తూ దాటవేసి ధోరణితో వ్యవహరించారు. దీంతో అనుమానంతో రాయనవేని వసంత కొడిమ్యాల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఈనెల 9న తిరుపతిరెడ్డి, రాజులను కొడిమ్యాల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు ఈనెల 10వ తేదీన జగిత్యాలకు చెందిన కస్తూరి రాకేశ్‌ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ అశోక్‌ కుమార్‌ ఆదేశాలతో రాకేశ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి వద్ద ఒక ల్యాప్‌ టాప్‌, రూ.లక్ష నగదు, బ్యాంకు పాసుపుస్తకాలు, ఏటీఎం కార్డులు, క్రెడిట్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల క్రితం జగిత్యాల పోలీస్‌ స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. జగిత్యాలకు చెందిన కస్తూరి రాకేశ్‌ యేడాది క్రితం తనను నమ్మించి ఓ యాప్‌లో పెట్టుబడి పెట్టించి రూ.85 లక్షలు మోసం చేసినట్లు పట్టణానికి చెందిన ఫజిల్‌ హమ్మద్‌ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఆన్‌లైన్‌ దందాలో జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.వంద కోట్ల పెట్టుబడులు రాబట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది.

ఫమొదట్లో అధిక లాభాలు చూపించి మోసం..

యేడాది క్రితం జిల్లాలోని పలు పట్టణాలు, గ్రామాల్లో పేరేదైనా ఆన్‌లైన్‌ చైన్‌ దందాలన్నీ ఒకేలా పనిచేశాయి. మొదట్లో ఆకాశానికెత్తే లాభాలు చూపాయి. మెల్లాగా చైన్‌ దందాలో ఇరికించాయి. ఇక ‘నువ్వు కూడా ఓ పది మందిని జాయిన్‌ చేస్తేనే నీకు లాభాలు వస్తాయి..’ అనే పరిస్థితిని తీసుకువచ్చాయి. అధిక లాభాలు వస్తాయన్న అత్యాశతో కొందరు మధ్య తరగతి ప్రజలు రూ.లక్షల్లో పెట్టారు. చిన్నపాటి కిరాణా దుకాణం నడిపే వారు సైతం అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెట్టారు. వీరితో పాటు పలువురు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, పోలీసులు సైతం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. బంగారు ఆభరణాలు, కార్లు, ప్లాట్లు అమ్ముకొని లాభాలు వస్తాయన్న ఆశతో మధ్య తరగతి కుటుంబాల వారు ఆన్‌లైన్‌ దందాలో పెట్టుబడులు పెట్టారు. తాజాగా వెలుగులోకి వచ్చిన వ్యవహారంలో యూబిట్‌ బిజినెస్‌లోని మెటా ఫండ్‌ వ్యాలెట్‌ యాప్‌ కారణమైంది. సమాజంలో వైట్‌ కాలర్‌గా గుర్తింపు ఉన్న పలువురు యూబిట్‌ దందాలో ఉండడమే జిల్లాలో వేగంగా విస్తరించడానికి కారణంగా మారిందన్న అభిప్రాయాలున్నాయి. పలువురు మాజీ ప్రజాప్రతినిధులు ఈ దందాను ముందుగా జిల్లాకు తీసుకువచ్చారనే ప్రచారం ఉంది. జిల్లా కేంద్రంతో పాటు దరూర్‌, కోరుట్ల, ఇతర ప్రాంతాలకు చెందిన పలువురు కీలక వ్యక్తులు యూబిట్‌ దందాలో ప్రభావం చూపారని తెలుస్తోంది.

ఫవిదేశీ టూర్ల పేరుతో..

ఆన్‌లైన్‌ వడ్డీ వ్యాపారంలో డాలర్ల రూపంలో పెట్టుబడి పెట్టించడానికి నిర్వాహకులు, ఏజెంట్లు విదేశీ టూర్ల పేరుతో పలువురిని ఆకర్షించారు. ఓ యాప్‌లో పెట్టుబడి లెక్కన దేశ విదేశాలకు టూర్లు ఆఫర్‌ ఇచ్చారు. రూ.90 వేలు పెడితే గోవా, రూ.5 లక్షలకు సింగాపూర్‌, రూ.12 లక్షలకు యూరఫ్‌ దేశాలకు టూర్లు అంటూ వ్యాపారులు, యువతను ఆకర్శించారు. వందల సంఖ్యలో వ్యాపారులు, యువతను టూర్లకు తిప్పి పెట్టుబడులు పెట్టించినట్లు పలువురు బాధితులు పేర్కొంటున్నారు. జిల్లాలో ఆన్‌లైన్‌ వ్యాపారాల్లో మనీ లాండరింగ్‌, హవాలా జరిగిందన్న అనుమానాలు సైతం పలువురు వ్యక్తం చేస్తున్నారు. కొందరు హైదరాబాద్‌తో పాటు విదేశాల్లో ఉంటూ క్రిప్టో కరెన్సీ పేరిట ఫేక్‌ యాప్‌ ద్వారా దందా చేసినట్లుగా ఆరోపిస్తున్నారు. క్రిప్టో కరెన్సీ అంటూ వివిధ పేర్లతో గల యాప్‌ల ద్వారా దందాను గుట్టుగా సాగించారు. ఇందులో లాభాలు తొలుత అధికంగా కనిపించడంతో సభ్యుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. దీంతో జిల్లా పోలీసులు ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించి రెండు వేర్వేరు కేసులు నమోదు చేసి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ దందాలో కీలకంగా వ్యవహరించిన రాకేశ్‌ విచారించిన పోలీసులు హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రధాన సూత్రదారి తీరును పరిశీలిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. పోలీసుల విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

-అశోక్‌ కుమార్‌, ఎస్పీ

జిల్లాలో చైన్‌ సిస్టం, ఆన్‌లైన్‌ వ్యాపారాలు, యాప్‌లో పెట్టుబడుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలి. అధిక లాభాలు వస్తాయని ఆశ చూపే వారితో అప్రమత్తంగా వ్యవహరించి సరియైున నిర్ణయం తీసుకోవాలి. యాప్‌ల పట్ల మోసాలకు గురి కాకుండా వ్యవహరించాలి.

Updated Date - Oct 13 , 2025 | 01:10 AM