Share News

చేపలు ప్రకృతి ఇచ్చిన సంపద....

ABN , Publish Date - Jul 08 , 2025 | 12:38 AM

చేపలు ప్రకృతి ఇచ్చిన సంపద అని రాష్ట్ర పశుసంవర్థక, క్రీడా, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్‌ అన్నారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి మంత్రి వాకాటి శ్రీహరి సోమవారం కరీంనగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

చేపలు ప్రకృతి ఇచ్చిన సంపద....

కరీంనగర్‌ అర్బన్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి): చేపలు ప్రకృతి ఇచ్చిన సంపద అని రాష్ట్ర పశుసంవర్థక, క్రీడా, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్‌ అన్నారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి మంత్రి వాకాటి శ్రీహరి సోమవారం కరీంనగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కరీంనగర్‌లోని ఉజ్వలపార్క్‌ సమీపంలోని చేపపిల్లల పెంపకం కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం మత్స్యకారుల సంక్షేమం, అవగాహనపై సదస్సులో మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వాకాటి శ్రీహరి మాట్లాడుతూ గత ప్రభుత్వం మత్స్యశాఖను అవినీతిమయం చేసిందన్నారు. రాష్ట్రంలోని మత్స్య శాఖను ఆదర్శంగా తీర్చిద్దుతామన్నారు. మత్స్యకారులకు ణాణ్యమైన చేప పిల్లలు పంపిణీ చేస్తామన్నారు. కరీంనగర్‌లో చేపల ఉత్పత్తి బాగుందన్నారు. మత్స్యకారుల కోసం కోల్డ్‌స్టోరేజ్‌లు ఏర్పాటు చేస్తామని, అది కరీంనగర్‌ నుంచే ప్రారంభిస్తామన్నారు. మత్స్యకారులకు ఉపయోగపడేవిధంగా మోపెడ్‌లు రూపొందించి వారికి అందిస్తామన్నారు.

ఫ నాకిచ్చిన శాఖలను అద్భుతంగా తీర్చిదిద్దుతా..

తనకు ఇచ్చిన శాఖలు గందరగోళంగా ఉన్నాయని, వాటిని అద్భుతంగా తీర్చిదిద్దుతానని మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్‌ అన్నారు. గతంలో సబ్సిడీ గొర్రెల విషయంలో, చేపల పంపిణీలో భారీ అవినీతి జరిగిందన్నారు. ఈ సారి చేపల పంపిణీ కోసం 19 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారని తెలిపారు. తాను కేబినెట్‌ సమావేశంలో మరిన్ని నిధులు కోరగా ప్రత్యేక నిధుల కింద 120 కోట్లు మంజూరు చేశారన్నారు.

ఫ మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ... గత ప్రభుత్వ హయాంలో చేప పిల్లల పంపిణీ, కొనుగోళ్లలో అవినీతి జరిగిందని, వాటిని సవరించి పంపిణీ చేసే సరికి మొదటి సంవత్సరం కొంత ఆలస్యం జరిగిందన్నారు. లోయర్‌ మానేరు డ్యామ్‌, మిడ్‌ మానేరు, ఎల్లంపల్లి, చెరువుల్లో చేపల పెంపకాన్ని పెద్ద ఎత్తున పెంచుతున్నారన్నారు. చేప పిల్లల పెంపకంలో రాష్ట్రంలో కరీంనగర్‌ ప్రథమ స్థానంలో ఉందన్నారు. కార్యక్రమంలో శాట్‌ చైర్మన్‌ శివసేనారెడ్డి, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కలెక్టర్‌ పమేలా సత్పతి తదితరులు పాల్గొన్నారు.

ఫ ఇస్కాన్‌ ఆలయంకు స్థలం ఇవ్వవద్దు....

మత్స్యశాఖకు కరీంనగర్‌లో కేటాయించిన స్థలంలో కొంత భాగాన్ని ఇస్కాన్‌ ఆలయానికి ఇచ్చారని, దానిని రద్దుచేసి తిరిగి మత్స్యశాఖకే కేటాయించాలని కరీంనగర్‌ మత్స్యశాఖ సొసైటీ చైర్మన్‌ పిట్టల రవీందర్‌తోపాటు పలువురు మత్స్యకారులు మంత్రులను కోరారు. కోల్డ్‌స్టోరేజీలను ఏర్పాటు చేయాలని, నాణ్యమైన చేపపిల్లలను అందించాలని మత్స్యకారులు కోరారు. గతంలో చేప పిల్లల సంఖ్య లక్షల్లో చెప్పినప్పటికీ అంతసంఖ్యలో పంపిణీ కాలేదని, రికార్డులు మాత్రం నమోదు అయ్యేవని, ఇప్పుడు అలా జరగకుండా చూడాలని కోరారు. వీటన్నిటిపై సాకుకూలంగా స్పందించిన మంత్రులు అన్ని సమస్యలు పరిష్కరిస్తామని, మత్స్యకారులను అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

ఫ తరగతి గదులు ప్రారంభం

కరీంనగర్‌లోని పాత ఆర్ట్స్‌ కళాశాల వద్ద 36 లక్షల రూపాయలతో నిర్మించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల (ఓల్డ్‌) అదనపు తరగతి గదులను మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వాకిటి శ్రీహరి ప్రారంభించారు. మంత్రి పదవి చేపట్టిన తరువాత మొదటిసారి కరీంనగర్‌కు వచ్చిన మంత్రి వాకాటి శ్రీహరికి విద్యార్థులు, కాంగ్రెస్‌ నాయకులు ఘన స్వాగతం పలికారు.

Updated Date - Jul 08 , 2025 | 12:38 AM