Share News

తొలి విడత నామినేషన్ల పరిశీలన పూర్తి

ABN , Publish Date - Dec 01 , 2025 | 01:24 AM

తొలి విడతలో ఎన్నికలు జరుగుతున్న గ్రామపంచాయతీల్లో నామినేషన్ల పరిశీలన పూర్తయింది. మొదటి విడతలో ఒక సర్పంచ్‌, మూడు వార్డు సభ్యుల నామినేషన్లను తిరస్కరించారు.

తొలి విడత నామినేషన్ల పరిశీలన పూర్తి

- ఒక సర్పంచు, 3 వార్డు సభ్యుల నామినేషన్ల తిరస్కరణ

- 92 సర్పంచు పదవులకు 463 మంది అభ్యర్థులు

- 866 వార్డులకు 1939 మంది అభ్యర్థులు

- రెండవ విడత నామినేషన్ల స్వీకరణ ప్రారంభం

- తొలి రోజు సర్పంచు పదవులకు 121 నామినేషన్లు

- వార్డులకు 209 నామినేషన్లు

(ఆంధ్రజ్యోతి ప్రతినిఽధి, కరీంనగర్‌)

తొలి విడతలో ఎన్నికలు జరుగుతున్న గ్రామపంచాయతీల్లో నామినేషన్ల పరిశీలన పూర్తయింది. మొదటి విడతలో ఒక సర్పంచ్‌, మూడు వార్డు సభ్యుల నామినేషన్లను తిరస్కరించారు.

- గంగాధర మండలంలోని మల్లాపూర్‌ పంచాయతీ సర్పంచ్‌ పదవి ఎస్సీ రిజర్వుడ్‌ కాగా ఆ గ్రామానికి చెందిన రాధ నామినేషన్‌ వేశారు. ఎస్సీ వర్గానికి చెందిన ఆమె ముస్లిం యువకుడిని వివాహం చేసుకుంది. రాధ ముస్లిం యువకుడిని ఆ మత ఆచారం ప్రకారం వివాహం చేసుకున్నదని, దీంతో ఆమె బీసీ కేటగిరీ కిందకు వస్తుందని ఆమె ప్రత్యర్థులు రిటర్నింగ్‌ అధికారికి ఆధారాలు చూపుతూ ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె నామినేషన్‌ను తిరస్కరించారు. ఆమె సోమవారం అప్పీలు చేసుకోనున్నట్లు సమాచారం.

- గంగాధర మండలంలోని మధురానగర్‌, ముప్పిడి నర్సయ్యపల్లి వార్డులలో రెండు నామినేషన్లను తిరస్కరించారు. కొత్తపల్లి మండలంలోని ఎలగందుల్‌ రెండో వార్డులో అభ్యర్థి వయస్సు తక్కువగా ఉండడంతో ఒక నామినేషన్‌ను తిరస్కరించారు. ఇది మినహా మిగతా అన్ని నామినేషన్లు సక్రమంగానే ఉన్నట్లు పరిశీలనలో తేలింది.

- చొప్పదండి మండలం దేశాయిపేట గ్రామపంచాయతీలోని సర్పంచ్‌ పదవితో సహా ఎనిమిది వార్డులకు సింగిల్‌ నామినేషన్‌ రావడంతో ఏకగ్రీవమయ్యింది. గంగాధర మండలంలో 66 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.

- కరీంనగర్‌ రూరల్‌ మండలంలో 25 వార్డులకు సింగిల్‌ నామినేషన్లు వచ్చాయి. కొత్తపల్లి మండలంలో ఐదు వార్డులకు సింగిల్‌ నామినేషన్లు వచ్చాయి.

- జిల్లాలో తొలి విడతలో ఎన్నికలు జరుగుతున్న 92 గ్రామపంచాయతీల్లో 463 మంది సర్పంచు అభ్యర్థులు బరిలో ఉన్నారు. 866 వార్డులకు 1,939 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నామినేషన్లపై అభ్యంతరాలు ఉంటే సోమవారం సాయంత్రం 5 గంటల వరకు ఫిర్యాదు చేసుకోవచ్చు. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలుంటే పరిష్కరిస్తారు. నామినేషన్లు వేసిన వారు అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవడానికి డిసెంబరు 3న మధ్యాహ్నం 3 గంటల వరకు అనుమతిస్తారు. ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. డిసెంబరు 11న తొలి విడత ఎన్నికలు జరుగుతాయి. అదేరోజు ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.

ఫ రెండో విడత లో 113 గ్రామాల్లో ఎన్నికలు

డిసెంబరు 14న ఎన్నికలు జరిగే చిగురుమామిడి, గన్నేరువరం, మానకొండూర్‌, శంకరపట్నం, తిమ్మాపూర్‌ మండలాల్లోని 113 గ్రామపంచాయతీలకు చెందిన 113 సర్పంచ్‌ పదవులు, 1,046 వార్డు సభ్యులకు నామినేషన్ల స్వీకరణ ఆదివారం ప్రారంభమైంది. తొలిరోజు 113 సర్పంచ్‌ పదవులకు 121 నామినేషన్లు, 1046 వార్డులకు 209 నామినేషన్లు వచ్చాయి. చిగురుమామిడి మండలంలో సర్పంచ్‌ పదవులకు 16 మంది, వార్డు సభ్యులకు 32 మంది నామినేషన్లు వేశారు. మానకొండూర్‌ మండలంలో సర్పంచ్‌ పదవులకు 30, వార్డు పదవులకు 65 మంది, శంకరపట్నం మండలంలో 35 మంది సర్పంచ్‌ పదవులకు, 50 మంది వార్డు పదవులకు నామినేషన్‌ దాఖలు చేశారు. గన్నేరువరం మండలంలో 10 మంది సర్పంచ్‌ పదవులకు, 17 మంది వార్డు పదవులకు, తిమ్మాపూర్‌ మండలంలో 30 మంది సర్పంచ్‌ పదవులకు, 45 మంది వార్డు సభ్యులకు నామినేషన్లు వేశారు. డిసెంబరు 2 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 3న నామినేషన్లను పరిశీలిస్తారు.

ఫ ఓ వైపు ఉపసంహరణకు యత్నాలు... మరోవైపు ప్రచారం

మొదటి విడత జరిగే పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల పరిశీలన పూర్తయ్యింది. దీంతో అభ్యర్థులు నామినేషన్లు వేసిన కొందరిని పోటీ నుంచి ఉపసంహరింప చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సర్పంచ్‌, వార్డు సభ్యుల కోసం కొన్ని చోట్ల ఎక్కువ మంది నామినేషన్లు వేయగా, మరికొన్ని చోట్ల ఇద్దరు, ముగ్గురు మాత్రమే బరిలో ఉన్నారు. తక్కువ మంది ఉన్న చోట ఏకగ్రీవం కోసం పోటీదారులను నామినేషన్ల ఉపసంహరణ కోసం బుజ్జగింపులు ప్రారంభమయ్యాయి. నామినేషన్‌ ఉపసంహరించుకుని మద్దతు ఇవ్వాలంటూ ప్రాధేయపడటం, బుజ్జగించడం వంటి వాటితో గ్రామాల్లో రాజకీయం వేడెక్కింది. ఉపసంహరణకు రెండు రోజులు గడువు ఉండడంతో ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.

Updated Date - Dec 01 , 2025 | 01:25 AM